కాలిఫోర్నియా : 2001వ సంవత్సరం ఆగష్టు 4న కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో శ్రీకారం చుట్టుకున్న సిలికానాంధ్ర సంస్థ 17వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. క్యూపర్టీనో నగరం డియాంజా కాలేజీలో జరిగిన ఈ వేడుకలకు సిలికానాంధ్ర కుటుంబం సభ్యులతో పాటు శ్రేయోభిలాషులు, దాతలు హాజరయ్యారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం సంప్రదాయ కార్యక్రమాలతో తెలుగుతనం ఉట్టిపడేలా సాగింది.
మారేపల్లి వెంకటశాస్త్రి వేదపఠనంతో ప్రారంభమైన ఈ వార్షికోత్సవ వేడుకలకు, విచ్చేసిన అతిథులకు తాటిపాముల మృత్యుంజయుడు ఆహ్వానం పలుకుతూ గత పదహారేళ్ళుగా సిలికానాంధ్ర జరిపిన ప్రయాణాన్ని, చేరుకొన్న మైలురాళ్ళను పునరావలోకనం చేశారు. దిలీప్ కొండిపర్తి, మాధవ కిడాంబి సారథ్యంలో ప్రదర్శించిన 'హాస్యవల్లరి'లోని లఘు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ఆధునిక సాంకేతికాభివృద్ధి తెస్తున్న ఇబ్బందులు, అంతర్జాలంలో జరుగుతున్న పెళ్ళిచూపులు, వివిధ భాషాసంస్కృతుల మేళమైన హైదరాబాద్ నగర జీవిత చిత్రాలని ముఖ్యాంశాలుగా రచించిన ఈ నాటికలు సభను నవ్వులతో ముంచెత్తాయి. మాధవ కిడాంబి, రాంబాబు మంచికంటి, శాంతివర్ధన్ అయ్యగారి, లలిత అయ్యగారి, అనిమేష్ కొండిపర్తి, మూర్తి వేదుల, సతీష్ ముచ్చెర్ల సమర్థవంతంగా పాత్రలను పోషించారు. రాంపల్లి సదాశివ మిమిక్రీ, మాట్లాడేబొమ్మను ప్రదర్శించారు. 'జానపద బ్రహ్మ' మానాప్రగడ నరసిం హమూర్తి కుమారులు సాయి, శ్రీనివాస్ లు పాడిన జానపద గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చివరగా, 'వికటకవి తెనాలి రామకృష్ణ ' నాటకం ప్రదర్శించారు. రావు తల్లాప్రగడ రచించగా, తెనాలి రామకృష్ణుని పాత్రలో ప్రముఖ నటుడు అక్కిరాజు సుందర రామకృష్ణ ఒదిగిపోయారు. హాస్యచతురోక్తులతో, మధురంగా ఆలపించిన పద్యాలతో సభికులనుండి కరతాళ ధ్వనులను అందుకున్నారు. ఇతర పాత్రల్లో కూచిభొట్ల శాంతి, ఆర్చీశ్ ప్రఖ్య, శ్రీవేద శ్రీపాద, శ్రీదేవి అంగజాల, సూరజ్ దశిక, శ్రీనివాస శ్రీపాద, నారయణన్ రాజు, రావు తల్లాప్రగడ, సదాశివ్ రామపల్లి, శ్రీనివాస్ మంద్రప్రగడ, శర్మ యేడిద, వంశీ ప్రఖ్య, అభిరాం కల్లూరు నటించారు. హైస్కూల్ చదువుతున్న వరకూర్ ఈష మొదటిసారిగా కీబోర్డు సహకారాన్ని అందించింది.
వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి అధ్యక్షోపన్యాసం చేస్తూ సిలికానాంధ్ర సాధించిన విజయాలను, రాబోయే సంవత్సరాలలో చేపట్టే కార్యక్రమాలను సభికులకు వివరించారు. సిలికానాంధ్ర మనబడి కులపతి చమర్తి రాజు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ గత పదకొండు సంవత్సరాలలో 35000 మందికి పైగా ప్రవాస బాలలకు తెలుగు నేర్పుతున్న మనబడి అభివృద్ధిని వివరించారు. ఈ కృషి వెనకాల ఉన్న కార్యకర్తలను, ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించి అభినందించారు. 2018-19 సంవత్సరానికి మనబడి ప్రవేశాలు జరుగుతున్నాయని, manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ముఖ్య కోశాధికారి కొండుభట్ల దీనబాబు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, సంగీత నృత్యాలకోసం ఏర్పాటు చేసిన 'సంపద' అకాడమీ కార్యక్రమ వివరాలను సభికులతో పంచుకొన్నారు. మహారాజపోషకుడు, హృద్రోగ నిపుణుడు డాక్టర్ లక్కరెడ్డి హనిమిరెడ్డి చైర్మన్ కూచిభోట్ల ఆనంద్ ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి గ్రామంలో నిర్మిస్తున్న సంజీవని వైద్యశాల అందించబోయే సేవలను అభినందిస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను, దాతలను సత్కరించారు. ఈ వేదికపైనే శ్రీ విళంబి ఉగాది ఉత్సవంలో జరిగిన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ 'ఎనుకుదురాట - అచ్చ తెలుగు అవధానం' మాతా కోటేశ్వరరావు, మాతా శాంకరీ దేవి సంకలనం చేసిన పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అనిల్ అన్నం, సాయి కందుల, విజయసారధి, రవి చివుకుల, కిశోర్ గంధం, వంశీ నాదెళ్ళ, రత్నమాల వంక, స్నేహ వేదుల, వసంత మంగళంపల్లి, రాజశేఖర్ మంగళంపల్లి సహాయం అందజేశారు. అందమైన కార్యక్రమాలతో పాటు పసందైన పదహారణాల తెలుగు భోజనంతో కార్యక్రమం ఆద్యంతం తెలుగుతనం ఉట్టిపడేలా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment