ర్యాంక్ నంబర్ 19
► స్వచ్ఛ సర్వేక్షణ్–2017లో విజయవాడకు 1,624 మార్కులు
► జాతీయ స్థాయిలో 19వ స్థానం కైవసం
► ఢిల్లీలో అవార్డు అందుకున్న మేయర్, కమిషనర్‌లు
విజయవాడ సెంట్రల్ : స్వచ్ఛ సర్వేక్షణ్–2017 అవార్డును కైవసం చేసుకున్న విజయవాడ టాప్–10లో చోటు పొందలేకపోయింది. దక్షిణాదిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు సాధించి 19వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ర్యాంక్‌ను పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో 2,000 మార్కులకు 1,624 సాధించింది.
ఈ మేరకు ఢిల్లీలో గురువారం జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్–2017 అవార్డును కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు నుంచి మేయర్ కోనేరు శ్రీధర్, ఇన్‌చార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్, మాజీ కమిషనర్ జి.వీరపాండియన్ అందుకున్నారు.
పోటాపోటీగా...
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్, అవార్డు కోసం దేశవ్యాప్తంగా 500 నగరాలు పోటీపడ్డాయి. వాటిలో 38 నగరాలు అవార్డుకు ఎంపికయ్యాయి. ర్యాంకింగ్‌లో విజయవాడ 19 స్థానంలో నిలిచింది. గత ఏడాది 23వ ర్యాంక్‌లో నిలిచిన నగరం ఈసారి మెరుగైన ఫలితాన్ని నమోదు చేసు కుంది. అయితే టాప్–10లో చోటు లభిస్తుందన్న అధికారులు, పాలకులు అంచనాలు తారుమారయ్యాయి. గ్రేటర్ విశాఖ జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్, తిరుపతి 9వ ర్యాంక్ పొందాయి.
మరో 64 మార్కులు వచ్చి ఉంటే...
విజయవాడ నగరానికి టాప్–10లో చోటు దక్కకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. వీటిలో శాశ్వత డంపింగ్ యార్డు లేకపోవడం ముఖ్యమైనది. కమ్యూనిటీ టాయ్‌లెట్స్ విషయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సభ్యులు క్షేత్రస్థాయి పరిశీలనలో సంతృప్తి చెందలేదు. ఆ ప్రభావం మార్కులపై పడింది. మొత్తం 2,000 మార్కులకు 1,624 మార్కులు దక్కాయి. మరో 64 మార్కులు వచ్చి ఉంటే టాప్–10లో చోటు దక్కేదని అధికారులు తెలిపారు.
మార్కులు ఇలా...
మొత్తం 34 అంశాలకు సంబంధించి రూపొందించిన డాక్యుమెంట్లు, ఫొటోలకు 900 మార్కులు కేటాయించగా, 799 లభించాయి. క్షేత్రస్థాయి పరిశీలనకు 500 మార్కులు కాగా, 406 వచ్చాయి. సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌కు 600 మార్కులు కాగా, 419 మార్కులు వచ్చాయి.
అధికారులు, ప్రజాప్రతినిధుల హర్షం
స్వచ్ఛ సర్వేక్షణ్ రావడంపై నగరపాలక సంస్థ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. టాప్–10లో చోటు లభించకపోయినా, మంచి ర్యాంకునే సాధించామని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ అభిప్రాయపడ్డారు. కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ మౌలిక వసతుల కల్పనలో శాయశక్తులా కృషి చేశామన్నారు. సైంటిఫిక్ డంపింగ్ యార్డు ఉన్నట్లయితే ఫలితం మరోలా ఉండేదన్నారు. నగరపాలక సంస్థకు అవార్డు దక్కడం ఆనందంగా ఉందని ఇన్‌చార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్ పేర్కొన్నారు.
భవిష్యత్‌లో మరింత మెరుగైన ర్యాంక్
జాతీయ స్థాయిలో విజయవాడకు గుర్తింపు రావడం సంతోషంగా ఉందని మేయర్ కోనేరు శ్రీధర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన ర్యాంక్ సాధిస్తామని ఆయన చెప్పారు. ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది సహకారం వల్లే జాతీయ స్థాయిలో 19వ ర్యాంక్ దక్కిందన్నారు. అధికారులు, సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.