సాక్షి, విజయవాడ : అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించిన శాక్రమెంటో తెలుగు సంఘం(టాగ్స్) ప్రతి సంవత్సరం కర్నాటక విద్యాంసులను సత్కరిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా 2018 ఏడాదికిగానూ పప్పు సదాశివ శాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం, కూచిభొట్ల మురళీ మోహన్‌కి 20 ఏళ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారం, కూచిభొట్ల అపర్ణకి 10 ఏళ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారాలని ప్రదానం చేశారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రవాసాంధ్ర బాలుడు మాస్టర్ 'నాగం విశ్రుత్' కర్నాటక సంగీత గాత్ర అరంగేట్ర కార్యక్రమంలో టాగ్స్ పురస్కార గ్రహీతలకు సన్మానం, అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి 450 మందికి పైగా హాజరయ్యారు.
సిలికానంధ్ర సంస్థ చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల చేతులమీదుగా నిర్విరామంగా 320 గంటలు అన్నమాచార్య కీర్తనలు పాడిన పప్పు సదాశివ శాస్త్రికి టాగ్స్ 'జీవిత సాఫల్య పురస్కారం' ప్రదానం చేశారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ పద్మశ్రీ కొలకలురి ఇనాక్ చేతులమీదుగా ప్రముఖ కర్నాటక సంగీత వయొలిన్, గాత్ర విద్వాంసుడు కూచిభొట్ల మురళీ మోహన్‌కి టాగ్స్ '20 ఏళ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారం' ప్రదానం చేశారు. శారద కళా సమితి అధ్యక్షుడు శంకర రావు చేతుల మీదుగా కూచిభొట్ల అపర్ణకి టాగ్స్ '10 ఏళ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారం' ప్రదానం చేశారు. టాగ్స్ ట్రస్టీ, టాగ్స్ మాజీ చైర్మన్, టాగ్స్ మాజీ ప్రెసిడెంట్ నాగం వెంకటేశ్వర రావు ఈ టాగ్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment