సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లిన వైఎస్సార్ సీపీ బృందం అక్కడ పలువురు నేతలను కలిసి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన తీరును వారి దృష్టికి తీసుకువెళుతుంది. సోమవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాల్సిందిగా కోరారు. అంతేకాకుండా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన తీరును కూడా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కేసును తప్పుదోవ పట్టించేలా డీజీపీ ఆర్పీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు.
సురవరంను కలిసిన వైఎస్సార్ సీపీ బృందం
అలాగే సాయంత్రం వైఎస్సార్ సీపీ నాయకులు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కలిశారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను వైఎస్సార్ సీపీ నేతలు ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఏ విధంగా తప్పుదారి పట్టిస్తుందో కూడా ఆయనకు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment