
వీరందరికీ బోర్డింగ్ పాసులూ వచ్చేశాయి!
వారి ప్రయాణం ఎప్పుడా అనుకుంటున్నారా..
కొంచెం ఆగండి.. ఇక్కడో తిరకాసు ఉంది..
టికెట్లు బుక్ చేసుకుంది మనుషులు వెళ్లేందుకు కాదు..
వారి పేర్లను పంపేందుకు.. అదీ ట్విస్ట్!
వచ్చే ఏడాది మేలో అంగారకుడిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ ల్యాండర్‌ను ప్రయోగించనుంది. ఆ గ్రహం అంతర్భాగంలో ఏముందో తెలుసుకోవాలనే లక్ష్యంతో దీన్ని పంపనున్నారు. దీనికి పెట్టిన పేరు ఇన్‌సైట్. ఈ ప్రయోగం గురించి, దాని ప్రాముఖ్యం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు నాసా కొంత కాలం కింద ‘‘మీ పేరు.. ఇంటిపేరు పంపండి’’అంటూ ఒక ప్రకటన చేసింది. వెంట్రుకలో వెయ్యో వంతు మందంతో సిలికాన్ పొరపై చెక్కి.. దాన్ని ఇన్‌సైట్ ల్యాండర్ పైభాగంలో పెట్టేస్తామని పేర్కొంది. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది పేర్లను నమోదు చేసేసుకున్నారు. వారందరికీ నాసా తరపున బోర్డింగ్ పాస్ కూడా అందింది. వచ్చే ఏడాది ఇన్‌సైట్ ప్రయోగం మొదలైనప్పటి నుంచి దాంతో పాటు మీరూ అరుణ గ్రహానికి పయనమైనట్లేనంటూ నాసా ఊరిస్తోంది. అది ఎంత దూరం వెళ్లిన విషయాన్ని బోర్డింగ్ పాసు, ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ రిపోర్టు ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని చెబుతోంది. గడువు ముగిసే సమయానికి నాసాకు అందిన పేర్లు దాదాపు 24 లక్షలు. వీరిలో అమెరికా నుంచి 6.5 లక్షల మంది ఉండగా.. 2.4 లక్షల పేర్లతో చైనా రెండోస్థానంలో.. 1.38 లక్షలతో భారత్ మూడోస్థానంలో ఉంది.
ముందుంది.. అసలు ప్రయాణం!
అంగారకుడిపైకి ఇప్పుడు పేర్లు మాత్రమే వెళ్తున్నాయి. మానవులు కూడా అక్కడకు వెళ్లేందుకు మరెంతో సమయం పట్టకపోవచ్చు. పెరుగుతున్న జనాభా.. పరిమిత వనరుల కారణంగా మానవజాతి ఎప్పటికైనా భూమిని వదిలి ఇంకో గ్రహాలకు వెళ్లాల్సిందేనని శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టు భూమిని పోలిన గ్రహాల కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఇంకో 600 ఏళ్లలో భూమ్మీద మనిషి బతకడం కష్టమని స్టీఫెన్ హాకింగ్ అంతటి భౌతిక శాస్త్రవేత్త ఇటీవల ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పూర్తి వాతావరణం మార్చేయగలమా..?
వాతావరణమన్నది లేని అంగారకుడిపై ప్రత్యేక ఏర్పాట్లతో ఇళ్లు కట్టుకుని ఉండటమా.. లేక సాంకేతిక పరి జ్ఞానంతో వాతావరణం మొత్తాన్ని మార్చేసి మనుగడ సాగించడమా అన్నదానిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే 2030కి అరుణ గ్రహంపైకి మనిషిని పంపుతా మని నాసా అంటోంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తన సంస్థ ‘బ్లూ ఆరిజన్’ ద్వారా ముందుగా అంతరిక్షానికి టూరిస్టులను పంపి, ఆ తర్వాత చంద్రుడి ధృవాల వద్ద కాలనీలు ఏర్పాటు చేసుకుని అటు పిమ్మట అంగారకుడిపైకి వెళదామని చెబుతున్నారు. 2023 కల్లా వ్యోమగాములను పంపిస్తా మని అంతరిక్ష నౌకల తయారీ సంస్థ స్పేస్ ఎక్స్ అధ్యక్షుడు ఇలాన్ మస్క్ ఇప్పటికే ప్రకటించారు.
కాస్త కృషితో సాధ్యమే..
సౌరకుటుంబానికి ఆవల అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే గ్రహం ఇప్పటివరకూ దొరకలేదు గానీ.. కొంత కృషి చేస్తే చంద్రుడితో పాటు.. అరుణగ్రహంపై మనిషి జీవించగలడని శాస్త్రవేత్తలు ఇప్పటికే అంచనాకు వచ్చారు. రెండు చోట్లా మనిషి జీవించేందుకు మౌలికమైన నీరు ఉన్నట్లు ఇప్పటికే తేలింది. జాబిల్లిపై నివాసానికి భారీ సొరంగాలు పనికొస్తాయని భావిస్తున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్