పోలీసులకు సవాల్‌ | series of robberies in nizamabad | Sakshi
Sakshi News home page

పోలీసులకు సవాల్‌

Published Tue, Jan 30 2018 6:13 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

series of robberies in nizamabad - Sakshi

దొంగలు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేశామని పోలీస్‌ శాఖ పేర్కొంటుండగా.. ఎంత నిఘా ఉన్నా మమ్మల్నెవరూ ఆపలేరన్నట్లు చోరులు రెచ్చిపోతున్నారు. మొన్న వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ జరగ్గా.. నిన్న ఏకంగా జేసీ ఇంటి తాళాలే బద్ధలయ్యాయి. వరుస ఘటనలు పట్టణవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

సాక్షి, కామారెడ్డి:  జిల్లా కేంద్రంలో జరిగిన వరుస చోరీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. రెండు రోజుల్లో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని పెద్దబజార్‌లో గల వేణుగోపాలస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. చోరులు అత్యంత విలువైన పంచలోహ విగ్రహాలను అపహరించారు. ఈ సంఘటన మరిచిపోకముందే ఆదివారం రాత్రి అశోక్‌నగర్‌ కాలనీలో నివాసం ఉండేజాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. అయితే జేసీ ఇంట్లో ఎలాంటి వస్తువులు, నగదు పోలేదని తెలుస్తోంది. తాళాలు పగులగొట్టిన విషయమై జేసీ సీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

జిల్లా కేంద్రంలో పోలీసులు రాత్రంతా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నా.. దొంగలు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇటీవల కామారెడ్డి మండలం గర్గుల్‌లో, రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో చోరీలు జరిగాయి. తాజాగా జిల్లా కేంద్రంలో రెండు రోజుల్లో రెండు సంఘటనలు జరిగాయి.

పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నా..
నిత్యం బీట్‌ కానిస్టేబుళ్లు తమకు కేటాయించిన కాలనీల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. పెట్రోలింగ్‌ జీపులు కూడా పట్టణంలో తిరుగుతున్నప్పటికీ దొంగలు రెచ్చిపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దబజార్‌కు సమీపంలోని వేణుగోపాలస్వామి ఆలయంలోకి దొంగలు దర్జాగా వెళ్లి విగ్రహాలను ఎత్తుకెళ్లిన సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజీలు, సెల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా కేసును ఛేదించే పనిలో ఉన్నారు. రూ. కోటి విలువ చేసే విగ్రహాలు ఎత్తుకెళ్లిన సంఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ సంఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే జేసీ నివసిస్తున్న ఇంటికి దొంగలు కన్నం వేశారు. ఆదివారం సెలవు కావడంతో జేసీ హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి ఇళ్లంతా వెతికారు. వారికి ఎలాంటి డబ్బులు, సామగ్రి దొరకలేదని తెలుస్తోంది. ఈ రెండు సంఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.  

పట్టణవాసుల్లో భయం...
ఇంటికి తాళం వేసి ఎటు వెళ్లాలన్నా పట్టణ ప్రజలు భయపడుతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తున్న దొంగలు.. పగటిపూట తిరిగి, రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది. బంధువుల ఇళ్లకో, ఇతర పనుల రీత్యానో ఇంటికి తాళాలు వేసి వెళ్తే గ్యారంటీ లేకుండాపోతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చైన్‌స్నాచింగ్‌ సంఘటనలు ఎక్కువగా జరిగేవి. చైన్‌స్నాచర్లు పోలీసులకు చిక్కడంతో అవి కొంతమేర తగ్గాయి. వరుసగా జరిగిన రెండు చోరీలు పట్టణ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
దొంగతనాలు జరుగకుండా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలు పోలీస్‌ శాఖకు సహకరించాలి. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి. దొంగతనాలు జరుగకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలో బంగారం, నగదు ఉంచి తాళాలు వేసి ఎటూ వెళ్లవద్దు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.  
– ఎ.శ్రీధర్‌కుమార్, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement