సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడి, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది యాసీన్ భత్కల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ సిటీ సెషన్స్ కోర్టు గత వారం కొట్టేసింది. కేసు విచారణ కోసం బెంగళూరు తరలించడం సాధ్యం కాదని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ట్రయల్ జరుగుతుందని స్పష్టం చేసింది.
కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన యాసీన్ గజ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌లకు సమీప బంధువు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్ వద్ద చేసిన జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆపరేషన్. అదే ఏడాది ఆగస్టులో పట్టుబడిన ‘యాసీన్ అండ్ కో’కు చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గత ఏడాది ఉరి శిక్ష విధించింది. దీంతో ఇక్కడి కేసు విచారణ పూర్తి కాగా.. ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్ తదితరుల్ని తీసుకువెళ్లారు.
ప్రస్తుతం యాసీన్ భత్కల్‌ను తీహార్ జైల్లో ఉన్న ఏకాంత కారాగారం (సోలిటరీ కన్ఫైన్‌మెంట్)లో ఉంచారు. ఓపక్క ఢిల్లీ సెషన్స్ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో భత్కల్‌ను బెంగళూరు న్యాయస్థానం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తోంది. అయితే యాసీన్ గత నెలలో ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు.
కెమెరా అంటే సిగ్గు ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి ఇబ్బందిగా ఉందంటూ అందులో పేర్కొన్నాడు. స్వేచ్ఛాయుతంగా కేసు విచారణ జరగాలంటే తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా బెంగళూరు తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. భద్రతా కారణాల నేపథ్యంలో యాసీన్ భత్కల్ లాంటి ఉగ్రవాదిని విచారణ కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న అంశమంటూ పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.
తీహార్ జైల్లో ఉండాల్సిందే!
Published Tue, May 1 2018 2:37 AM | Last Updated on Tue, May 1 2018 9:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment