అన్నకు అన్నీ తానై.. ఐఐటీదాకా తీసుకెళ్లాడు!
అన్న అడుగుజాడల్లో తమ్ముడు నడవడం గురించి తెలుసు. తమ్ముడిని భుజానెత్తుకుని ఆడించిన అన్నల గురించి కూడా తెలుసు. మరి తమ్ముడి అడుగులే తన అడుగులుగా నడిచిన అన్న గురించి.. అన్నను భుజానెత్తుకొని అన్నీ తానైన తమ్ముడి గురించి తెలుసా? అయితే మీరు కృషాన్, బసంత్ల ప్రయాణం గురించి తెలుసుకోవాల్సిందే..
అమ్మలో సగం.., నాన్నలో సగం.. ‘అన్న’గా పుట్టాడని చెబుతారు. మరి అలాంటి అన్నకే కష్టం వస్తే..? అమ్మకడుపున అతని తర్వాత పుట్టిన తమ్ముడిదే కదా! అందుకే అన్నకు అన్ని తానయ్యాడు. పెరగడంలో.. తిరగడంలో.. చదవడంలో.. చివరికి జీవితంలో ఎదగడంలో కూడా తోడుగా నిలిచాడు. మరి ఆ అన్నకు తమ్ముడిమీద ఆధారపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? తమ్ముడు ఆ అన్నకు ఎలా అండగా నిలిచాడు? తెలుసుకుందాం..
కృషాన్, బసంత్ ఇద్దరు ఒకే తల్లికడుపున పుట్టిన అన్నదమ్ములు. అయితే కృషాన్ చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. ఇతరుల సాయం లేకుండా అడుగు కూడా వేయలేని పరిస్థితి. అయితేనేం నేనున్నానంటూ తమ్ముడు బసంత్ అన్నతోపాటు అతని బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. బయటకెళ్లాలన్నా, బడికెళ్లాలన్నా కృషాన్‌కు బసంత్ తోడుండాల్సిందే. దీంతో ఇద్దరూ ఒకే తరగతిలో చేరారు. చదువులో ఇద్దరూ మెరికలే. అందుకే తమకున్న కష్టాల గురించి ఆలోచించకుండా ఉన్నత లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. అదే ఐఐటీలో సీటు సంపాదించడం. లక్ష్యసాధన కోసం ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్లో చేరారు. కష్టపడి చదివారు. వారి కష్టం వృథా పోలేదు. అన్నదమ్ములిద్దరూ ఐఐటీలో మంచి ర్యాంకు సాధించారు. కృషాన్ వికలాంగుల కోటాలో ఆల్ఇండియా 38వ ర్యాంకు, బసంత్ 3675 ర్యాంకు సాధించారు.
మరిప్పుడు విడిపోతారా?
బడి నుంచి మొదలైన తమ ప్రయాణం ఐఐటీ సీటు సంపాదించేవరకు సాగింది. అయితే ర్యాంకుల్లో తేడాల కారణంగా వీరిద్దరికి వేర్వేరు కాలేజీల్లో సీటు వచ్చింది. మరిప్పుడు వీరిద్దరు విడిపోతారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు అన్నదమ్ములిద్దరూ ధైర్యం చేయడంలేదు. ‘నా తమ్ముడు చిన్నప్పటి నుంచి నాకెంతో చేశాడు. ఇంతవరకు మమ్మల్ని ఎవరూ విడదీయలేదు. ఇప్పుడు వేర్వేరు కాలేజీల్లో చదవాలనే ఆలోచన వస్తేనే బాధగా ఉందంటున్నాడు అన్న కృషాన్. ‘నేనంటే ఎలాగోలా ఉంటాను. అన్న నాలా ఉండలేడు. అందుకే అన్నను వదిలి వెళ్లడం కష్టంగా ఉందంటున్నాడు తమ్ముడు బసంత్. సివిల్ సర్వీసెస్లో చేరాలనేది బసంత్ ఆశయం కాగా కంప్యూటర్ ఇంజనీర్ కావాలనేది కృషాన్ లక్ష్యమట. మరి ఈ ఇద్దరు అన్నదమ్ముల మిగతా ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.