'ఎంపీ కవిత తప్ప ఎవరూ పని చేయలేదా' | TPCC NRI Cells Women Empowerment Meeting In London | Sakshi
Sakshi News home page

'ఎంపీ కవిత తప్ప ఎవరూ పని చేయలేదా'

Published Wed, Mar 7 2018 9:41 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

TPCC NRI Cells Women Empowerment Meeting In London - Sakshi

లండన్: దేశానికి మహిళా రాష్ట్రపతి, మహిళా ప్రధాని, మహిళా లోక్ సభ స్పీకర్, మహిళా సీఎంలను అందించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదేనని టీపీసీసీ ఎన్నారై మహిళా కోర్ సభ్యులు అస్ర అంజుమ్ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో మహిళ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బిడ్డ కవిత ఒక్కరేనా, తెలంగాణ ఉద్యమంలో కవిత తప్ప ఎవరూ పని చేయలేదా.. మంత్రివర్గంలో ఒక్క మహిళకైనా స్థానం ఎందుకు కల్పించలేక పోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీ రాజ్ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్ తీసుకువచ్చి మహిళా సాధికారతను కాంగ్రెస్‌ చాటిందన్నారు. విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో మహిళకు సముచిత స్థానం కల్పించి.. గ్రామీణ మహిళలకు పావలా రుణాలు ద్వారా మహిళాభివృద్దికి తాము తోడ్పడ్డామని చెప్పారు. నేడు లండన్‌లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో తెలంగాణలో మహిళా పాత్ర , ప్రజాస్వామికం అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

తప్పు చేసిన ప్రభుత్వ ఉద్యోగులను చెప్పుతో కొట్టమని తాను చూసుకుంటానని చెప్పడం ముఖ్యమంత్రి స్థాయి కాదని టీపీసీసీ ఎన్నారై సెల్ యూకే శాఖ అడ్వైజరి సభ్యుడు కమలాకర్ రావు అన్నారు. తప్పు చేస్తే రాజ్యాంగ వ్యవస్థలైన చట్టాలు, కోర్ట్ ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప భౌతిక దాడులు చేయమనడం చట్టాలను అతిక్రమించడమే అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2016లో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి, లంచం తీసుకుంటే ఫోన్ చేయాలని.. ఒక్కరోజులో స్పందిస్తా అని చెప్పినట్లు గుర్తుచేశారు. భూములకు ఆధార్ కార్డు అనుసంధానం పై ఆధార్ కార్డు చట్ట ప్రకారం ఎన్నారైలకు ఎదురయ్యే సమస్యల విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 70 శాతం ఎన్నారైలకు ఆధార్ తీసుకునే అవకాశం లేదని, క్షేత్ర స్థాయిలో భూములకు ఆధార్ జత పరచకపోతే బినామీగ ప్రకటిస్తా అని సీఎం అనడం సరైన నిర్ణయం కాదన్నారు. ఎన్నారైలు నష్ట పోకుండా ఉండేలా చూస్తామని ఏ ప్రకటన చేయలేదని, స్పష్టత ఇవ్వాలని కోరారు. 

టీపీసీసీ ఎన్నారై మహిళా కోర్ సభ్యురాలు మంత్రి సరితా మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మహిళ, లోక్ సభలో తెలంగాణ బిల్లుకు అనుమతి ఇచ్చి తెలంగాణ బిల్లు పాస్ అవడానికి ముఖ్యభూమిక పోషించిన మీరా కుమార్ ఓ మహిళ, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసింది మహిళ, సాధించుకున్న తెలంగాణలో మహిళలకు సరైన గుర్తింపు లేదు. నేరెళ్ల ఘటనలో దళిత మహిళలను చిత్ర హింసలకు గురిచేస్తే పరామర్శించేందుకు వచ్చిన లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను విమర్శించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. 

టీపీసీసీ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీ కవిత మహిళా సాధికారతపై లండన్ ప్రపంచ మహిళా సదస్సులో, పార్లమెంట్‌లో మాట్లాడుతున్నారు. అదే తమ పార్టీలో మహిళలకు అన్యాయం జరిగితే ఏం మాట్లాడదు. తెలంగాణ కేబినెట్‌లో మహిళకు స్థానం లేకుంటే మాట్లాడదన్నారు. టీపీసీసీ కో-కన్వినర్ మంగళారపు శ్రీధర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ మహిళా సదస్సులో మహిళ సాధికారత చర్చలో మహిళ కాకుండా మంత్రి కేటీఆర్ పాల్గొనడం నవ్వు తెప్పిస్తుందన్నారు. నేరెళ్లలో దళితులపై చేసిన దాష్టికం యావత్‌ దేశాన్ని కదిలించిందని విమర్శించారు. 

టీపీసీసీ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ పావని బిక్కుమండ్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ద్వారానే మహిళకు న్యాయం జరుగుతుందని ఇక ఒక్క ఏడాదే కష్టాలు అని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు మేమిచ్చే స్థానం మీరే చూస్తారని చెప్పారు. టీఆర్‌ఎస్ రాచరిక పాలనను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ది చెబుతారని ప్రవీణ్ రెడ్డి గంగసాని అన్నారు. ఈ కార్య్రక్రమంలో కో కన్వీనర్ రాకేష్ బిల్లుమండ్ల , అపర్ణ, సుభాష్, పలువురు మహిళా సాధికారతపై మాట్లాడారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement