రాష్ట్రానికి ఐదు రాజధానులు
ప్రగతి నినాదంతో పుస్తకంగా విడుదల
విద్య, వైద్య,విద్యుత్‌కు పెద్ద పీట
రాజీవ్ నిందితుల విడుదల
చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఐదు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రగతి నినాదంతో 314 పేజీలతో పుస్తకం రూపంలో మేనిఫెస్టోలో వివరాలను పొందు పరిచారు. విద్య, వైద్య, విద్యుత్‌కు పెద్ద పీట వేయడంతో పాటుగా, రాజీవ్ హత్య కేసు నిందితుల్ని తక్షణం విడుదల చేస్తామని ప్రకటించారు.
సినీ దర్శకుడిగా, నటుడిగా తమిళనాట ప్రస్తానాన్ని ఆరంభించి, ఈలం తమిళులకు మద్దతుగా సాగిన ఉద్యమంతో అందరి దృష్టిలో వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యల రాజుగా సీమాన్ ముద్ర వేసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పలు మార్లు జైలుకు వెళ్లొచ్చిన సీమాన్ ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా నామ్ తమిళర్ ఇయక్కం ప్రకటించారు. తదుపరి నామ్ తమిళర్ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చేశారు. ఈలం తమిళులకు, తమిళానికి వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీల భరతం పట్టే విధంగా ప్రచారాల్లో ముందుకు సాగుతూ వచ్చిన సీమాన్ రానున్న ఎన్నికల్లో తన సత్తాను చాటుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరి కంటే, ముందుగా ఒకే సమయంలో ఒకే వేదికగా కడలూరు నుంచి గత నెల 234 నియోజకవర్గాల బరిలో నిలబడే అభ్యర్థుల్ని ప్రకటించారు.
అలాగే, హిజ్రాలకు సైతం సీటును ఇచ్చి అందరి దృష్టిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తన ఎన్నికల మేనిఫెస్టోను సీమాన్ ప్రకటించారు.
మేనిఫెస్టో: తన ఎన్నికల మేని ఫెస్టోను పుస్తకం రూపంలో సీమాన్ ప్రకటించారు. 314 పేజీల్లో రాష్ట్ర ప్రగతి, తమిళ సంక్షేమం లక్ష్యంగా పథకాలను పొందు పరిచారు. ఉచితాలకు దూరంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా, ప్రజా సౌలభ్యం కోసం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఐదు రాజధానుల్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. చెన్నై ప్రధాన కేంద్రంగా, తిరుచ్చి, కోయంబత్తూరు, మదురై, కన్యాకుమారిలను అనుబంధ రాజధానులుగా ప్రకటించి, అన్ని రకాల సేవల్ని ఆయా రాజధానుల్లోనే ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర అధికారిక ముద్రగా మహాకవి తిరువళ్లువర్ చిత్రాన్ని, చెరన్, చోళ, పాండ్యరాజుల పాలనను మేళవిస్తూ, చేప, పులి, ధనస్సు, బాణంలతో కూడిన తమిళనాడు ప్రభుత్వ జెండాను రెపరెపలాడేలా చేస్తామని వివరించారు. సాగుకు పెద్ద పీట, జాలరన్నకు భద్రత, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఈలం తమిళులకు స్వేచ్ఛాయుత జీవనం, తదితర అంశాల్ని పొందు పరచడంతో పాటుగా, మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులో నిందితులుగా జైలు జీవితం అనుభవిస్తున్న వారందర్నీ తమ అధికారాన్ని ప్రయోగించి విడుదల చేస్తామని ప్రకటిస్తూ, సరికొత్త అంశాల్ని క్రోడీకరిస్తూ మేని ఫెస్టోను సీమాన్ రూపొందించి ఉండటం విశేషం. ఇక , ప్రజా కూటమిలోని డీఎండీకే చేరిక గురించి ప్రశ్నిం చగా, ముందే ఎందుకు ప్రకటించ లేదో అని వ్యాఖ్యానించారు. నిర్ణయాన్ని నిర్భయంగా తీసుకునే ధైర్యం విజయకాం త్‌కు లేదు అని, నాన్చుడుతో ఒంటరి అని, ఇప్పుడు కూటమి అని అభాసుపాలు అయ్యారని ఎద్దేవా చేశారు.