మేకలు..కోళ్లతో బెట్టింగ్ !
Published Tue, Feb 23 2016 12:28 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
జెడ్పీ, టీపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ దందా
సాక్షి, బెంగళూరు: మేకలు, గొర్రెలు, బర్రెలు, కోళ్లు, బాతులు కాదేదీ బెట్టింగ్‌కి అనర్హం. అవును ప్రస్తుతం కర్ణాటకలో కనిపిస్తున్న పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, తాలూకా పంచాయతీలకు రెండు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు (మంగళవారం) వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. సాధారణంగా బెట్టింగ్ అంటే డబ్బు లేదంటే నగలు ఎక్కువగా పందెం కాస్తుంటారు. కానీ, జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల సంగ్రామం వేడి ఎక్కువగా గ్రామాల్లోనే కనిపిస్తుండడంతో ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. డబ్బు, నగలే కాదు ఇంట్లోని మేకలు, గొర్రెలు, బర్రెలు ఇలా పశుసంపద కూడా బెట్టింగ్‌లో పెట్టేస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఇక ఈ బెట్టింగ్ దందా కూడా మామూలుగా సాగడం లేదండోయ్. సాధారణంగా బెట్టింగ్‌లో పందెం కాసే వాళ్లకు పందెంలో గెలిస్తే రెండింతలు మొత్తాన్ని అందజేస్తామనే ఆఫర్ ఉంటుంది. కానీ ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడం, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో బెట్టింగ్ మొత్తం కూడా భారీగా పెరిగిపోయింది.
పందెం గెలిచిన వాళ్లకు ఏకంగా మూడింతలు మొత్తాన్ని అందజేస్తామంటూ బెట్టింగ్ రాయుళ్లు ఆఫర్ ఇస్తున్నారంటే బెట్టింగ్ దందా ఎంత జోరుగా సాగుతోందో అర్ధమవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫలానా పార్టీ ఎన్ని జిల్లా, తాలూకా పంచాయితీ స్థానాలను గెలుచుకుంటుందనే అంశంపై బెట్టింగ్‌లు కాసే వాళ్లు కొందరైతే, తమ తమ గ్రామాల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపు సాధిస్తారు? ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారు? అనే అంశంపై బెట్టింగ్‌లు కాసే వాళ్లు మరికొందరు. ఏది ఏమైనా ఈ బెట్టింగ్‌లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో, అసలు జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో ఎవరు ఎక్కువ స్థానాలతో సత్తా చాటుతారో తెలుసుకోవాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Advertisement
Advertisement