సాక్షి, చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేయడంపై అక్కడి నామ్ తమిళర్ కట్చి వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుకునపడ్డారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. గతంలో జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసిన కొంత కాలం కటకటాల్లోకి సైతం నెట్టారు. సీమాన్ ఇటీవల రాజకీయంగా బల పడుతున్నారు. ఆయన పార్టీ ఓటు బ్యాంక్ క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు నెలల క్రితం సీమాన్ చేసిన వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని ఇప్పుడు దేశద్రోహం కేసు నమోదు చేయడం ఆయన మద్దతుదారుల్ని ఆక్రోశాన్ని నింపింది. (సీమాన్ అరెస్ట్)
పౌర నిరసనలో..
కేంద్రం తీసుకొచ్చిన పౌర చట్టానికి వ్యతిరేకంగా తమిళనాట ఆందోళనలు, నిరసనలు భగ్గుమన్న విషయం తెలిసిందే. మైనారిటీలు రాష్ట్రంలోని ఆయా నగరాల్లో మరో షాహిన్ బాగ్ అన్న నినాదాలతో నిరసన దీక్షలు కొనసాగించారు. ఇందులో భాగంగా కోయంబత్తూరు ఆత్తు పాలం వద్ద మైనారిటీల నిరసన దీక్ష సాగింది. ఈ దీక్షకు మద్దతుగా పలు సంఘాలు, పార్టీలు కదిలాయి. ఆ దిశగా ఫిబ్రవరి 22న ఈ దీక్షకు సంఘీభావం తెలుపుతూ సీమాన్ హాజరయ్యారు. ఈ వేదిక నుంచి సీమాన్ వీరావేశంతో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాటలతో విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని రెండు నెలల అనంతరం శనివారం ఆయనపై ద్రోహం కేసు నమోదైంది. (తండ్రి మృతదేహంతో 14గంటల పాటు..)
పౌర చట్టానికి వ్యతిరేకంగా, మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీమాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇరు సామాజిక వర్గాల మధ్య వివాదాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని పేర్కొంటూ దేశ ద్రోహం కేసు నమోదు చేస్తూ, కోయంబత్తూరు పులియం ముత్తురు పోలీసుస్టేషన్ వర్గాలు ప్రకటించాయి. సీమాన్ వ్యాఖ్యల వీడియో చేతికి అందే సమయానికి కరోనా ప్రభావం తాండవం చేయడంతో ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టినట్టు, ప్రస్తుతం కోయంబత్తూరులో కరోనా కట్టడిలో ఉన్న దృష్ట్యా, సీమాన్ వ్యవహారాన్ని పోలీసులు చేతిలోకి తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ కేసు నమోదుతో సీమాన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో సీమాన్ ఉన్నట్టు సమాచారం. అయితే, తమ నాయకుడి ఎదుగుదల, తమకు లభిస్తున్న ఓటింగ్ శాతాన్ని చూసి ఓర్వలేక అక్రమంగా ఈ కేసు నమోదు చేశారని నామ్ తమిళర్ కట్చివర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పౌర చట్టానికి వ్యతిరేకంగా ఒక్క సీమాన్ మాత్రం వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి ప్రతి పక్ష నాయకుడు విరుచుకు పడ్డారని, అయితే, తమ నేతను టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండి పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment