బిర్యానీ కోసం... 42 బస్సులు తగలబెట్టింది
కేవలం ఒక ప్లేటు బిర్యానీ, వంద రూపాయల డబ్బులు ఇస్తే చాలు.. ఎంతటి ఘాతుకానికైనా పాల్పడతారు. అయితే ఈసారి ఇలా చేసింది మాత్రం ఒక యువతి కావడం విశేషం. కావేరీ జలాల కోసం ఆందోళన జరిగినప్పుడు.. కేపీఎన్ ట్రావెల్స్‌కు చెందిన 42 వోల్వో బస్సులను ఒకేసారి తగలబెట్టారు. ఆ పని చేసినది 22 ఏళ్ల యువతి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 11 మందిని పోలీసులు అరెస్టు చేయగా, వారిలో సి. భాగ్య కూడా ఒకరు.
ఈనెల 12వ తేదీన జరిగిన ఈ దాడి తాలూకు సీసీటీవీ ఫుటేజిని సంపాదించిన పోలీసులు.. అందులోని దృశ్యాల ఆధారంగా అనుమానితులను అరెస్టు చేశారు. వీళ్లు కేపీఎన్ సిబ్బందిపై కూడా డీజిల్ పోసి, వాళ్లను కూడా తగలబెట్టేస్తామని బెదిరించారు. దాంతో అప్పటికి ఏమీ చేయలేక ఊరుకున్న సిబ్బంది.. తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లతో అక్కడ జరిగిన ఘాతుకాన్ని వీడియో తీశారు. అందులో కూడా భాగ్య తనతో పాటు వచ్చినవాళ్లను రెచ్చగొట్టి బస్సులను తగలబెట్టించినట్లు కనిపిస్తోంది.
తన కూతురికి కొంతమంది స్నేహితులు బిర్యానీ పెట్టించి, వంద రూపాయలు ఇచ్చి నిరసనలలో పాల్గొనేందుకు రావాల్సిందిగా తీసుకెళ్లారని భాగ్య తల్లి ఎల్లమ్మ చెబుతున్నారు. కేపీఎన్ గ్యారేజికి సమీపంలోని గిరినగర్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలిసి భాగ్య నివసిస్తుంటుంది. వాళ్లు రోజుకూలీలుగా పనిచేస్తూ పొట్ట నింపుకొంటున్నారు. ఆరోజు ఆమె అప్పుడే పని నుంచి ఇంటికి వచ్చిందని, మధ్యాహ్నం సమయంలో కొంతమంది వచ్చి నిరసనల్లో పాల్గొనేందుకు తీసుకెళ్లారని ఎల్లమ్మ చెప్పారు. అక్కడ మరికొందరు మహిళలు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది గానీ, వాళ్లు కూడా ఈ విధ్వంస కాండలో ఉన్నారో లేదో మాత్రం తెలియలేదు. బెంగళూరులో సెప్టెంబర్ 12 నాటి విధ్వంసాలకు సంబంధించి మొత్తం 400 మందికి పైగా ఇప్పటివరకు అరెస్టు కాగా, వాళ్లలో భాగ్య ఒక్కరే మహిళ.