సీమాన్ అరెస్ట్
సాక్షి, చెనై : నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ అరెస్టయ్యా రు. ఆయన అరెస్టును ఖండిస్తూ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరకు గట్టి భద్రత నడుమ చెన్నై నుంచి మదురైకు సీమాన్‌ను తరలించారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వివాదాలకు కేంద్ర బిందువు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంలో దిట్టా. ఇప్పటికే పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో సీమాన్ కటకటాల్లో నెలల తరబడి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం టోల్ ప్లాజాలో వీరంగం సృష్టించి మళ్లీ అరెస్టు అయ్యూరు.వివాదం : రెండు రోజుల క్రితం మదురైలో నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో బహిరంగ సభ జరిగింది. ఇందులో వీరావేశంతో ప్రసంగాలు ఇచ్చిన సీమాన్ అదే రోజు రాత్రి చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. తన అనుచరగణం వాహనాలు వెంట రాగా, కాన్వాయ్ రూపంలో రోడ్డు మార్గంలో సీమాన్ బయలు దేరారు.
అర్ధరాత్రి నత్తం టోల్ ప్లాజాలో ఈ వాహనాలకు టోల్ చార్జీల చెల్లింపు వివాదానికి దారి తీసింది. తమ వాహనాలకు టోల్ చెల్లించేది లేదంటూ సీమాన్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. తమ వాళ్లకు అండగా సీమాన్ సైతం వీరంగంలో భాగస్వాములయ్యారు. దీంతో అక్కడి సిబ్బందికి, సీమాన్ మధ్య వివాదం ముదిరింది. చివరకు సీమాన్, ఆయన మద్దతుదారుల వాహనాలు చెన్నై వైపుగా దూసుకొచ్చాయి. అరెస్టు : తమ మీద సీమాన్ అండ్ బృందం చేసిన వీరంగానికి టోల్ ప్లాజా సిబ్బంది కోపోద్రిక్తులయ్యారు. అక్కడి ఇన్‌చార్జ్ అజిత్‌కుమార్ నేతృత్వంలోని సిబ్బంది మేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీమాన్‌తోపాటుగా మరో ఆరుగురిపై నాలుగు రకాల సెక్షన్ల కింద కేసులు నమోద య్యాయి. దీంతో సీమాన్‌ను అరెస్టు చేయడానికి మేలూరు నుంచి ప్రత్యేక బృందం శనివారం ఉదయాన్నే చెన్నైకు చేరుకుంది. ఇక్కడి అష్ట లక్ష్మినగర్‌లోని సీమాన్ ఇంటికి ఆ బృందం వెళ్లింది.
అప్పటికే, వళ్లువర్ కోట్టం వద్ద చేపట్ట దలచిన నిరాహార దీక్షకు సీమాన్ సిద్ధమయ్యారు. ఆ దీక్ష శిబిరానికి కదులుతున్న సీమాన్‌ను మేలూరు పోలీసుల బృందం అడ్డుకుంది. అరెస్టు చేయడానికి సిద్ధపడింది. ఈ సమాచారం అందుకున్న నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు అక్కడికి చేరుకుని హంగామా సృష్టించారు. అరెస్టును అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేలూరు పోలీసులతో సీమాన్ మద్దతుదారులు ఢీ కొట్టారు. చివరకు కోయంబేడు జాయింట్ కమిషనర్ కార్యాలయం నుంచి అదనపు బలగాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎట్టకేలకు సీమాన్‌ను అరెస్టు చేసిన మేలూరు పోలీసులు తమ వాహనంలో మదురైకు తీసుకెళ్లారు. సీమాన్ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆందోళనలకు నామ్ తమిళర్ కట్చి నాయకులు పిలుపునిచ్చారు.