సాక్షి, చెన్నై: లాటరీ టికెట్ల టైకూన్‌పై ఐటీ అధికారుల దాడులు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. గత నాలుగు రోజులుగా కోయంబత్తూరులోని మార్టీన్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు రహస్య అరలనుంచి కట్టల కొద్ది నగదు పట్టుబడింది. చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాల్లో ఏకకాలంలో 70 చోట్ల తనిఖీలు నిర్వహించారు. లాటరీ టికెట్ల టైకూన్ మార్టీన్ కార్యాలయాలు, నివాసాలపై దాడులు జరపగా..రూ.595 కోట్ల విలువైన లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై ప్రశ్నిస్తున్న అధికారులు.. లెక్కకు రాని మరో 619 కోట్ల రూపాయల గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో రూ. 24.57 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా.. వందల కోట్ల విలువైన దస్తావేజులను గుర్తించారు.
క్యాషియర్ మరణంలో అనుమానాలు
ఐటీ దాడుల నేపథ్యంలో లాటరీ మార్టిన్ కార్యాలయంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న పళని స్వామి మృతదేహం ఓ చెరువులో లభించడం కలకలం రేపింది. ఐటీ వర్గాలు కోయంబత్తూరుకు చెందిన పళనిస్వామి వద్ద సైతం విచారణ జరిపినట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం మేట్టుపాళయం సమీపంలోని వెల్లంకాడు చెరువులో పళనిస్వామి మృతదేహంగా తేలడం అనుమానాలకు దారి తీశాయి. ఈ మృత దేహాన్ని కోయంబత్తూరు మార్చురీలో ఉంచారు. తన తండ్రి మరణం మీద పళని స్వామి కుమారుడు రోహిన్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. తన తండ్రి పనిచేస్తున్న కార్యాలయంలో ఉన్న ఇద్దరిపై తనకు అనుమానాలు ఉన్నాయని, నిర్ధారణ అయ్యాక వారి పేర్లను బయటపెడతానని వ్యాఖ్యానించాడు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణను ముమ్మరం చేశారు. కాగా, రోహిన్ కుమార్ పేర్కొంటూ, తన తండ్రి మృత దేహం మార్చురీలో ఉందని, సంబంధం లేని వ్యక్తులు వస్తున్నారని, కొందరు పోలీసులు పని గట్టుకుని రావడం, వెల్లడం వంటివి జరుగుతుండడం తన అనుమానాలకు బలాన్ని కల్గిస్తున్నట్టు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment