
విమానం నుంచి మహిళను దించేశారు
ముంబై: సెలబ్రిటీలా ఫోజు కొడుతూ తోటి ప్రయాణికులు, విమాన సిబ్బందిపై దాడి చేసి దుర్బాషలాడిన మహిళను గో ఎయిర్ విమానం నుంచి దించివేసిన ఘటన ముంబై ఎయిర్ పోర్టులో గురువారం చోటు చేసుకుంది. ముంబై-లక్నో జీ8 387 విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్న ఓ మహిళ ఏరోబ్రిడ్జి మీదుగా విమానం ఎక్కుతున్నప్పుడు తన హ్యాండ్ బ్యాగ్ ను తోటి ప్రయాణికులపై విసిరికొట్టింది. అంతేకాకుండా తన ముందు నిలుచున్న ప్రయాణికులను తోసేసి విమానంలోకి దూసుకొచ్చింది.
ఆమె గురించి ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో విమాన సిబ్బంది జోక్యం చేసుకున్నారు. ఆమెకు సర్ది చెప్పేందుకు గో ఎయిర్ సిబ్బంది ప్రయత్నించగాపై వారిని నోటికొచ్చినట్టు తిట్టింది. విమాన ప్రయాణం నిబంధనలు ఉల్లఘించినందుకు ఆమెను కిందకు దించేశారు. ఈ ఘటన గురించి సీఐఎస్ఎఫ్ కు తెలిపినట్టు గో ఎయిర్ వెల్లడించింది.