ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా, కన్నుల పండువగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్‌లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే వేడుకలు వినూత్నంగా జరుపుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజైనందున రాజ్యాంగ స్ఫూర్తిని చాటాలన్నారు. పోలీసు పరేడ్‌గ్రౌండ్‌ను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. నగరమంతా పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గణతంత్ర వేడుకల్లో అధికారులు తమతమ శాఖల çశకటాలను, స్టాళ్లను ఏర్పాటు చేయాలని, ఇందుకు డీఆర్‌డీవో బాధ్యత వహించాలన్నారు. గ్రౌండ్, స్టేజీ వద్ద పూలతో అలంకరించాలని ఉద్యానశాఖ అధికారులతో పేర్కొన్నారు. పాఠశాలల విద్యార్థులచేత 45 నిమిషాలకు మించకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈవోను ఆదేశించారు. ఆయా శాఖల్లోని ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు అవార్డులు అందజేయడానికి ప్రతిపాదన జాబితాను ఈనెల 22లోగా అందజేయాలన్నారు. సమావేశంలో జేసీ రవీందర్‌రెడ్డి, డీఎఫ్‌వో ప్రసాద్, డీఆర్‌డీవో వినోద్‌కుమార్, అడిషనల్ డీసీపీ శ్రీధర్‌రెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పల్స్‌పోలియోపై ప్రచారం చేయండి..
ఈనెల 28న, మార్చి 11న జరిగే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో పల్స్‌పోలియోపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 0–5 వయస్సు గల 2,16,832 మంది పిల్లలకు పోలియోచుక్కలు వేసేందుకు అంచనా వేశామని, ఇందుకోసం 1021 పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 4150 మంది సిబ్బందిని నియమించామన్నారు. పల్స్‌పోలియో నిర్వహించే తేదీలను గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. అదేవిధంగా విద్యాశాఖ, ఇంటర్, ఐసీడీఎస్ శాఖల సమన్వయంతో జిల్లాలో 1–19 వయస్సుగల పిల్లలందరికి నట్టల నివారణ మందులను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో 4,49,554 మంది పిల్లలకు ఈ నట్టల నివారణ మందులను పంపిణీ చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఎంహెచ్‌వో డా.వెంకట్ తెలిపారు.
ఓటర్ దినోత్సవాన్ని..
ఈనెల 25న జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవంలో అందరిని భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. ఓటర్ల దినోత్సవంపై ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఎన్నికల సంఘం 2011 నుంచి ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోందని, ఒక్కో సంవత్సరం ఒక్కో అంశంతో ఈ దినోత్సవం జరుపుతారన్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, రంగవల్లుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయాలన్నారు. ఈనెల 25న కలెక్టరేట్ నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు 2కె రన్ ఉంటుందని తెలిపారు.
సెలవుకు అనుమతి తప్పనిసరి..
జిల్లా అధికారులు సెలవులో వెళ్లిన సందర్భంలో దరఖాస్తు లేదా మెసెజ్ పంపి పంపకూడదని, తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కింది స్థాయి సిబ్బందికి చెప్పి సెలవుపై వెళ్లడం సరికాదన్నారు. ఈ విషయంపై గతంలోనూ సూచించానన్నారు. ప్రజల విన్నపాలను సత్వరం పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు రాష్ట్ర స్థాయికి పంపించి పరిష్కరించాలన్నారు. ప్రతి ఒక్కరు సమయపాలన పాటించాలని నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు సమష్టిగా ముందుకు వెళ్లాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment