
అబూదాబీ : తెలంగాణ రాష్ట్రం అవతరించి నాలుగు సంవత్సరాలు పూర్తైన సందర్బంగా తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో యూఏఈలోని అబూదాబీలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం కావడంతో యుఏఈ ప్రభుత్వం ఎటువంటి వినోద కార్యక్రమాలు జరుపరాదని నిర్ణయించడంతో తెలంగాణా నుండి కళాకారులను పిలవకుండానే ఈ కార్యక్రమం జరిపామని నిర్వాహకులు తెలిపారు. అక్కడే నివసిస్తున్న తెలంగాణకు సంబంధినవారి సమక్షంలో సంఘ సభ్యుడికి చెందిన అతిథి గృహంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణా తల్లికి దీప ప్రజ్వలన చేసి తదనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. చిన్నారి సంజన పాడిన ముప్పై ఒక్క జిల్లాల ప్రాశస్త్యం తెలియ జేసే పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాస్టర్ కవీష్ పాడిన జయహే తెలంగాణా పాట ఒక్క సారిగా అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. సంకల్ప్, సంస్కృతిలు హైదరాబాద్ చారిత్రక ప్రాశస్త్యం పై పాడిన పాట అందరినీ అలరించింది. తదనంతరం మరెన్నో తెలంగాణా భావ జాలం ఉన్నగీతాలను చిన్నారులు పాడి కార్యక్రమానికి వచ్చిన వారిని అలరింపజేశారు.
సంఘ సభ్యులందరూ కలిసి జై తెలంగాణా అని రాసి ఉన్న కేక్ కట్ చేసి జయహే జయహే తెలంగాణా గీతం పాడి కార్యక్రమానికి ముగింపు పలికారు. చివరగా సంఘ ప్రతినిధులు వంశీ, కమలాకర్, రాజా శ్రీనివాస్, సదానంద్, గంగా రెడ్డి, గోపి, పల్లవి, పావని, అర్చన, రోజా, భాస్కర్ తదితరులుమాట్లాడుతూ బంగారు తెలంగాణా నిర్మాణం లో గల్ఫ్ లో ఉంటున్న తెలంగాణీయుల పాత్ర ఎంత గానో ఉందన్నారు. తెలంగాణా జాతి పిత సిద్దాంత కర్త అయిన ఆచార్య జయశంకర్ పాత్ర తెలంగాణా రాష్ట్ర అవతరణలో ఎంతో ఉందని సభికులు అభిప్రాయ పడ్డారు. జయశంకర్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు . తమ ఆట పాటలతో ప్రేక్షకులందరిని అలరించిన చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు.



Comments
Please login to add a commentAdd a comment