
ఉన్మాది ఘాతుకం: యువతి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఉన్మాది కత్తిపోట్లకు గురైన యువతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతిచెందింది. యువతి చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి సమీపంలోని ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఈశాన్య ఢిల్లీకి చెందిన ఓ యువతి(21) మరికొన్ని రోజుల్లో ఎయిర్ హోస్టెస్ గా విధుల్లో చేరనుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తన ఇంటి వరండాలో నిలుచుండగా.. అదిల్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు.
నిందితుడు అదిల్ పిలవడంతో ఆమె వరండా నుంచి బయటకు వచ్చింది. యువతితో మాట్లాడుతూ ఒక్కసారిగా ఆవేశానికి లోనైన ఉన్మాది.. తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని పలుమార్లు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గురువారం ఉదయం ఆస్పత్రిలోనే కన్నుమూసింది. నిందితుడు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కారు చోరీ కేసులో అతడు నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. యువతిపై కత్తితో దాడి చేస్తుండగా కొందరు స్థానికులు వీడియో తీశారని సమాచారం. నిందితుడు అదిల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.