పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. అయినా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. 25–40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో గుండెపోట్లు అధికంగా వస్తున్నాయని తాజా అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. 1990 నుంచి 2016 మధ్య కాలంలో భారత్‌లో గుండె జబ్బులు 50 శాతం పెరిగాయి. భారత్‌లో ఏటా సంభవించే మరణాల్లో 17 శాతం గుండె జబ్బుల కారణంగా జరిగేవే. దేశంలో 80 లక్షల నుంచి కోటి మంది గుండెపోటు రోగులున్నారు. ఇది ప్రపంచంలో 40 శాతానికి సమానం. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే 2000 సంవత్సరం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ గుండె జబ్బులు, గుండెపోట్లు ఎక్కువ అవుతూ ఉండటం.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో పల్లెలకూ ఓ విధమైన పట్టణ సంస్కృతి పాకింది. నగర ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లో పొగరాయుళ్లు ఎక్కువ. అందుకే పల్లెల్లో గుండె జబ్బులు ఎక్కువైపోతున్నాయి. గ్రామీణ భారతంలో గుండె జబ్బులు పురుషుల్లో 40 శాతం, మహిళల్లో 56 శాతం వరకూ ఎక్కువైనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులతో వచ్చే మరణాలు తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అధికంగా ఉంటే, గుండెపోట్లు వచ్చి మరణించేవారు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ. భారత్ ఇప్పటికే మధుమేహ వ్యాధిలో ప్రపంచ దేశాలకు రాజధానిగా మారింది. షుగర్ వ్యాధి హార్ట్ ఫెయిల్యూర్‌కి దారితీస్తూ భారత్‌లో గుండె వ్యాధిగ్రస్తుల సంఖ్యను పెంచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment