ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం తాజ్‌మహల్‌ను సందర్శించారు. ప్రపంచంలోని అద్భుతమైన నిర్మాణాల్లో ఒక్కటైన తాజ్‌మహల్‌పై ఇటీవల బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎం యోగి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నేరుగా ఆగ్రాకు చేరుకున్న సీఎం యోగి.. తాజ్‌మహల్ పశ్చిమ గేటు ఎదుట 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు తొడిగి.. స్వయంగా చీపురుకట్ట పట్టుకొని రోడ్లను ఊడ్చారు.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్‌ను సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత యోగి సందర్శించడం ఇదే తొలిసారి. తాజ్‌మహల్ భారత సంస్కృతిపై మచ్చ అని బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వ్యాఖ్యానించడం, తాజ్‌మహల్ ఒకప్పుడు శివాలయం 'తెజోమహల్' అని బీజేపీ నేత వినయ్ కటియార్ పేర్కొనడం కమలం పార్టీని ఇరకాటంలో నెట్టేసింది. ఈ వ్యాఖ్యల వివాదాన్ని తోసిపుచ్చిన సీఎం యోగి.. ఈ కట్టడాన్ని ఎవరు, ఎందుకు కట్టారన్నది ముఖ్యం కాదని, భారతీయ కార్మికులు తమ స్వేదం, రక్తం చిందించి తాజ్‌మహల్‌ను నిర్మించారన్న విషయాన్ని మరువరాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment