'కావేరి' ఉద్రిక్తతలో ఓ నవవధువు..! | A bride started walking to reach wedding venue | Sakshi
Sakshi News home page

'కావేరి' ఉద్రిక్తతలో ఓ నవవధువు..!

Published Tue, Sep 13 2016 1:19 PM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM

'కావేరి' ఉద్రిక్తతలో ఓ నవవధువు..! - Sakshi

'కావేరి' ఉద్రిక్తతలో ఓ నవవధువు..!

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతున్న కావేరి జలాల వివాదం.. ఓ నవవధువును కష్టాల్లో ముంచెత్తింది. అల్లరిమూకల హింసాత్మక ఆందోళనలతో రాకపోకలు నిలిచిపోయి... ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓ నవవధువు పెళ్లిచీరలో సుదూర నడక ప్రారంభించింది. తన కుటుంబసభ్యులను తోడుగా తీసుకొని పెళ్లి వేదికకు బయలుదేరింది.

బెంగళూరుకు చెందిన ప్రేమ అనే యువతికి తమిళనాడు యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. బుధవారం తమిళనాడులోని వనియాంబడిలో వీరి వివాహం జరగనుంది. ఇంతలోనే 'కావేరి' వివాదం రెండు రాష్ట్రాలను చుట్టుముట్టింది. ఉద్రిక్తతలు పెరిగాయి. రాకపోకలు ఆగిపోయాయి. ఎక్కడ చూసినా హింసాత్మక పరిస్థితులు.

ఈ ఉద్రిక్తతల నడుమ వారి పెళ్లి ఉత్సాహమంతా నీరుగారిపోయింది. వచ్చే బంధుమిత్రులు వెనుకంజ వేశారు. ఆఖరికీ ఎలాగోలా ముహూర్తం సమయానికి పెళ్లి వేదికకు చేరుకుంటే చాలనే నిశ్చయంతో తన కుటుంబసభ్యులు 20మందితో కలిసి.. పెళ్లిచీరలో ప్రేమ బయలుదేరింది. బస్సులు, ఆటోలు ఏవి దొరికినా వారు ఎక్కారు.  ఆఖరికీ తమిళనాడు సరిహద్దులకు చేరుకునేసరికి రోడ్లు నిర్మానుష్యమైపోయాయి. మనుష్యుల సంచారం లేదు. ఇక వాహనాలు దొరికే పరిస్థితి లేదని నడక ప్రారంభించారు. ఇలా నాలుగు కిలోమీటర్లు నడిచి పెళ్లిచీరలో ముందుకు సాగుతున్న నవవధువు ప్రేమను 'ఎన్డీటీవీ' పలుకరించింది.

'పెళ్లి అంటే ఎంతో సంతోషం, సంబరం ఉంటుంది. కానీ మేం సంతోషాలన్నింటినీ మేం కోల్పోయాం. ఎప్పటికీ మరిచిపోలేని విధంగా పరిస్థితులు మాకు ఎదురయ్యాయి' అని వధువు ప్రేమ ఆవేదన వ్యక్తం చేసింది. 'మేం ఎన్నో కష్టాలు పడుతున్నాం. బంధుమిత్రులకు 600 వరకు శుభలేఖలు పంపాం. కానీ, కేవలం 20మంది కుటుంబసభ్యులు మాత్రమే పెళ్లి వేదిక వద్దకు బయలుదేరాం' అని తెలిపింది. 'మనమంతా భారతీయులం. ఇలాంటి విషయాల కోసం కొట్లాడుకోవడం సరికాదు' అని ఆమె ఆందోళనకారులకు విజ్ఞప్తి చేసింది. కానీ, ఆమె ఆవేదన వారి కరుకు చెవులకు చేరుతుందా..!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement