
భారత్‌లో ‘యంగ్’ రాష్ట్రాలివే!
న్యూఢిల్లీ: భారత్‌లో యువజన రాష్ట్రాలు ఏవీ? అంటే నడి వయస్కుల వయస్సు తక్కువగా ఉన్న రాష్ట్రాలేవి ? ఈ ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే ముందు ప్రపంచంలోగానీ దేశంలోగానీ, ఓ రాష్ట్రంలోగానీ నడి వయస్కుల సగటు వయస్సును ఎలా నిర్ధారిస్తారో తెలుసుకోవాలి. ఓ దేశంలోగానీ ఓ రాష్ట్రంలోగానీ జనాభా మొత్తాన్ని వారి వయస్సులపరంగా లెక్కిస్తారు. ఆ జనాభాను వయస్సుల ఆధారంగానే రెండు భాగాలుగా విడగొట్టి వారిలో మధ్య వయస్సును నడి వయస్కుల సగటుగా తీసుకుంటారు. అంటే ఆ నడి వయస్కులకన్నా తక్కువ వయస్సున్న వారిని పిన్న వాళ్లని, ఎక్కువ వయస్సున్న వాళ్లను పెద్దలని పరిగణిస్తారు. ఈ నడి వయస్కుల వయస్సు ఏ ప్రాంతంలో తక్కువగా ఉంటే ఆ ప్రాంతాన్ని యవ్వన ప్రాంతమని, ఏ ప్రాంతంలో వారి వయస్సు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో వృద్ధతరం ఎక్కువగా ఉందని నిర్దారిస్తారు.
భారత దేశంలో నడి వయస్కుల సరాసరి సగటు వయస్సు 20 ఏళ్లతో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అత్యంత యవ్వన రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో 20 ఏళ్లలోపువారు సగం మంది ఉంటే 20 ఏళ్ల పైబడిన వాళ్లు అంతే సగం మంది ఉన్నరన్నమాట. నడి వయస్కుల సరాసరి సగటు వయస్సు 31 ఏళ్లతో కేరళ, 29 ఏళ్లతో తమిళనాడు రాష్ట్రాలు యవ్వన రాష్ట్రాల్లో బాగా వెనకబడి ఉన్నాయి. భారత్ సరాసరి నడి వయస్కుల సగటు 26. 6 ఏళ్లతో ప్రపంచంలో ఎనిమిదవ యువ దేశంగా కొనసాగుతోంది. 22.5 ఏళ్ల మధ్య వయస్కుల సగటుతో పాకిస్థాన్ మూడవ స్థానంలో, 38 ఏళ్ల సగటు వయస్సుతో చైనా 14వ స్థానంలో 38 ఏళ్ల సగటుతో అమెరికా 15వ స్థానంలో కొనసాగుతోంది. భారత్ మధ్య వయస్కుల సగటు వయస్సు 2001లో 22.51 ఉండగా, 2011లో అది 24 ఏళ్లకు చేరుకొంది. 2050 నాటికి అది 37 ఏళ్లకు చేరుకుంటుందని, అప్పటికీ చైనా సగటు 46 ఏళ్లకు, పాకిస్థాన్ సగటు 30.9 ఏళ్లకు చేరుకుంటుందని అంచనాలు తెలియజేస్తున్నాయి.
ప్రపంచంలోగానీ దేశంలోగానీ ఓ రాష్ట్రంలోగానీ నడి వయస్కుల సరాసరి సగటు వయస్సు ఎక్కువ ఉండడానికి, తక్కువ ఉండడానికి అక్కడి అభివృద్ధికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. యంగ్ నేషన్ అంటే సానుకూల అంశమేమి కాదిక్కడ. తక్కువ అభివృద్ధి సాధించిన ప్రాంతంలో నడి వయస్కుల వయస్సు తక్కువగాను, ఎక్కువ అభివృద్ధి సాధించిన ప్రాంతంలో ఎక్కువగాను ఉంటుంది. అభివృద్ధి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడమే కాకుండా అరోగ్య వసతులు అందుబాటులో ఉంటాయి. ఫలితంగా ప్రజల మరణాలు తక్కువగా ఉంటాయి. ప్రజలు ఎక్కువ కాలం బతుకుతారు.
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు దేశంలోనే వెనకబడిన పోవడం వల్లన అక్కడ నడి వయస్కుల వయస్సు తక్కువగా నమోదైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో శిశు మరణాలు ఎక్కువ. ఆరోగ్య వసతులు తక్కువ. పేదరికమూ ఎక్కువే. విద్యా రంగంలో కూడా వెనకబడి పోయాయి. అమెరికా, చైనా దేశాలు కూడా భారత్‌కన్నా అభివృద్ధి చెందిన దేశాలు అవడం వల్లనే ఆయా దేశాల్లో నడి వయస్కుల సగటు వయస్సు ఎక్కువ. మనకన్నా వెనకబడి ఉండడం వల్లనే పాకిస్థాన్‌లో తక్కువ ఉంది. 2011 జానాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని బెంగళూరుకు చెందిన ‘తక్షశిల ఇనిస్టిట్యూట్’ ఈ అంచనాలను రూపొందించింది.