అమెరికాలో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం | NRI Devi sree Donthineni joined in USA Navy as Naval Pilot | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం

Published Fri, May 22 2020 9:46 AM | Last Updated on Fri, May 22 2020 9:54 AM

NRI Devi sree Donthineni joined in USA Navy as Naval Pilot - Sakshi

న్యూ యార్క్ : అమెరికాకు వెళ్లిన తెలుగువారు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. తమ శక్తి, యుక్తులతో తెలుగువారికి, అమెరికాకు కూడా మంచి పేరు తెస్తున్నారు. ఈ క్రమంలోనే మన తెలుగమ్మాయి దేవిశ్రీ దొంతినేని అమెరికాలో నేవల్ ఫైలట్ అధికారిణిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించింది. గుంటూరు జిల్లా తెనాలి దగ్గర పొన్నూరుకు చెందిన శ్రీనివాస్, అనుపమల కుమార్తె దేవీ శ్రీ అమెరికాలో న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో పుట్టి పెరిగింది. తాను పదవ గ్రేడులో ఉన్నప్పుడు మేరీల్యాండ్‌లోని అన్నాపోలిస్ నేవీ అకాడమీ సందర్శనకు వెళ్లింది. అక్కడ నేవల్ అధికారిణి తన జీవితంలో సాధించిన విజయాలపై ఇచ్చిన ప్రసంగం ఆమెలో స్ఫూర్తిని నింపింది. ఇదే ఆమె నేవీ లో పనిచేయాలనే కలలకు ఊపిరిపోసింది. అప్పటి నేవీలో అడ్మిరల్, ఇప్పటి నార్వే అమెరికా రాయబారి కెన్నెత్ బ్రైత్‌ వైట్‌ను దేవీ శ్రీ తన తల్లిదండ్రులతో పాటు కలిసి తన ఆశయాన్ని వివరించింది. కెన్నెత్ బ్రైత్ దేవీ శ్రీ కి ప్రోత్సాహం అందించడంతో పాటు.. నేవీలో ఎలా చేరాలనే దానిపై దిశానిర్థేశం చేశారు. కెన్నెత్ ఇచ్చిన స్ఫూర్తితో దేవీ శ్రీ ఆ దిశగా కసరత్తు చేసింది.

2015 వేసవిలో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ (యూఎస్‌ఎన్‌ఏ)కు దరఖాస్తు చేసుకుంది. అదే సంవత్సరం డిసెంబర్‌లో అమెరికా నేవీ ఆమె దరఖాస్తును ఆమోదించింది. సైన్యంలో అబ్బాయిలను పంపించడానికే ఒకటికి పదిసార్లు ఆలోచించే తల్లిదండ్రులున్నారు. అలాంటిది అమ్మాయిని పంపించడం ఎలా అని సందిగ్ధంలో ఉన్న తల్లిదండ్రులకు దేవీ శ్రీ నే నచ్చచెప్పింది. దేశానికి సేవ చేయాలనే తన సంకల్పానికి సహకరించమని కోరడంతో దేవీ శ్రీ తల్లిదండ్రులు అందుకు సమ్మతించారు. ప్రస్తుతం నేవీ శిక్షణ పూర్తి చేసుకున్న దేవీ శ్రీ దొంతినేని నేవీ ఫైలట్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించింది. ఇది మన తెలుగమ్మాయి సాధించిన విజయం. ఓ తెలుగమ్మాయి అమెరికాలో ఇలాంటి బాధ్యతలు స్వీకరించడం యావత్ తెలువారందరికి గర్వకారణమైన విషయమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దేవీ శ్రీ ని ప్రశంసించింది. ఆమె భవిష్యత్తులో తన పదవికి వన్నె తెచ్చేలా ఎన్నో విజయాలు సాధించాలని నాట్స్ అకాంక్షిస్తున్నట్టు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement