బాన్సువాడ టౌన్/పెర్కిట్/ఆర్మూర్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఇరిగేషన్ డీఈ శ్రావణ్‌కుమార్‌రెడ్డి వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగంతో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బాన్సువాడలోని ఇరిగేషన్ కార్యాలయం, డీఈ అద్దె ఇంట్లో, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆయన తల్లిదండ్రులు నివాసం ఉండే ఇంట్లో, హైదరాబాద్‌లో అతని నివాసంపై ఏక కాలంలో దాడులు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
బాన్సువాడ నియోజక వర్గంలో ని కోటగిరి, వర్ని, రుద్రూర్ మండలాల ఇరిగేషన్ డీఈగా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్‌కుమార్‌రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగంపై నిజామాబాద్‌లో కేసు నమోదైంది. శనివారం తెల్లవారు జాము నుంచి డీఈ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాన్సువాడ బస్‌డిపో సమీపంలో ఉన్న ఓ అద్దె ఇంట్లో శ్రావణ్‌కుమార్‌రెడ్డి నివాసముంటున్నాడు. ఇంట్లోనే ఉన్న డీఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృపా నగర్‌లో ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో కరీంనగర్ రేంజ్ ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు, సంగారెడ్డి సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో సోదా లు చేశారు.
రికార్డులను పరిశీలించారు. కంప్యూటర్, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలో కొనుగోలు చేసిన రూ. 33 లక్షల విలువ గల ప్లాట్ పత్రాలు, రూ. 37 వేల నగదును అద్దె ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. గదిలో ఉన్న ల్యాప్‌టప్‌ను పరిశీలించారు. డీఈతో పాటు జూనియర్ అసిస్టెంట్ అజీమొద్దీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని శ్రావణ్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు నివసించే ఇంటికి వేకువజామున ఐదు గంటలకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు సోదాలు నిర్వహించారు.
సోదాల్లో శ్రావణ్ కుమార్ రెడ్డి పేరు మీద అంకాపూర్‌లో ఏడున్నర ఎకరాల భూమి ఉన్నట్లు దస్త్రాలు లభ్యమయ్యాయి. అధికారులు దస్త్రాలను సీజ్ చేశారు. అలాగే శ్రావణ్ కుమార్ రెడ్డి తల్లి ఇందిర దేవి బ్యాంకు లాకరును అధికారులు తెరిచి చూశారు. లాకర్లో 30 తులాల బంగారు ఆభరణాలుండగా అవి తమ పూర్వీకుల నుంచి సంక్రమించాయని ఇందిరాదేవి అధికారులకు తెలిపారు. కాగా అధికారులు లాకర్‌ను ఫ్రీజ్ చేశారు. అలాగే హైదరాబాద్‌లోనూ తనిఖీ నిర్వహించారు. మొత్తం రూ. 5.50 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాల్లో లభించిన ఆస్తుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఏసీబీ ఆదిలాబాద్ ఇన్‌స్పెక్టర్ కాశయ్య తెలిపారు. దాడుల్లో కరీంనగర్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ మరో ముగ్గురు సిబ్బంది పాల్గొన్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే దాడులు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏకకాలంలో దాడులు నిర్వహించాం. అంకాపూర్‌లో శ్రావణ్ కుమార్ రెడ్డికి ఏడున్నర ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించాం. అలాగే ఆయన తల్లి ఇందిర దేవి బ్యాంకు లాకర్‌లో 30 తులాల నగలు లభ్యమయ్యాయి. లాకర్‌ను ఫ్రీజ్ చేశాం. ఆస్తికి సంబంధించిన దస్త్రాలను సీజ్ చేశాం. సోదాల్లో లభ్యమైన ఆస్తుల వివరాలను డీజీపీ కార్యాలయానికి నివేదిస్తాం.
– కాశయ్య, ఏసీబీ ఇన్‌స్పెక్టర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment