శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్రికుల బస్సును లక్ష్యంగా చేసుకుని లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో మరొ యాత్రికురాలు మృతిచెందారు. గత సోమవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో గాయపడ్డ ఓ మహిళా యాత్రికురాలు లలిత చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. మృతులంతా గుజరాత్, మహారాష్ట్రకు చెందినవారే. గత సోమవారం (జులై 10న) అమర్‌నాథ్ యాత్ర పూర్తిచేసుకుని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికులపై జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ కాల్పుల్లో ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ సలీం వీరోచితంగా ప్రవర్తించి బస్సును వేగంగా నడిపినందుకు ప్రాణనష్టం తీవ్రత మరింత పెరగలేదన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడిలో గాయపడ్డ ఓ యాత్రికురాలు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిది చేరగా, అందులో మహిళలే ఏడుగురు కావడం గమనార్హం. ఉగ్రదాడి అనంతరం భద్రతను మరింత పటిష్టం చేసిన అధికారులు అమర్‌నాథ్ యాత్రకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు గురువారం అదుపులోకి తీసుకున్నాయి.
ఎనిమిదికి చేరిన ‘అమర్‌నాథ్’ మృతులు
Published Sun, Jul 16 2017 11:27 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM
Advertisement
Advertisement