సిడ్నీ: బతుకమ్మ, దసరా సంబురాలు సిడ్నీలో ఘనంగా జరిగాయి. ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ నిర్వయించిన బతుకమ్మ ఉత్సవాలతో సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. వందలాది మంది తెలంగాణ ఆడపడచులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో....బంగారు బతుకమ్మ ఉయ్యాలో....ఉయ్యాల అంటూ ఈవేడుకల్లో పాల్గొన్నారు. పాటలు పాడారు.
బతుకమ్మ సంబురాలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈవేడుకల్లో ఉత్తమ బతుకమ్మల పోటీ నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణ తల్లికి వేల మైళ్ల దూరంలో ఉంటున్నా.. ఎన్నారైల మనసుంతా తెలంగాణ పైనే ఉందని సిడ్నీ బతుకమ్మ అధ్యక్షుడు అనిల్ మునగాల తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తుండటంతో పాటు, ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకు తెలంగాణ సంస్కృతిని నేర్పించడం తమ ముఖ్య లక్ష్యం అన్నారు. సిడ్నీలో నివసించే తెలంగాణ ఎన్నారైలు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జోడి మక్కే, జియోఫ్ లే, హుగ్ మక్డాట్ బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు.