
ఎక్కువ ఎత్తు కనిపించాలని..
మహారాష్ట్రలో పోలీసు నియామకాలు జరుగుతున్నాయి. వాటికి ఎక్కడో త్రయంబకేశ్వర్ నుంచి రాహుల్ పాటిల్ అనే యువకుడు కూడా వచ్చాడు. తాను తక్కువ ఎత్తు ఉంటే ఎంపిక కానేమోనని అతడికి భయం పట్టుకుంది. అందుకోసం ఓ ఉపాయం ఆలోచించాడు. ఎటూ తల పైనే ఎత్తు చూస్తారు కాబట్టి.. ఎంచక్కా విగ్గుపెట్టుకుని వచ్చేశాడు. అయితే, పోలీసులతోనే ఆటలా అంటూ.. రిక్రూట్‌మెంట్‌లో ఉన్న అధికారులు అతగాడిని పట్టేసుకుని, అతడిపై అనర్హత వేటు వేశారు.
మొదట్లో అతడి ఎత్తు 165 సెంటీమీటర్లుగా నమోదు కావడంతో రాహుల్ ఎంపికయ్యాడని, కానీ అతడి తీరును ఒక కానిస్టేబుల్ అనుమానించాడని నాసిక్ డీసీపీ శ్రీకాంత్ ధివారే తెలిపారు. గట్టిగా అడిగితే.. ఎక్కువ ఎత్తు కనిపించేందుకు విగ్గు పెట్టుకుని వచ్చినట్లు అతడు అంగీకరించాడన్నారు. దాంతో అతడిపై అనర్హత వేటు వేశామని, తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని ధివారే చెప్పారు. ముంబై, ఔరంగాబాద్ నగరాలు మినహా మహారాష్ట్ర వ్యాప్తంగా 5,756 పోలీసు పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. వీటికి మొత్తం 8.73 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.