
భూసేకరణ బిల్లులో సవరణలు ప్రతిపాదించిన వైఎస్సార్ సీపీ
న్యూఢిల్లీ: గత కొన్ని రోజుల క్రితం లోక్ సభలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లులో కొన్ని సవరణలను వైఎస్సార్ సీపీ తాజాగా ప్రతిపాదించింది. భూసేకరణ చట్టంలో సవరణ బిల్లుపై వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. సాగునీటి వసతి ఉన్న భూములను సేకరణ నుంచి మినహాయించాలని కోరినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు బహుళ పంటలు పండే భూములను బిల్లు నుంచి మినహాంచాలని కోరుతున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బహుళ పంటలు పండే భూములను బిల్లు నుంచి మినహాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇలాంటి భూములు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆ భూములను సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ కు తప్పనిసరి చేయాలన్నారు.
సీఆర్డీఏ పేరిట ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందన్నారు. దాదాపు 32 వేల ఎకరాలను అక్కడి రైతులకు ఇష్టం లేకుండా తీసుకుంటోందన్నారు. బహుళ పంటలు పండే భూములను కూడా లాక్కోంటుదన్నారు. అభివృద్ధి ద్వారానే దేశంలో పేదరికి అంతం కాగలదని తాము కూడా నమ్ముతున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. కానీ అభివృద్ధికి, భూయజమానులకు మధ్య సమతుల్యత సాధించాలన్నారు. జీవనోపాధికి ఆధారమైన భూములు సేకరించి.. ఆహార భద్రతకు ముప్పు కల్గించకూడదని ఆయన అన్నారు.