ఆ తొమ్మిది మంది మాటేమిటి?
సియాచిన్‌లో మంచు గడ్డల కింద కప్పడి పోయిన లాన్స్ నాయక్ హనుమంతప్ప, తర్వాత ఆసుపత్రిలో మరణించాడని తెలిసిందే. ఆయనకు నివాళులర్పించడం సము చితం, అందుకు ఆయన అర్హుడే. సగం విగతజీవిగా ఉన్న ఆయనను దేశమంతా ఊపిరి బిగబట్టి చూసింది. ఆయనను గుండె దిటవుగల యోధునిగా అభివర్ణించి దేశం కోసం ఆ సైనికులు చేసిన త్యాగాలను జాతి గుర్తించింది. సియాచిన్ మంచుకొండలపై అత్యంత ప్రమాదకర విధులను నిర్వహిస్తూ హనుమంతప్పతో పాటూ మరణించిన తొమ్మిది మంది సహ సైనికులు ఆయనకంటే తక్కువ వారు అవుతారా? వారికి గుర్తింపు లేకుండా పోవాల్సిందేనా? వారి గురించి మీడియా తెలిపిన దాన్ని బట్టి చూస్తే, వారి పేర్లు గుర్తుండటమూ కష్టమే.
ఆ మాటకొస్తే, వాతావరణ సంబంధమైన కారణాలతో 2015 డిసెంబర్ మధ్య వరకు ఆ మంచుకొండలపై ప్రాణాలు కోల్పోయిన దాదాపు 869 మంది సైనికుల గురించి గుర్తుంచుకోవడమూ కష్టమే. నాటకీయతను అల్లడానికి ఉపకరిస్తుందనుకునే ఏ విషయం వెంటైనా మీడియా ఉద్వేగంతో కొట్టుకుపోతుంటుంది. దాని వల్ల లబ్ధిని పొందే వారు... ఈ సందర్భంలో సైన్యం... సంస్థాగతమైన తమ ధీరోదాత్త, సాహస సంస్కృతికి ఒక వ్యక్తిని ఉత్ప్రేక్షగా మార్చడాన్ని అభ్యంతరపెట్టదు. తాత్కా లికమైనదిగా లేదా చంచలమైనదిగా ఉండే మీడి యా ఆసక్తిని ఉపయోగించుకోగలగడం చక్కటి ప్రజాసంబంధాల నిర్వహణ అవుతుంది. కానీ సైన్యం అలాంటి ప్రచారాన్ని కోరుకోదనడంలో అనుమానమే లేదు.
ఒక సంక్షోభం, దాని పర్యవసానాలకు సంబంధించి, తోటి సహచరుల నుంచి వేరుచేసి ఒకే ఒక్క వ్యక్తిపై దృష్టిని కేంద్రీకరింపజేసినందుకు మీడియా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. సున్నా కంటే తక్కువ అతిశీతల పరిస్థితుల్లో గాలి ఇరుక్కున్న మంచుగడ్డల సందులో చిక్కుబడి పోకపోవడమూ, యోగాసనాలు వేసి ఉండక పోవడమూ మిగతా వారు చేసిన తప్పా? ఠీవిలోసింహంలాగా, ఒక బృందంలో ఎప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఉన్నవారు ఒకరుంటారు. ఆ ఒక్కరే అందరి దృష్టిని ఆకర్షిస్తారు.
సైన్యం, రెండు ముందస్తు షరతులపై ఆధారపడి పని చేస్తుంది. నాయకత్వ శ్రేణికి కట్టు బడి ఉండటం ద్వారా విజయం సాధించే పక్షంగా నిలవడం. ఇక రెండవది, సమష్టి కృషి. మంచు కొండ చ రియ విరిగిపడ్డప్పుడు, ఆ బృందంలో ప్రతి ఒక్కరూ తమ గురించి తామే గాక, తమ తోటి సైనికుని గురించి కూడా ఆలోచించే ఉంటారు. తామంతా చనిపోగా, తనకు ఒక్కడికే దిటవు గుండె గల యోధునిగా గుర్తింపు లభించడాన్ని హనుమంతప్ప కొపడ్ సైతం ఇష్టపడకపోవచ్చు. ఆయనే గనుక బతికి ఉంటే తన అదృష్టానికి, తనకు లభించిన శిక్షణకు ధన్యవాదాలు అర్పించేవాడు, తన తోటి సైనికుల కోసం దుఃఖించేవాడు.
ఈశాన్య భారతంలో వలే మన సైన్యం అంతర్గత శాంతి పరిరక్షణ విధులను సైతం నిర్వహిస్తోంది. వారక్కడ సైనిక విధులను నిర్వహిస్తున్నది సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం కిందనే అయినా, పలు నష్టాలను చవిచూస్తున్నారు. కశ్మీర్ లోయలో మన సైన్యం, బీఎస్‌ఎఫ్‌తో కలసి మిలిటెన్సీతోనూ, ఉగ్రవాదులతోనూ తలపడుతోంది. కొన్ని సందర్భాలలో అది పౌరులపై దౌష్ట్యానికి పాల్పడు తోందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నా ప్రాణ నష్టాలను చవి చూస్తోంది. అలా మరణిస్తున్న సైనికులపై మీడియా ఇంతటి ఆసక్తిని కనబరచదు. సైనికులకు సంబంధించి ఏం జరిగినా దానికి అది అలవాటుగా మారిపోవడమే అందుకు కారణం. ఒక మిలిటెంట్ ఒక సైనికుడ్ని పేల్చేసినా అది దైనం దిన ఘటనే అయిపోతుంది. అందులో నాటకీయత కనబడదు. నాటకీయతకు అవకాశమున్న దేన్నయి నా మీడియా లొట్టలేసుకుంటూ ఆస్వాదిస్తూ, రుచికరంగా వడ్డించడమే 24/7 వార్తా ప్రసారాలలో విలువను నిలబెట్టగల ఔషధమని భావిస్తోంది.
ఏదేమైనా మీడియా ఒక ఘటనను లేదా వ్యక్తిని లేదా ఇద్దరినీ తెగనాడేటప్పుడైనా లేదా కీర్తించేటప్పుడైనా గావు కేకలు పెట్టడం మానే యడం మంచిది. అలా అరవడం ఆ కథనం నిజ ప్రమాణాలను వక్రీకరిస్తుంది. దీనివల్ల అప్పుడ ప్పుడూ ప్రయోజనాలూ ఉంటాయి. అన్ని సందర్భా ల్లోనూ కాదని గుర్తుంచుకోవాలి. ఒక ఆడపిల్లపై జరిగిన పాశవిక అత్యాచారంపట్ల మీడియా చూపిన ఆసక్తి, అదృష్టవశాత్తూ మహిళల దుస్థితిపై దేశాన్ని జాగృతం చేయడానికి తోడ్పడింది.
మీడియా ఆమెను నిర్భయ పేరుతో ప్రచారం చేసింది. కానీ ఆమెకు ఆ పేరును పెట్టినది దాని అర్థాన్ని బట్టికాదు. ఆ క్షణంలో ఆమె ఉన్న పరిస్థితులూ, మహిళలను మగాళ్లు తృణీకారంతో చూసేలా, భోగ వస్తువుగా, పైశాచిక ఆనందాన్నిచ్చే వస్తువుగా సైతం భావించేలా మలచిన సమాజమూ కలసి ఆమెను నిస్సహాయురాలిని చేశాయి. నిజానికి ఆ ఘోర అత్యాచార ఘటన తదుపరి మహిళలపై అత్యాచారాల సమస్యను చేపట్టి ముందుకు నడచిన ఇతర మహిళలే నిర్భయలు. తమ గొంతులు విప్పాలని, బహిరంగంగా, మూకుమ్మడిగా ఎలుగెత్తాలని వాళ్లు నిశ్చయించుకున్నారు.
ఏవి వార్తలు, ఏవి కావని చూసే భిన్న పద్ధతు లు ఉన్నాయి. విషయ పరిజ్ఞానం గల పౌరులు ప్రజాస్వామ్యానికి ఆవశ్యకం. కాబట్టి ప్రజలకు అవసరమైన, నమ్మదగిన, ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం ఒక పద్ధతి. వివాదాలను ప్రేరేపించి, ప్రజా సమస్యలపై నిలువునా రెండు పూర్తి వ్యతిరేక దృక్పథాల శిబిరాలుగా చీల్చి అమర్యాదకరంగా పోట్లాడు కునేలా చేయడం మరో పద్ధతి. ఇక మూడోది, వివాదాన్ని వినోద కార్యక్రమంగా మార్చేయడం.
వార్తల పేరిట మీడియా మీకు అందిస్తున్నవి వాస్తవంగా మీ జీవితాలలో ఏమైనా మార్పును కలుగజేస్తాయా అని మీకు అనుమానం రాలేదా? సియాచిన్ మంచు కొండచరియ తుంచేసిన మిగతా తొమ్మిది మంది సైనికుల మృతి మీడియాను తాకనట్టుగా... ఆ వార్తలలో అత్యధికం మీ జీవితాన్ని తాకేవి కానే కావని అనిపించలేదా? మీడియా ద్వారా తరచుగా మనకు లభించేవి అనావశ్యక విషయాల హిమపాతాలే.
విశ్లేషణ; మహేష్ విజాపుర్కార్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com