Naam Tamilar Katchi
-
విద్వేష ప్రసంగంపై ప్రశాంత్ కిశోర్ ట్వీట్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు
చెన్నై: ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మికులను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నామ్ తమిళర్ కచ్చి(ఎన్టీకే) నేత సెంథామిళన్ సీమన్పై తమిళనాడు ఈరోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్వీట్ అనంతరం ఈమేరకు చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 13న ఓ పబ్లిక్ ర్యాలీలో సీమన్ మాట్లాడుతూ.. తమిళనాడులో హిందీలో మాట్లాడేవారిని కొడతానని, ఈ దెబ్బతో వాళ్లు బ్యాగులు సర్దుకుని పారిపోతారని వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని లేవనెత్తారు. సీమన్ విద్వేష ప్రసంగాన్ని ట్విట్టర్లో షేర్ చేసి.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఫేక్ వీడియోలతో హింస, విద్వేషం సృష్టించే వారిపై చర్యలు తీసుకున్నట్లే.. ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ రోడ్ పోలీసులు సీమన్పై కేసు నమోదు చేశారు. All those who used fake videos to incite hate & violence must be dealt with as per the law. But this doesn’t absolve those who’re openly calling for violence against #Hindi speaking people in #TN Why no action against likes of @SeemanOfficial for their vitriolic utterances? pic.twitter.com/vyu2EkjBQu — Prashant Kishor (@PrashantKishor) March 10, 2023 కాగా.. తమిళనాడులో ఉత్తరాది నుంచి వచ్చిన వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయని, ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోయారని వార్తలు వ్యాప్తి చెందాయి. దీంతో బిహార్ సీఎం ఈవిషయంపై విచారణకు నిజనిర్ధరణ కమిటీ కూడా వేశారు. అయితే ఇందులో వాస్తవం లేదని, ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు తమకు సోదరులతో సమానమని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. వారికి ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చారు. చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు.. -
Tamil Nadu: ఓడినా సత్తాచాటిన సీమాన్
సాక్షి, చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఎన్నికల్లో ఓడినా సత్తా చాటుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థులు 183 నియోజకవర్గాల్లో 3వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. ఇక 39 చోట్ల అన్నాడీఎంకే అభ్యర్థుల విజయ అవకాశాలకు గండికొట్టారు. ఒంటరిగా బరిలోకి.. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, పీఎంకే, మక్కల్ నీదిమయ్యం, ఎస్ఎంకే, ఐజేకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తదితర పార్టీలు కూటములతో ఎన్నికలను ఎదుర్కొన్నాయి. అయితే సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. 234 స్థానాల్లో 117 చోట్ల మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. పుంజుకుంటున్న సీమాన్ తాజా ఎన్నికల్లో డీఎంకే పార్టీ 37.7 శాతం ఓట్లు సాధించి అధికారం దక్కించుకుంది. ఇక అన్నాడీఎంకే పార్టీ 33.29 శాతం ఓట్లు సాధించి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇక నామ్ తమిళర్ కట్చి 5 శాతానికి పైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. 2011 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన సీమాన్ పార్టీ 1.7 శాతం ఓట్లను దక్కించుకుంది. 2016లో 2.15 శాతం సాధించింది. కమల్ కూటమి, దినకరన్–విజయకాంత్ కూటమి నాలుగు స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్కరూ గెలవలేదు కానీ.. తాజా ఎన్నికల్లో సీమాన్‌తో పాటు ఆ పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. అయితే ఇతరుల విజయావకాశాలను మాత్రం దెబ్బతీశారు. తిరువొత్తియూరులో పోటీ చేసిన సీమాన్ ఓటమి పాలైనా 48,597 ఓట్లు పొందారు. తూత్తుకుడిలో ఆ పార్టీ అభ్యర్థి వేల్రాజ్ 30,741 ఓట్లు రాబట్టుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో 183 చోట్ల నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు 3వ స్థానంలో నిలవడం గమనార్హం. మొత్తంగా 5 శాతానికి పైగా ఓట్లు సాధించారు. 39 నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే ఓట్లకు చీల్చి వారి విజయావకాశాలను దెబ్బ తీశారు. అలాగే 10 చోట్ల డీఎంకే, 5 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లకు గండికొట్టారు. మరోవైపు దినకరన్ పార్టీ 20 చోట్ల అన్నాడీఎంకే ఓట్లను చీల్చి వారి విజయావకాశాలను దెబ్బ తీసింది. పదిహేనేళ్ల తర్వాత అసెంబ్లీకి ప్రాతినిధ్యం డీఎంకే కూటమితో ఎన్నికలను ఎదుర్కొన్న వీసీకే, ఎండీఎంకే పార్టీలు చెరో నాలుగు స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలకు 2006 తర్వాత అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయాయి. తాజా గెలుపుతో ఆ పార్టీల అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఇక పీఎంకే, సీపీఎం, సీపీఐ సభ్యులు ఐదేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఇక మేట్టూరులో పోటీచేసిన ఎన్నికల వీరుడు పద్మరాజన్‌కు ఈసారి 36 ఓట్లు రావడం విశేషం. అలాగే సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ (తొండముత్తూరు), మైల్ స్వామి (విరుగ్గంబాక్కం)లలో పోటీ చేయగా నోటా కన్నా తక్కువ ఓట్లు పడ్డాయి. చదవండి: Kamal Haasan: ఒంటరిగా పోటీ చేసుంటే బాగుండేది! -
సీమాన్‌పై దేశద్రోహం కేసు
సాక్షి, చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేయడంపై అక్కడి నామ్ తమిళర్ కట్చి వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుకునపడ్డారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. గతంలో జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసిన కొంత కాలం కటకటాల్లోకి సైతం నెట్టారు. సీమాన్ ఇటీవల రాజకీయంగా బల పడుతున్నారు. ఆయన పార్టీ ఓటు బ్యాంక్ క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు నెలల క్రితం సీమాన్ చేసిన వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని ఇప్పుడు దేశద్రోహం కేసు నమోదు చేయడం ఆయన మద్దతుదారుల్ని ఆక్రోశాన్ని నింపింది. (సీమాన్ అరెస్ట్) పౌర నిరసనలో.. కేంద్రం తీసుకొచ్చిన పౌర చట్టానికి వ్యతిరేకంగా తమిళనాట ఆందోళనలు, నిరసనలు భగ్గుమన్న విషయం తెలిసిందే. మైనారిటీలు రాష్ట్రంలోని ఆయా నగరాల్లో మరో షాహిన్ బాగ్ అన్న నినాదాలతో నిరసన దీక్షలు కొనసాగించారు. ఇందులో భాగంగా కోయంబత్తూరు ఆత్తు పాలం వద్ద మైనారిటీల నిరసన దీక్ష సాగింది. ఈ దీక్షకు మద్దతుగా పలు సంఘాలు, పార్టీలు కదిలాయి. ఆ దిశగా ఫిబ్రవరి 22న ఈ దీక్షకు సంఘీభావం తెలుపుతూ సీమాన్ హాజరయ్యారు. ఈ వేదిక నుంచి సీమాన్ వీరావేశంతో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాటలతో విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని రెండు నెలల అనంతరం శనివారం ఆయనపై ద్రోహం కేసు నమోదైంది. (తండ్రి మృతదేహంతో 14గంటల పాటు..) పౌర చట్టానికి వ్యతిరేకంగా, మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీమాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇరు సామాజిక వర్గాల మధ్య వివాదాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని పేర్కొంటూ దేశ ద్రోహం కేసు నమోదు చేస్తూ, కోయంబత్తూరు పులియం ముత్తురు పోలీసుస్టేషన్ వర్గాలు ప్రకటించాయి. సీమాన్ వ్యాఖ్యల వీడియో చేతికి అందే సమయానికి కరోనా ప్రభావం తాండవం చేయడంతో ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టినట్టు, ప్రస్తుతం కోయంబత్తూరులో కరోనా కట్టడిలో ఉన్న దృష్ట్యా, సీమాన్ వ్యవహారాన్ని పోలీసులు చేతిలోకి తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ కేసు నమోదుతో సీమాన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో సీమాన్ ఉన్నట్టు సమాచారం. అయితే, తమ నాయకుడి ఎదుగుదల, తమకు లభిస్తున్న ఓటింగ్ శాతాన్ని చూసి ఓర్వలేక అక్రమంగా ఈ కేసు నమోదు చేశారని నామ్ తమిళర్ కట్చివర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పౌర చట్టానికి వ్యతిరేకంగా ఒక్క సీమాన్ మాత్రం వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి ప్రతి పక్ష నాయకుడు విరుచుకు పడ్డారని, అయితే, తమ నేతను టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండి పడ్డారు. -
సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు
సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తమిళ ప్రముఖ పార్టీ ‘నామ్ తమిళర్ కట్చి’ ప్రశంసల వర్షం కురిపించింది. తనపై నమ్మకంతో అధికారం ఇచ్చిన ప్రజల పట్ల చిత్తశుద్ధితో పచిచేస్తున్నారని కొనియాడింది. కొన్నేళ్లుగా తమిళనాట తెలుగు వారిపై మండిపడుతున్న నామ్ తమిళర్ కట్చి అద్యక్షుడు సీమాన్.. వేలూరులో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల సభలో మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు అమలు చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు. సభలో ప్రసంగిస్తున్న నామ్ తమిళర్ కట్చి పార్టీ అధ్యక్షుడు సీమాన్ దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, వీటిలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, వితంతువులకు పింఛన్లు ప్రకటించటం.. ఎన్నుకున్న ప్రజల పట్ల సీఎం జగన్ ఉన్న నమ్మకానికి నిదర్శనం అన్నారు. తమ రాష్ట్రం, తెలుగు జాతి సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉండటం హర్షనీయం అన్నారు. ఎప్పుడూ తెలుగువారిపై మండిపడే సీమాన్ ఏపీ సిఎం వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించటంపై తమిళ రాజకీయాల్లో చర్చగా మారింది. -
నీళ్ల కోసం.. యువకుడి ఆత్మాహుతియత్నం
కావేరీ జలాల కోసం తమిళనాడులో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మన్నర్‌కుడి ప్రాంతానికి చెందిన సురేష్ అనే యువకుడు ఆత్మాహుతియత్నం చేశాడు. కావేరీ జలాల విషయంలో కర్ణాటక తమకు తీవ్ర అన్యాయం చేస్తోందంటూ నామ్ తమిళర్ కచ్చి అనే సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాడు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు వెంటనే మంటలు ఆర్పేసి.. అతడిని వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. తమిళనాడుకు కావేరి జలాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ చెన్నై రాజరత్నం స్టేడియం నుంచి ర్యాలీ బయల్దేరింది. నామ్ తమిళర్ కచ్చి డైరెక్టర్లు చేరన్, అమీర్ సహా వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సాగుతుండగానే.. సురేష్ ఒంటికి నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. తమిళులు ఇలా ప్రాణత్యాగాలు చేయడం సరికాదని, మనం ప్రాణాలు నిలబెట్టుకుని మరీ జలాల కోసం పోరాడాలని ఈ సందర్భంగా నామ్ తమిళర్ కచ్చి నేత సీమన్ అన్నారు. -
రాష్ట్రానికి ఐదు రాజధానులు
ప్రగతి నినాదంతో పుస్తకంగా విడుదల విద్య, వైద్య,విద్యుత్‌కు పెద్ద పీట రాజీవ్ నిందితుల విడుదల చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఐదు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రగతి నినాదంతో 314 పేజీలతో పుస్తకం రూపంలో మేనిఫెస్టోలో వివరాలను పొందు పరిచారు. విద్య, వైద్య, విద్యుత్‌కు పెద్ద పీట వేయడంతో పాటుగా, రాజీవ్ హత్య కేసు నిందితుల్ని తక్షణం విడుదల చేస్తామని ప్రకటించారు. సినీ దర్శకుడిగా, నటుడిగా తమిళనాట ప్రస్తానాన్ని ఆరంభించి, ఈలం తమిళులకు మద్దతుగా సాగిన ఉద్యమంతో అందరి దృష్టిలో వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యల రాజుగా సీమాన్ ముద్ర వేసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పలు మార్లు జైలుకు వెళ్లొచ్చిన సీమాన్ ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా నామ్ తమిళర్ ఇయక్కం ప్రకటించారు. తదుపరి నామ్ తమిళర్ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చేశారు. ఈలం తమిళులకు, తమిళానికి వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీల భరతం పట్టే విధంగా ప్రచారాల్లో ముందుకు సాగుతూ వచ్చిన సీమాన్ రానున్న ఎన్నికల్లో తన సత్తాను చాటుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరి కంటే, ముందుగా ఒకే సమయంలో ఒకే వేదికగా కడలూరు నుంచి గత నెల 234 నియోజకవర్గాల బరిలో నిలబడే అభ్యర్థుల్ని ప్రకటించారు. అలాగే, హిజ్రాలకు సైతం సీటును ఇచ్చి అందరి దృష్టిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తన ఎన్నికల మేనిఫెస్టోను సీమాన్ ప్రకటించారు. మేనిఫెస్టో: తన ఎన్నికల మేని ఫెస్టోను పుస్తకం రూపంలో సీమాన్ ప్రకటించారు. 314 పేజీల్లో రాష్ట్ర ప్రగతి, తమిళ సంక్షేమం లక్ష్యంగా పథకాలను పొందు పరిచారు. ఉచితాలకు దూరంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా, ప్రజా సౌలభ్యం కోసం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఐదు రాజధానుల్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. చెన్నై ప్రధాన కేంద్రంగా, తిరుచ్చి, కోయంబత్తూరు, మదురై, కన్యాకుమారిలను అనుబంధ రాజధానులుగా ప్రకటించి, అన్ని రకాల సేవల్ని ఆయా రాజధానుల్లోనే ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అధికారిక ముద్రగా మహాకవి తిరువళ్లువర్ చిత్రాన్ని, చెరన్, చోళ, పాండ్యరాజుల పాలనను మేళవిస్తూ, చేప, పులి, ధనస్సు, బాణంలతో కూడిన తమిళనాడు ప్రభుత్వ జెండాను రెపరెపలాడేలా చేస్తామని వివరించారు. సాగుకు పెద్ద పీట, జాలరన్నకు భద్రత, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఈలం తమిళులకు స్వేచ్ఛాయుత జీవనం, తదితర అంశాల్ని పొందు పరచడంతో పాటుగా, మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులో నిందితులుగా జైలు జీవితం అనుభవిస్తున్న వారందర్నీ తమ అధికారాన్ని ప్రయోగించి విడుదల చేస్తామని ప్రకటిస్తూ, సరికొత్త అంశాల్ని క్రోడీకరిస్తూ మేని ఫెస్టోను సీమాన్ రూపొందించి ఉండటం విశేషం. ఇక , ప్రజా కూటమిలోని డీఎండీకే చేరిక గురించి ప్రశ్నిం చగా, ముందే ఎందుకు ప్రకటించ లేదో అని వ్యాఖ్యానించారు. నిర్ణయాన్ని నిర్భయంగా తీసుకునే ధైర్యం విజయకాం త్‌కు లేదు అని, నాన్చుడుతో ఒంటరి అని, ఇప్పుడు కూటమి అని అభాసుపాలు అయ్యారని ఎద్దేవా చేశారు. -
సీమాన్ సేన రెడీ!
ప్రప్రథమంగా అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు నామ్ తమిళర్ కట్చి సిద్ధమయింది. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడంతో పాటు పది నెలలకు ముందుగానే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. చెన్నై: శ్రీలంకలోని ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా సినీ దర్శకుడు సీమాన్ నామ్ తమిళర్ ఇయక్కంను గతంలో ఏర్పాటు చేశారు. ఎల్టీటీఈ అధినేత వేలు పిళ్లై ప్రభాకరన్ ఆదర్శంగా, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటూ, ఈ ఇయక్కం ద్వారా బహిరంగ సభల్లో ఆయన చేసే ప్రసంగం వివాదానికి దారితీస్తూ వచ్చింది. కేసుల మోత సైతం మోగాయి. అయినా, తగ్గని సీమాన్ తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇటీవల తన ఇయక్కంను రాజకీయ పార్టీగా ప్రకటించారు. నామ్ తమిళర్ కట్చి పేరిట కార్యక్రమాలను విస్తృత పరుస్తూ వస్తున్నారు. ప్రధానంగా తమిళ ఈలం లక్ష్యంగా, తమిళుల అభ్యున్నతి నినాదంతో ముందుకు సాగుతున్న సీమాన్ మరో అడుగు ముం దుకు వేశారు. రాష్ట్రంలో ఏ పార్టీలతో పొత్తు తమకు అవసరం లేదని, తమిళులతోనే తమ మద్దతు అంటూ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రప్రథమంగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలలకు పైగా సమయం ఉన్నా, దాంతో తమకు పని లేదంటూ, ఇప్పుడే తమ అభ్యర్థుల తొలి చిట్టాను ప్రకటించేశారు. సీమాన్ సేన రెడీ కొద్ది రోజులుగా సీమాన్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. తమిళాభిమానుల మద్దతు కూడగట్టుకునే విధంగా అక్కడక్కడ బిహ రంగ సభల్ని నిర్వహిస్తూ సంచనల, వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం గూడువాంజేరిలో జరిగిన సభలో ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధమని ప్రకటిస్తూ, తొలి విడతగా తొమ్మిది మందితో అభ్యర్థుల చిట్టాను విడుదల చేశారు. ఇందులో అత్యధికంగా న్యాయవాదులు ఉండటం గమనార్హం. ఆ మేరకు నాగుర్కోయిల్- కాకలై కుట్టుదళం, శివగంగై - ఎలిల్ కుమార్, తిరువాడనై - రాజీవ్ గాంధీ అలియాస్ అరివు సెల్వం, షోళింగనల్లూరు - రాజన్, తిరుపత్తూరు - సినీ నిర్మాత కోట్టై కుమార్, మైలం- డాక్టర్ విజయలక్ష్మి, అంబత్తూరు - అన్భు తెన్నరసన్, గౌండం పాళయం - సినీ దర్శకుడు కార్వణ్ణన్, కుంభకోణం - మణి సెంథిల్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఒంటరిగా సిద్ధం అయ్యామని, పట్టున్న చోట్ల మాత్రమే తమ పోటీ ఉంటుందంటూనే, తమిళుల కోసం ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలన్న కాంక్షతో ముందుకు వెళ్తున్నామని సీమాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కారాగారాల్లో పదిఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న వాళ్లను క్రమ శిక్షణను పరిగణలోకి తీసుకుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పరిష్కారం కోసం జూలై పదిన మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టై, పుళల్ కారాగారాల ముందు ఆందోళనలు చేపట్టనున్నామని ప్రకటించారు. అలాగే, శ్రీలంక నుంచి వస్తున్న ఈలం తమిళుల్ని విచారణ పేరిట వేదించ వద్దని, ప్రత్యేక శిబిరాల్లో ఉన్న వాళ్లకు స్వేచ్ఛ కలిగించాలని డిమాండ్ చేశారు. -
సీమాన్ అరెస్ట్
సాక్షి, చెనై : నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ అరెస్టయ్యా రు. ఆయన అరెస్టును ఖండిస్తూ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరకు గట్టి భద్రత నడుమ చెన్నై నుంచి మదురైకు సీమాన్‌ను తరలించారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వివాదాలకు కేంద్ర బిందువు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంలో దిట్టా. ఇప్పటికే పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో సీమాన్ కటకటాల్లో నెలల తరబడి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం టోల్ ప్లాజాలో వీరంగం సృష్టించి మళ్లీ అరెస్టు అయ్యూరు.వివాదం : రెండు రోజుల క్రితం మదురైలో నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో బహిరంగ సభ జరిగింది. ఇందులో వీరావేశంతో ప్రసంగాలు ఇచ్చిన సీమాన్ అదే రోజు రాత్రి చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. తన అనుచరగణం వాహనాలు వెంట రాగా, కాన్వాయ్ రూపంలో రోడ్డు మార్గంలో సీమాన్ బయలు దేరారు. అర్ధరాత్రి నత్తం టోల్ ప్లాజాలో ఈ వాహనాలకు టోల్ చార్జీల చెల్లింపు వివాదానికి దారి తీసింది. తమ వాహనాలకు టోల్ చెల్లించేది లేదంటూ సీమాన్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. తమ వాళ్లకు అండగా సీమాన్ సైతం వీరంగంలో భాగస్వాములయ్యారు. దీంతో అక్కడి సిబ్బందికి, సీమాన్ మధ్య వివాదం ముదిరింది. చివరకు సీమాన్, ఆయన మద్దతుదారుల వాహనాలు చెన్నై వైపుగా దూసుకొచ్చాయి. అరెస్టు : తమ మీద సీమాన్ అండ్ బృందం చేసిన వీరంగానికి టోల్ ప్లాజా సిబ్బంది కోపోద్రిక్తులయ్యారు. అక్కడి ఇన్చార్జ్ అజిత్‌కుమార్ నేతృత్వంలోని సిబ్బంది మేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీమాన్తోపాటుగా మరో ఆరుగురిపై నాలుగు రకాల సెక్షన్ల కింద కేసులు నమోద య్యాయి. దీంతో సీమాన్‌ను అరెస్టు చేయడానికి మేలూరు నుంచి ప్రత్యేక బృందం శనివారం ఉదయాన్నే చెన్నైకు చేరుకుంది. ఇక్కడి అష్ట లక్ష్మినగర్‌లోని సీమాన్ ఇంటికి ఆ బృందం వెళ్లింది. అప్పటికే, వళ్లువర్ కోట్టం వద్ద చేపట్ట దలచిన నిరాహార దీక్షకు సీమాన్ సిద్ధమయ్యారు. ఆ దీక్ష శిబిరానికి కదులుతున్న సీమాన్‌ను మేలూరు పోలీసుల బృందం అడ్డుకుంది. అరెస్టు చేయడానికి సిద్ధపడింది. ఈ సమాచారం అందుకున్న నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు అక్కడికి చేరుకుని హంగామా సృష్టించారు. అరెస్టును అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేలూరు పోలీసులతో సీమాన్ మద్దతుదారులు ఢీ కొట్టారు. చివరకు కోయంబేడు జాయింట్ కమిషనర్ కార్యాలయం నుంచి అదనపు బలగాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎట్టకేలకు సీమాన్‌ను అరెస్టు చేసిన మేలూరు పోలీసులు తమ వాహనంలో మదురైకు తీసుకెళ్లారు. సీమాన్ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆందోళనలకు నామ్ తమిళర్ కట్చి నాయకులు పిలుపునిచ్చారు.