అఖిలేశ్ ప్రాజెక్టుపై సీఎం యోగి టఫ్ రివ్యూ
లక్నో: అభివృద్ధి చేయడంతోపాటు రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చడమే తన లక్ష్యం అని ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. గత 150గంటల్లోనే 50 నిర్ణయాలు అభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న ఆయన తాజాగా అవినీతిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తొలి కొరడా దెబ్బను మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ పెట్ ప్రాజెక్టు అయిన గోమతి రివర్ ఫ్రంట్‌పై ప్రయోగించారు.
అనూహ్యంగా ఆ ప్రాజెక్టు అనుమతులు, నిర్వహణా బాధ్యతలు చూస్తున్న అధికారులతో సమావేశం అయ్యారు. ఈ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరిట అక్కడ నిర్మించిన ల్యాండ్ స్కేప్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, ఇతర డిజైన్లు ఏవీ కూడా ఆదిత్యనాథ్‌ను పెద్దగా ఆకర్షించలేదు. పైగా ఆ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు అక్కడ పూర్తయిన పనులకు పొంతన లేకుండా పోయింది. దీంతో ప్రత్యేక సమావేశం అయిన ఆదిత్యానాథ్ అవినీతిని తాను ఏ మాత్రం సహించబోనని హెచ్చరించారు. రెండేళ్లుగా నిర్మిస్తున్న ఈప్రాజెక్టుకు మొత్తం రూ.1500కోట్లు కేటాయించగా అందులో రూ.1427 కోట్లను ఇప్పటికే ఖర్చు చేశారు.
అయితే, పనులు మాత్రం కేవలం 60శాతం మాత్రమే పూర్తయ్యాయి. పనుల నాణ్యతతోపాటు, వ్యయంలో కూడా తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన ఆదిత్యానాథ్ ప్రాజెక్టు వివరాలు మొత్తం అడిగారు. డబ్బును ఎలా ఖర్చు చేశారనే విషయాలు తనకు తెలియజేయాలని ఆదేశించారు. తన పరిపాలనలో 18గంటలపాటు అధికారులు ఎప్పుడంటే అప్పుడు పనిచేయాల్సిందేనని ఆదేశించిన యోగి ఆ విధంగానే ముందుకు వెళుతున్నారు. గోమతి ప్రాజెక్టును నమామి గంగే ప్రాజెక్టుకు అనుసంధానించి గంగా శుద్ధి కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.