సీఎస్‌ ఇంటిపై ఐటీ దాడులు | Income tax dept raids Tamil Nadu chief secretary's house in Chennai | Sakshi
Sakshi News home page

సీఎస్‌ ఇంటిపై ఐటీ దాడులు

Published Thu, Dec 22 2016 2:50 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

బుధవారం చెన్నైలోని సీఎస్‌ నివాసం వద్ద మోహరించిన భద్రతా బలగాలు. (ఇన్‌సెట్‌లో)రామ్మోహన్‌రావు

బుధవారం చెన్నైలోని సీఎస్‌ నివాసం వద్ద మోహరించిన భద్రతా బలగాలు. (ఇన్‌సెట్‌లో)రామ్మోహన్‌రావు

- చెన్నైలోని ఇళ్లు, ఆఫీస్‌లు, సన్నిహితుల నివాసాల్లో సోదాలు
- 30 లక్షల నగదు, బంగారం, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
- జయలలిత, శశికళతో సీఎస్‌ రామ్మోహన్‌రావుకు సన్నిహిత సంబంధాలు.. సీఎం పదవి కోసం పోటీపడుతున్న శశికళ
- ఢిల్లీలో ఇటీవల కేంద్ర పెద్దలతో సీఎం పన్నీర్‌సెల్వం భేటీ
- అనంతరం శశికళ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు


సాక్షి ప్రతినిధి, చెన్నై:

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)... రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి సారథి. ఇంతటి కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒక సీఎస్‌ ఇళ్లపై ఐటీ దాడులు జరగడం బహుశా దేశచరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చేమో! ప్రముఖ కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి ఆస్తులపై జరిగిన దాడులకు కొనసాగింపుగా ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్‌రావుపై ఆదాయపు పన్నుశాఖ బుధవారం కొరడా ఝళిపించింది. చెన్నై అన్నానగర్‌లోని ఆయన ఇల్లు, సచివాలయంలోని ఆయన చాంబర్, కుమారుడి ఇల్లు సహా 13 చోట్ల సుమారు వంద మంది అధికారులు బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.30 లక్షల నగదు, 5 కిలోల బంగారం, స్థిర, చరాస్థుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఏపీ రాజకీయ నేతలతో సీఎస్‌కు సంబంధాలు
దివంగత ముఖ్యమంత్రి జయలలితతోపాటు ప్రస్తుతం తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి కోసం వేగంగా పావులు కదుపుతున్న ఆమె నెచ్చెలి శశికళకు సీఎస్‌ రామ్మోహన్‌రావు అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి లాగే రామ్మోహన్‌రావు కూడా జయలలిత, శశికళతో ఆత్మీయుడిగా మెలిగారు. పార్టీలో ఆధిపత్యంతోపాటు సీఎం పీఠం కోసం శశికళ పోటీపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చారు. అనంతరం శశికళ సన్నిహితుల నివాసాలపై ఐటీ దాడులు ప్రారంభం కావడం గమనార్హం.

తాజాగా రామ్మోహన్‌రావు నివాసాలపై జరిగిన దాడులు రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ మరిది బద్రీనారాయణ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బద్రీనారాయణ సీఎస్‌ రామ్మోహన్‌రావుకు స్వయానా వియ్యంకుడు కావడం విశేషం. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన రామ్మోహన్‌రావుకు రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. శేఖర్‌రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రామ్మోహన్‌రావును కూడా అతి త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త సీఎస్‌ నియామకంపై ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కసరత్తు మొదలుపెట్టారు.

పారామిలటరీ దళాల మోహరింపు
ఆదాయపు పన్నుశాఖ అధికారులు బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు అన్నానగర్‌లోని రామ్మోహన్‌రావు ఇంటిలోకి అకస్మాత్తుగా చొరబడ్డారు. ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నారు. తాము ఫలానా అంటూ ఐటీ అధికారులు ఇంట్లోని పనివాళ్లకు చెప్పి, బెడ్‌రూంలోకి పంపించారు. దీంతో ఆశ్చర్యానికి లోనైన రామ్మోహన్‌రావు బయటకు రాగానే అధికారులు సోదాలు ప్రారంభించారు. సీఎస్‌ ఇంటిపై ఐటీ దాడుల గురించి తెలియడంతో పెద్ద సంఖ్యలో మీడియా, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. దీంతో సీఎస్‌ ఇంటి పరిసరాల్లో భారీ సంఖ్యలో తమిళనాడు పోలీసులతోపాటు కేంద్ర పారామిలటరీ దళాలు మోహరించాయి. సీఎస్‌ ఇంటి పరిసరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

చెన్నై తిరువాన్మియూర్‌లోని సీఎస్‌ బంధువు ఇల్లు, అన్నానగర్‌లోని ఒక సీనియర్‌ మంత్రి సహాయకుడు రమేశ్‌ ఇల్లు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని సీఎస్‌ ఇల్లు, బెంగళూరు, చిత్తూరులోని ఆయన బంధువుల ఇళ్లు కలుపుకుని మొత్తం 13 చోట్ల ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. మొత్తం రూ.30 లక్షల నగదు, 5 కిలోల బంగారం, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన నగదులో మొత్తం రూ.2 వేల నోట్లే ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సచివాలయంలోని సీఎస్‌ చాంబర్‌లో సైతం ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని డాక్యుమెంట్లు, కంప్యూటర్, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.

అన్నాడీఎంకే, ఐఏఎస్‌ల్లో కలవరం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నత హోదాల్లో ఉన్న రామ్మోహన్‌రావు ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని అంటున్నారు. ఐటీ దాడులు అధికార అన్నాడీఎంకే శ్రేణుల్లో, రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారుల్లో కలవరం పుట్టించాయి.

ఐటీ వద్ద కచ్చితమైన ఆధారాలు
తమిళనాడులో ప్రముఖ కాంట్రాక్టర్‌గా పేరొందిన శేఖర్‌రెడ్డి, ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నగదు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. కొన్ని డాక్యుమెంట్లు కూడా దొరికాయి. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మెహన్‌రావులతో శేఖర్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు, అక్రమ లావాదేవీల్లో ప్రమేయం ఉన్నట్లుగా కొన్ని సాక్ష్యాలు లభ్యమైనట్లు తెలిసింది.

అయితే శేఖర్‌రెడ్డి మాత్రం తనతో మరెవ్వరికీ సంబంధం లేదని సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చాడు. అధికారులు ఎంత ప్రశ్నించినా అదే జవాబు చెప్పాడు. నిజాలు రాబట్టేందుకు అధికారులు తమ విచారణ శైలిని మార్చడంతోపాటు తమ వద్ద అన్ని వివరాలు ఉన్నాయి, అంగీకరిస్తే నీకే మంచిందని హెచ్చరించడంతో శేఖర్‌రెడ్డి అనేక పేర్లను బయటపెట్టాడు. ఇలా కచ్చితమైన ఆధారాలు లభ్యం కావడంతో సీఎస్‌ పి.రామ్మోహన్‌రావుపై ఇంటిపై దాడులు జరిపినట్లు సమాచారం.

దాడుల వెనుక మోదీ హస్తం: ‘ఆప్‌’కార్యకర్త
రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడుల వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హస్తం ఉందని ఆరోపిస్తూ అమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్త సెంథిల్‌కుమార్‌ అన్నానగర్‌లోని సీఎస్‌ ఇంటి వద్ద నినాదాలు చేశాడు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పరిసర ప్రాంతాల వారు అతడిపై దాడికి దిగారు. ఈలోగా పోలీసులు వచ్చి సెంథిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు ఇళ్లపై ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం తన సహచర మంత్రులతో సచివాలయంలో అత్యసవర సమావేశం నిర్వహించారు. అయితే, కొందరు మంత్రుల ఐటీ అధికారులకు భయపడి ఈ భేటీకి హాజరుకాలేదు. రామ్మోహన్‌రావు స్థానంలో కొత్త సీఎస్‌ నియామకంపై చర్చ జరిగినట్లు సమాచారం. అవినీతికి పాల్పడే మంత్రులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. ఐటీ దాడుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేదని కేంద్ర మంత్రులు పొన్‌ రాధాకృష్ణన్, నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు.

ఎవరీ రామ్మోహన్‌రావు?
1985 ఐఏఎస్‌ బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌కు చెందిన చెందిన రామ్మోహన్‌రావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. ఐఏఎస్‌ అధికారిగా ఆయన తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేశారు. 2001–2003 మధ్య కాలంలో గుజరాత్‌లో మారిటైమ్‌ బోర్డు డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. మరలా తమిళనాడుకు వచ్చారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఎవరున్నా ముఖ్యమంత్రి జయలలిత సీనియర్‌ ఐఏఎస్‌ అధికారైన రామ్మోహన్‌రావు సలహాలు తీసుకునేవారు.

ఇలా ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా ‘అమ్మ’అభిమానాన్ని పొందారు. ఐఏఎస్‌ సీనియారిటీ జాబితాలో 20వ స్థానంలో ఉన్న రామ్మోహన్‌రావు ‘అమ్మ’దయవల్ల వల్ల ఈ ఏడాది జూన్‌ 8వ తేదీన తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అప్పట్లో తమను పక్కనపెట్టి రామ్మోహన్‌రావును సీఎస్‌గా నియమించడం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను అసంతృప్తికి గురిచేసింది.

టీడీపీ ఎమ్మెల్యే బంధువు ఇంట్లో ఐటీ దాడులు
- కీలకపత్రాలు, బంగారం స్వాధీనం
- ఎమ్మెల్యే మరిది తమిళనాడు సీఎస్‌కు వియ్యంకుడు
చిత్తూరు, సాక్షి:
చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ మరిది బద్రీనారాయణ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, బద్రీనారాయణ వియ్యంకులు కావడం గమనార్హం. కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి ఇంట్లో దొరికిన కీలక పత్రాల్లో రామ్మోహన్‌రావు, బద్రీనారాయణల పేర్లు ప్రముఖంగా ఉండటంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం కోట్లాది రూపాయల నగదును బంగారం రూపంలోకి మార్చాలని ఐటీ అధికారులు ఈ సోదాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. పలు కీలకపత్రాలు, బంగారం, భూమి క్రయవిక్రయాల పత్రాలను సీజ్‌ చేసినట్లు సమాచారం.

బద్రీనారాయణ అల్లుడు వివేక్, కుమార్తె అశ్వనీలను కూడా ఐటీ అధికారులు విచారించారు. గతంలో టీడీపీ ఎంఎల్‌ఎ సత్యప్రభ ఇంట్లో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. మళ్లీ అదే కుటుంబానికి చెందిన బద్రీనారాయణ ఇంట్లో కూడా దాడులు చేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులకు ఈ వ్యవహారం మింగుడు పడడం లేదు. బద్రీనారాయణ తమిళనాడు సీఎస్‌ రామ్మోహన్‌రావుకు శేఖర్‌రెడ్డిని పరిచయం చేసినట్లు సమాచారం. ఆ పరిచయంతోనే శేఖర్‌రెడ్డి తమిళనాడులో పలు విలువైన కాంట్రాక్టులు దక్కించుకున్నాడని జిల్లా టీడీపీ నాయకులు చెబుతున్నారు. రామ్మోహన్‌రావు సొంత జిల్లా ప్రకాశంలోనూ బుధవారం ఐటీ దాడులు జరగబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement