లండన్: చేనేత బతుకమ్మ-దసరా సంబరాలను తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా తెలుగు వారు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ప్రవాసులంతా చేనేత బట్టలు ధరించి పాల్గొనడం మాకెంతో సంతోషాన్నించిందని టాక్ ఈవెంట్స్ ఇంచార్జ్ రత్నాకర్ కడుదుల తెలిపారు. దసరా పండుగ సందర్భంగా స్వదేశం నుంచి తెచ్చిన జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా ‘అలయ్-బలయ్’ కార్యక్రమంలో, సిరిసిల్ల నుంచి ప్రత్యేకించి తెప్పించిన చేనేత శాలువాలను ఒకరికొకరు పరస్పరం వేసుకొని, జమ్మి(బంగారం)ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానికి బ్రిటీష్ ఎంపీ సీమ మల్హోత్రా మరియు భారత హై కమీషన్ ప్రతినిధి రాహుల్, లాంబెత్ మాజీ మేయర్ సాలేహ జాఫర్ తో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు, చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.