పోరాటాలతో పదునెక్కిన చట్టం | A new law demand to raise on SC, STs rape threat | Sakshi
Sakshi News home page

పోరాటాలతో పదునెక్కిన చట్టం

Published Thu, Aug 6 2015 1:48 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

పోరాటాలతో పదునెక్కిన చట్టం - Sakshi

పోరాటాలతో పదునెక్కిన చట్టం

కారంచేడు హత్యాకాండ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధానికి కొత్త చట్టం తేవాలనే డిమాండు పుట్టింది. ఆనాటి ప్రజా ఉద్యమం, రాజకీయ ఐక్యతలే 1989 చట్టానికి జన్మనిచ్చాయి. చుండూరు ఉద్యమం తర్వాత, 1994లో గానీ దానికి మార్గదర్శక సూత్రాలు రూపొందలేదు. ఆ చట్టం అమలులోని సమస్యలు తొలగేలా మార్పుల కోసం మరో ఉద్యమం సాగించాల్సి వచ్చింది. అలా ప్రజా ఉద్యమాల  ఫలితంగానే నేటి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం సవరణలు జరిగాయి. చిత్తశుద్ధితో ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
 
 చుండూరు దళితుల నరమేధం జరిగి సరిగ్గా ఈ రోజుకి 24 ఏళ్ళు. కులాధి పత్యం న్యాయం పొరలను కమ్మేయగా... బాధితులకు న్యాయం అందినట్టే అందీ, అందకుండా పోయింది. అయితేనేం, అంతిమ విజయ కాంక్షతో నెత్తురు మరుగుతూనే ఉంది. గుంటూరు జిల్లా చుండూరులో ఈ రోజున దళి తులు సమావేశమై, అంతిమ విజయం తమదేనన్న ధీమాతో భవిష్యత్ పోరా టానికి సన్నద్ధం అవుతున్నారు. సరిగ్గా ఇదే సమయానికి, ఆగస్టు 4న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి చేసిన సవరణల బిల్లును లోక్‌సభ ఆమో దించడం ఆహ్వానించదగిన విషయం. 1989 నాటి ఆ చట్టం కొన్ని సవరణ లతో 1994 నుంచి పూర్తి స్థాయి ఆచరణలోకి వచ్చింది.
 
 అయితే ఇంకా అం దులో ఉన్న కొన్ని లోపాల వలన ఎస్సీ, ఎస్టీలపై దాడులకు, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడేవారు, వారికి వత్తాసు పలికే అధికారులు చట్టం నుంచి తప్పించుకొంటున్నారు. ఆ లోపాలను సరిదిద్దాలని గత పదేళ్ళుగా సాగిస్తున్న ఉద్యమం నేటికి ఫలించింది. కాంగ్రెస్ నాయకత్వంలోని  యూపీఏ 2 ప్రభు త్వ హయాంలోనే ఈ సవరణల బిల్లుకు రూపకల్పన జరిగింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని పార్ల మెంటరీ సంయుక్త సంఘానికి నివేదించింది. సుదీర్ఘ చర్చల అనంతరం అది 2014, డిసెంబర్‌లో ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది. గత బడ్జెట్ సమావేశా ల్లోనే పార్లమెంటులో ప్రవేశ పెడతారనుకున్న బిల్లు ఎట్టకేలకు ఈ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ ఆమోదం పొందింది.
 
 ఉద్యమాలతోనే రక్షణ చట్టాలు
 1989 నాటి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కన్నా ముందు షెడ్యూల్డ్ కులాలు, తెగల రక్షణకు రాజ్యాంగంలో పొందుపర్చిన వివిధ అధికరణాలకు, ముఖ్యంగా ఆర్టికల్ 17కు అనుగుణంగా అంటరానితనం నిషేధం కోసం ‘‘అంటరానితనం నేరాల చట్టం 1955’’ అమల్లోకి వచ్చింది. దీన్ని 1976లో ‘‘పౌరహక్కుల రక్షణ చట్టం’’గా మార్చారు. ఇందులో కూడా కొన్ని లోపాలు న్నాయని, ముఖ్యంగా ఇండియన్ పీనల్ కోడ్‌కు అనుగుణంగా ఇది లేదని భావించి 1989లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం తీసుకొచ్చారు.
 
 ఆంధ్రప్రదేశ్‌లో 1985 జూలై 17న జరిగిన కారంచేడు హత్యాకాండ దేశంలోనే సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ‘‘పౌరహక్కుల రక్షణ చట్టం’’ ఎస్సీ, ఎస్టీలపై హత్యాకాండ, అత్యాచారాలను నిరోధించడానికి సరిపోవడంలేదని, నూతన చట్టం తేవాలని  కారంచేడు ఉద్యమం డిమాండ్ చేసింది. రాజకీయా లకు అతీతంగా పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీ సభ్యులంతా ఆ మారణకాండకు  వ్యతిరేకంగా నిలిచారు. ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాఉద్యమం, రాజకీయ ఐక్యత కలసి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి జన్మనిచ్చాయి.
 
 ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం 1989లోనే జరిగినా, 1991 ఆగస్టు 6న చుండూరు మారణకాండ జరిగే నాటికి కూడా దాని అమలుకు మార్గదర్శక సూత్రాలు రూపొందలేదు. ఆ తర్వాత మూడేళ్లు దాటాక, అదీ చుండూరు మారణకాండకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఆ విషయమై విమర్శలు వెల్లువెత్తిన తర్వాతే, 1994లోగానీ మార్గదర్శక సూత్రాలు రూపొం దలేదు. ఆ తర్వాతా  అచరణలో చాలా సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా మారుతున్న పరిస్థితులను బట్టి నేరాల స్వరూపం మారింది. కేసుల నమోదు, పరిశోధన, విచారణలో అలసత్వం పేరుకుపోయింది. బాధితులకు పునరా వాసం, రక్షణలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టం అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు నిండిన సంద ర్భంగా 2009 జూన్‌లో ఒక జాతీయ స్థాయి సమావేశం జరిగింది.
 
 అది, 1989 చట్టం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించి, ఆ చట్టంలో  కొన్ని మార్పులు జరగాలని భావించింది. అలా మరో ఉద్యమం రూపుదిద్దుకుంది. దాదాపు 600 సంస్థలతో అందుకోసం జాతీయ స్థాయి వేదిక ఏర్పడింది. దాదాపు ఆరేళ్లు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం సాగింది. 18 రాష్ట్రాల్లో వందకు పైగా సమావేశాలు జరిగాయి. 2011లో జాతీయ న్యాయసంస్థలో 70 మంది న్యాయమూర్తులతో జరిగిన సదస్సు ప్రత్యేకించి ప్రభుత్వంపైన, ఇతర విభా గాలపైన బలమైన ప్రభావాన్ని కలుగజేసింది. 2012, నవంబర్ 26న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో దాదాపు 50 వేల మందితో జరిగిన బ్రహ్మాండమైన ప్రదర్శన ఈ డిమాండ్ పట్ల ప్రగాఢ ఆకాంక్షను వ్యక్తీక రించింది. గత అనుభవాల దృష్ట్యా ఈ చట్టం పటిష్టంగా అమలు జరగడానికి  కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. అలా ప్రజల నుంచి, ప్రజా ఉద్యమం నుంచి వచ్చిన కొన్ని ముఖ్య డిమాండ్లే నేడు చట్ట సవరణలుగా రూపుదిద్దుకున్నాయి.
 
 చట్టం పరిధి విస్తృతమైంది
 దేశంలో పలు సామాజిక, ఆర్థిక , రాజకీయ మార్పులు వస్తున్నా, కొత్త రూపా ల్లో అంటరానితనం  పుట్టుకొస్తూనే ఉంది. గత చట్టంలో లేని కుల వివక్ష, అణ చివేతకు సంబంధించిన అనేక అంశాలను చేర్చి, అలాంటి ఘటనలు నేరా లుగా మార్చారు. ఎస్సీ, ఎస్టీలకు చెప్పుల దండలు వేయడం, వారి బట్టలు ఊడదీయడం, వారిని నగ్నంగా, అర్ధనగ్నంగా ఊరేగించడం, వారి భూము లను ఆక్రమించుకోవడం, భూమి నుంచి వెళ్లగొట్టడం, ఓటు వేయకుండా నిరోధించడం, గృహాలను, ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయడం, వారి మహి ళలను లైంగికంగా వేధింపులకు గురిచేయడం, అవమానించడం తదితర మైనవి వాటిలో ముఖ్యమైనవి. గతంలో సాధారణ నేరాల పేరిట పలు సంద ర్భాల్లో అత్యాచారాల నిరోధక చట్టాన్ని ఉపయోగించేవారు కారు.
 
 తాజా సవ రణలతో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఎన్నికైన ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులను వారి విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం, దాడిచేసి గాయపర్చడం, బెదిరించడం, బహిష్కరణకు గురి చేయడం లాంటివి  తీవ్ర నేరాలవుతాయి. దళితులు, ఆదివాసీలు వారి వనరు లను, సామాజిక వనరులను ఉపయోగించుకోకుండా అడ్డుకోవడం, శ్మశానా లలోనికి రానివ్వకపోవడం, పెళ్ళి ఊరేగింపులపై నిషేధం, సైకిల్, మోటారు సైకిల్ నడపడాన్ని అడ్డగించడం, చెప్పులు వేసుకొన్న దళితులను కొట్టడం, తిట్టడం, వారిని దేవాలయాలు తదితర బహిరంగ స్థలాలలోకి ప్రవేశించ కుండా నిరోధించడం లాంటి వాటిని నేరాలుగా పరిగణించేలా చట్టాన్ని  బలో పేతం చేశారు. ఎస్సీ, ఎస్టీలను కిడ్నాప్ చేయడం, వారిపై రాళ్ళు రువ్వడం, గుంపులుగా ఏర్పడి బెదిరించడం వంటి వాటిని గతంలో సామాన్య నేరా లుగా చూసేవారు. ఇప్పుడది కుదరదు. అవి కూడా ఇప్పుడు అత్యాచారాల నిరోధక చట్టం పరిధిలోకే వస్తాయి.
 
 ఉపేక్ష, సాచివేతలకు చెల్లుచీటీ
 ఈ చట్టంలోని సెక్షన్ 4పై చాలా రోజులుగానే చర్చ జరుగుతున్నది. చాలా మంది పోలీసు అధికారులు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసులలో డబ్బులు లాగి, కేసులను ఎత్తివేయడానికి రాజీ కుదిర్చే వాళ్ళు.  ఈ సవరణల వల్ల ఇక అది కుదరదు. ఈ కేసులను పరిశోధించే పోలీసు అధికారుల తీరుతెన్నులను ప్రత్యేక కోర్టులు సమగ్రంగా సమీక్షిస్తాయి. తప్పు జరిగినట్టు భావిస్తే కోర్టులే నేరుగా శిక్షిస్తాయి. దీనికి ఎటువంటి ముందస్తు ఫిర్యాదు అక్కర్లేదు.  నేరం జరిగినా కేసులు నమోదు చేయకపోవడాన్ని, పరిశోధనలో జాప్యాన్ని సైతం ఈ చట్టం ఉపేక్షించదు. కేసు నమోదైన రోజు నుంచి 120 రోజుల లోపునే తీర్పులు వెలువడాల్సి ఉంటుంది.
 
 ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీలపై నేరాల విచారణకు నియమించే (డిజిగ్నేటెడ్) కోర్టులు ఇతర కేసులను కూడా విచారించాల్సి ఉండేది. వాటిని  అత్యాచార నిరోధక చట్ట సంబంధమైన కేసు లను మాత్రమే విచారించే ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ కోర్టులుగా మార్చారు. అలాగే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా ప్రత్యేకంగా నియమిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడితే, హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఆ కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక బాధితులకు, సాక్షులకు ప్రత్యేక రక్షణలు కల్పించారు. ఉదాహరణకు నిందితులకు బెయిల్ ఇస్తే బాధితులకు, సాక్షులకు తెలపాలి. నడుస్తున్న కేసు గురించి పూర్తి వివరాలను కోర్టే వీరికి అందించాలి.
 
 బాధితులు, సాక్షులపై దాడులు జరగకుండా ప్రభుత్వం తగు భద్రతను కల్పించాలి. బాధితుల తరఫున పనిచేస్తున్న సంఘాలను విశ్వా సంలోకి తీసుకొని, ఈ విషయాలన్నింటినీ వాటికి తెలియజేయాలి. గతంలో కులం తెలియక జరిగిన నేరాలనే సాకుతో అత్యాచార నిరోధక చట్టం వర్తిం పజేయకుండా దోషులను వదిలేసేవారు. మహారాష్ట్ర  ఖైర్లాంజి దారుణ ఘట నపై కూడా కోర్టు ఇదే  వైఖరిని అవలంబించింది. ఇకపై అటువంటి అవకాశం లేకుండా ఈ సవరణ చూస్తుంది. బాధితుల కులం నిందితులకు తెలిస్తే చాలు ఆ నేరం చట్టం పరిధిలోకి వస్తుంది.
 
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను నిరోధించడానికి ఈ చట్ట సవరణ మరింత తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. దళిత ఉద్యమాన్ని సజీ వంగా ఉంచి అత్యాచారాల నిరోధానికి అహరహం పోరాడుతూ, దళిత సమా జంలో నిత్య చైతన్యాన్ని నింపాల్సిన బాధ్యత దళిత కార్యకర్తలపై ఇంకా ఉంది. నూతన సవరణలతో పదునెక్కిన ఈ చట్టంపై విస్తృతంగా చర్చలు జరిపి, సమాజం మరింత సానుకూలంగా స్పందిస్తే తరతరాలుగా దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండకు ముగింపు పలికే దిశగా ఇదొక ముందడుగవుతుంది. అయితే చిత్తశుద్ధితో ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213
 - మల్లెపల్లి లక్ష్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement