2014వ సంవత్సరం.. ఎందరో జీవితాల్లో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రమాదాలు, ఉగ్రవాద దాడులు, మహిళలపై దారుణాలు వంటి ఘటనలు అంతులేని విషాదాన్ని నింపాయి. ఎందరో జీవితాల్ని కడతేర్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో భయానక సంఘటనలు జరిగాయి. ఈ ఏడాదిలో పీడకలను మిగిల్చిన విషాద ఘటనల గురించి రౌండప్.
కూలిన మలేషియా విమానం: 295 మంది మృతి
మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం జూలై 17న ఉక్రెయిన్లో కుప్పకూలింది. అమెరికాలోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్న ఈ విమానం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్లో ఉండగా కూలిపోయింది. ఈ విమానంలో 280 మంది ప్రయాణికులతో పాటు, 15 మంది సిబ్బంది మృతి చెందారు.
పాక్లో ఉగ్ర ఘాతుకం
పెషావర్ ఉగ్రవాద ఘటన ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. ఉగ్రవాదులు అభంశుభం తెలియని చిన్నారులను పొట్టనపెట్టుకున్నారు. సైన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి పిల్లలను లక్ష్యంగా చేసుకుని విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. డిసెంబర్ 16న పెషావర్ ఆర్మీ స్కూల్లో ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో 132 మంది చిన్నారులతో సహా మొత్తం 141 మంది చనిపోయారు.
ఆస్ట్రేలియాలో నరరూప రాక్షసి
ఆస్ట్రేలియాలో నరరూప రాక్షసిలా మారిపోయి ఏడుగురు సొంత బిడ్డల్ని ఓ మహిళ పొడిచి చంపింది. కెయిర్న్స్ పట్టణానికి చెందిన మెర్సెన్ వారియా(37) డిసెంబర్ 20న తన ఏడుగురు పిల్లలతో పాటు మేనకోడలైన మరో చిన్నారినీ దారుణంగా హతమార్చింది. చనిపోయిన పిల్లల్లో 14, 12, 11, 2 ఏళ్ల వయస్సున్న నలుగురు బాలికలు, 9, 8, 6, 5 సంవత్సరాల మగ పిల్లలు ఉన్నారు.
వీడని అనుహ్య మర్డర్ మిస్టరీ
కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ అనుహ్య ఎస్తార్ మర్డర్ ఇప్పటికీ వీడలేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె 2014 జనవరి 4న విజయవాడ నుంచి ముంబయి బయల్దేరింది. జనవరి 5న ముంబై లోక్‌మాన్య తిలక్ టర్మినల్‌లో దిగిన అనూహ్య హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై కంజుమార్గ్ సముద్ర తీర ప్రాంతంలో జనవరి 16న అనూహ్య డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. నాసిక్ వాసి చంద్రభాన్ అనే పాత నేరస్తుడు అనూహ్యను అత్యంత దారుణంగా డబ్బుల కోసం హత్య చేసినట్లు తేల్చారు. అయితే పోలీసులు చెప్పినదానికి, నిందితుడు వెల్లడించిన విషయాలకు పొంతన కుదరలేదు. అయినా ముంబయి పోలీసులు కేసును క్లోజ్ చేశారు.
బియాస్ విషాదం
హైదరాబాద్కు చెందిన బాచుపల్లి వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు విద్యార్థులు ఈ ఏడాది జూన్ మొదటి వారంలో విహార యాత్రకు వెళ్లారు. 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్‌నదిపై నున్న లార్జీ డ్యామ్ వరద ప్రవాహంలో కోట్టుకుపోయి 24 మంది విద్యార్థులు (ఒక టూర్ ఆపరేటర్ కూడా) మృత్యువాత పడ్డారు.
చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలి 61మంది మృతి
రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి కూలి పనులు చేసుకుంటున్న 61 మంది అసువులు బాశారు. చెన్నైలో జూలై 4వ తేదీన నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మరణించినవారిలో ఎక్కువమంది తెలుగువాళ్లే. వీరంతా విజయనగరం జిల్లాకు చెందిన వలస కూలీలే. . వారం రోజుల పాటు 'ఆపరేషన్ రక్ష' పేరిట శిథిలాల తొలగింపు చేపట్టి.. మృతదేహాలతో పాటు, బతికున్నవారిని బయటకు తీశారు.
మాసాయిపేట రైలు ప్రమాదం
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే గేటు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు 25మంది విద్యార్థులు మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. జూలై 24వ తేదీన విద్యార్థుల్ని తీసుకు వెళుతున్న కాకతీయ టెక్నో స్కూల్ బస్సుని నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
వణికించిన స్నేక్ గ్యాంగ్...
స్నేక్ గ్యాంగ్ . అంటే చాలు భయంతో చెమటలు పట్టేస్తాయి. రాక్షసక్రీడ కోసం అమ్మాయిలతో ఈ రేపిస్టులు ప్రవర్తించే తీరు, వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాములను యువతులపై విసరడం, భయంతో బిక్కచచ్చిపోయిన ఆమెను వివస్త్రను వీడియోలు తీస్తూ, సామూహిక అత్యాచారానికి పాల్పడటం. ఇలా పాతకాలం సినిమాను తలపించే యదార్ధ ఘటన 2014 సంవత్సరంలో హైదరాబాద్‌కు మాయనిమచ్చ. జూలై 31న పహాడీషరీఫ్ షాయిన్ నగర్‌లో స్నేక్ ముఠా సభ్యులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటనలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హదూద్ తుఫాన్ విలయం
హుదూద్ తుపాను రూపంలో జలరక్కసి ఉత్తరాంధ్రను కాటేసింది. ప్రచండ వేగంతో తాకిన తుపాను ధాటికి విశాఖ నగరం విలవిలలాడింది. ఉక్కునగరం మూగబోయింది. అందాల సాగరతీరం తుడుచుకుపోయింది. అక్టోబర్ 12న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సంభవించి హుదూద్ తుపాను ధాటికి 60మంది మృతి చెందారు. హుదూద్ తుపాను వల్ల ఉత్తరాంధ్రకు దాదాపు లక్షకోట్ల రూపాయల మేర నష్టం జరిగింది.
జమ్మూ కాశ్మీర్ వరదలు, 277మంది మృతి
జమ్మూకాశ్మీర్ను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో 277 మంది మృతి చెందారు. గత 112 ఏళ్లలో కనీవినీ ఎరగని రీతిలో భారీ వరదలు ముంచెత్తాయి. సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలతో పాటు ప్రధాన నదులన్నీ పోటెత్తడంతో వరదలు కారణంగా సుమారు 2,600 గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాంతో సాంకేతిక, సమాచార వ్యవస్థ పని చేయడంలేదు.
కంఠనాథ్ ఆలయంలో తొక్కిసలాట
మధ్యప్రదేశ్ సాత్నా జిల్లా చిత్రకూట్‌లోని కంఠానాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. సెప్టెంబర్ 25న జరిగిన ఈ దుర్ఘటనలో పదిమంది భక్తులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
బుర్ద్వాన్ పేలుళ్లు
పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంట్లో అక్టోబర్ 2వ తేదీన బాంబు పేలుడు సంభవించి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ కేసులో కీలక నిందితుడు షహనూర్ ఆలంను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.
రావణ దహనంలో తొక్కిసలాట: 32మంది మృతి
బీహార్ పాట్నాలోని గాంధీ మైదాన్లో అక్టోబర్ 4వ తేదీన రావణ దహనం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 32మంది మృతి చెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు.
క్యాబ్ డ్రైవర్ రేప్.. ఉబర్ పై నిషేధం
అమెరికాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ సర్వీస్ 'ఉబర్' పై ఢిల్లీలో నిషేధం విధించారు. డిసెంబర్ 5వ తేదీన ఉబెర్ సంస్థకు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ ... 27 ఏళ్ల మహిళా ఎగ్జిక్యూటివ్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు శివకుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ దారుణంపై నిరసనలు వెల్లువెత్తడంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఉబెర్ సేవలపై నిషేధం విధించారు.
అస్సాం నరమేధం...
అస్సాంలో బోడో తీవ్రవాదుల నరమేధం సృష్టించారు. డిసెంబర్ 24న సోనిత్ పూర్, కోక్రాఝర్ జిల్లాల్లో ఆదివాసీ గ్రామాలపై మెరుపు దాడులు చేశారు. ఈ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 89కి చేరింది. మరోవైపు మహిళలు అని కనికరించకుండా బోడో తీవ్రవాదులు విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరిపి హింసాకాండకు పాల్పడ్డారు.
2014: విషాదాలు.. ప్రమాదాలు
Published Fri, Dec 26 2014 11:25 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement