ఉడీ దాడి నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. దాడిలో పాక్ జాతీయుల పాత్రకు సంబంధించి వీలైనన్ని ఎక్కువ ఆధారాలను సేకరించింది.
న్యూఢిల్లీ: ఉడీ దాడి నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. దాడిలో పాక్ జాతీయుల పాత్రకు సంబంధించి వీలైనన్ని ఎక్కువ ఆధారాలను సేకరించింది. పఠాన్‌కోట్ ఘటనలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పాత్రపై విచారణకు ఆ దేశ సంయుక్త విచారణ కమిటీ వచ్చినట్లుగా ఈ సారి అలాంటి అవకాశాలేం లేకుండా భారతే అన్ని వివరాలను అందిస్తోంది. బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి భారత్‌లో పాక్ కమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించిన విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్.. దాడిలో ఉగ్రవాదుల వద్ద లభ్యమైన వాకీ టాకీలు, పాక్ తయారీ గ్రనేడ్‌లు, వేలి ముద్రల వివరాలను అందజేశారు. ఒకవేళ పాకిస్తాన్ దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలనుకుంటే డీఎన్‌ఏ శాంపిల్స్, వేలిముద్రలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కాగా, ఉడీ ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య 56 ఏళ్ల క్రితం జరిగిన నదీజలాల (బియాస్, రావి, సట్లేజ్, సింధు, చీనాబ్, జీలం నదులు) ఒప్పందం తెరపైకి వచ్చింది. పాక్‌పై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ఈ ఒప్పందాన్ని పక్కనపెట్టి నీటి విడుదల ఆపాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ‘ఈ ఒప్పందం మొదటి పేజీలోనే గుడ్‌విల్ అని రాసుంది. పరస్పర సహకారం, అంగీకారం లేనప్పుడు ఈ ఒప్పందానికి అర్థమేముంటుంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.