తమిళనాడులో ఐటీ దాడుల ప్రకంపనలు
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సీఎస్ రాంమోహన్ రావు, ఆయన కుమారుడి ఇళ్లు, ఆస్తులపై ఐటీ దాడులు నేటి ఉదయం వరకూ కొనసాగాయి. దాదాపు 25 గంటలపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. మొత్తంగా 13 చోట్ల 100 మంది అధికారులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. తనిఖీలలో భాగంగా 30 లక్షల మేర కొత్త రూ.2వేల నోట్లు, 5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోదాలు జరిపిన అధికారులు స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లో పలు ఆస్తులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. వాటి ఆధారంగానే అక్రమాలకు పాల్పడ్డ సీఎస్ రాంమోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. శశికళ సన్నిహితులైన రామ్మోహన్‌రావు, మంత్రి పళనిస్వామి నివాసాలపై జరిగిన దాడులు రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మరోవైపు శశికళ ఆప్తుడు అయిన మంత్రి యడపాటి పళనిస్వామి బంధువులపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పళనిస్వామి బంధువు నాగరాజన్ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అతడి ఇంట్లో కోటిన్నర నగదుతో పాటు 6కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైంది. పలు కీలక డాక్యుమెంట్లను ఐటీశాఖ స్వాధీనం చేసుకుంది. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ మరిది బద్రీనారాయణ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బద్రీనారాయణ సీఎస్ రామ్మోహన్‌రావుకు స్వయానా వియ్యంకుడు కావడం విశేషం. బంగారం, నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం కొత్త సీఎస్ ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది.