నీళ్ల కోసం.. యువకుడి ఆత్మాహుతియత్నం
కావేరీ జలాల కోసం తమిళనాడులో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మన్నర్‌కుడి ప్రాంతానికి చెందిన సురేష్ అనే యువకుడు ఆత్మాహుతియత్నం చేశాడు. కావేరీ జలాల విషయంలో కర్ణాటక తమకు తీవ్ర అన్యాయం చేస్తోందంటూ నామ్ తమిళర్ కచ్చి అనే సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాడు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు వెంటనే మంటలు ఆర్పేసి.. అతడిని వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
తమిళనాడుకు కావేరి జలాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ చెన్నై రాజరత్నం స్టేడియం నుంచి ర్యాలీ బయల్దేరింది. నామ్ తమిళర్ కచ్చి డైరెక్టర్లు చేరన్, అమీర్ సహా వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సాగుతుండగానే.. సురేష్ ఒంటికి నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. తమిళులు ఇలా ప్రాణత్యాగాలు చేయడం సరికాదని, మనం ప్రాణాలు నిలబెట్టుకుని మరీ జలాల కోసం పోరాడాలని ఈ సందర్భంగా నామ్ తమిళర్ కచ్చి నేత సీమన్ అన్నారు.