‘పవర్‌లో ఉన్నాం.. ఇక ధర్నాలొద్దు’
లక్నో: ‘ఇక నుంచి ధర్నాలు, రాస్తారోకోలో చేయడం మీ పనికాదు’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ బీజేపీ కార్యకర్తలకు సూచించారు. తొలిసారి బుందేల్‌ఖండ్‌కు వచ్చిన ఆయన ఆ ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులను ధర్నాలు, నిరసనలతో అడ్డుకునే ప్రయత్నం చేయొద్దంటూ కాస్తంత గట్టిగా హెచ్చరించారు. ‘ఏదైనా సమస్య ఉంటే పార్టీ కార్యాలయంలో ఉండేవారికి లేదా, అధికారులకు తెలియజేయండి. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు, ఆందోళనలకు న్యాయసమ్మతమే. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ఇప్పుడు మీ పని అది కాదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మీ ముందున్న పని’ అని ఆయన చెప్పారు.
బుందేల్ ఖండ్ నుంచి నేరుగా ఢిల్లీకి ఆరు లేన్ల రహదారిని నిర్మించే ఆలోచన చేస్తున్నామని అన్నారు. మరోపక్క, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌కు చెందిన మరో ప్రాజెక్టుపై యోగి విశ్లేషణ ప్రారంభించారు. నాలుగు నెలల కిందట అఖిలేశ్ పూర్తి చేసి ప్రారంభించిన లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలు జరిగాయని, పెద్ద మొత్తంలో కుంభకోణం చోటుచేసుకుందని, రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపణలు రావడంతో ఆ ప్రాజెక్టు తీరు తెన్నులను యోగి పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టుకు అయిన వ్యయం, రహదారి నిర్మాణం విషయంలో రైతుల నుంచి తీసుకున్న భూములకు చెల్లించిన నష్టపరిహారం తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. అయితే, ప్రాజెక్టులను తప్పు బట్టడం తమ ఉద్దేశం కాదని, బాధిత రైతులకు న్యాయం జరిగిందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.