‘ప్రతీకారం తీర్చుకుంటాం.. ఆస్తులు వేలం వేస్తాం’ | Yogi Adityanath Strong Warning Who Vandalised Public Assets Over CAA | Sakshi
Sakshi News home page

వాళ్ల ఆస్తులు వేలం వేస్తాం: యూపీ సీఎం

Published Fri, Dec 20 2019 10:39 AM | Last Updated on Fri, Dec 20 2019 10:54 AM

Yogi Adityanath Strong Warning Who Vandalised Public Assets Over CAA - Sakshi

లక్నో: నిరసన పేరిట హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో యూపీలో సైతం ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొడుతుండగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే పేరిట కాంగ్రెస్‌ పార్టీ, ఎస్పీ, వామ పక్షాలు దేశాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయి. లక్నో, సంభాల్‌లో తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి.. వారి ఆస్తులను వేలం వేసి.. జరిగిన నష్టాన్ని పూడుస్తాం. మీరు చేసిన పనులు సీసీటీవీలో ఫుటేజీల్లో రికార్డయ్యాయి. ఇందుకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని హెచ్చరికలు జారీ చేశారు.( దేశ వ్యాప్తంగా ఆందోళనలు.. అరెస్ట్‌లు)

అదే విధంగా రాష్ట్రంలో పలుచోట్ల 144 సెక్షన్‌ అమల్లో ఉందని.. అనుమతి లేకుండా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు ఉంటాయని యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. ఆందోళనకారుల కారణంగా సామాన్య పౌరులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోమని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదని, హింసకు గురై భారత్‌కు శరణార్థులుగా వచ్చే మైనార్టీలకు మాత్రమే మేలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... సంభాల్‌లో హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 17 మందిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరిలో పలువురు సమాజ్‌వాదీ పార్టీ నేతలు, ఎంపీ షఫికర్‌ రహమాన్‌ బర్క్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement