
ఆరుద్ర పదాలు
- ఆగస్టు 31న ఆరుద్ర జయంతి
జప తపంబుల కన్న
చదువు సాముల కన్న
ఉపకారమే మిన్న
ఓ కూనలమ్మ
...ఈ నడకలో సాగే కూనలమ్మ పదాల్ని తొలిసారిగా చదివినప్పుడు 'అవి నన్నెంతో ఉత్తేజ పరిచాయి'అన్నారు ఆరుద్ర. 'వీటి దివ్యలాఘవం నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఛందస్సు ఆకర్షించింది. అనల్ప శిల్పం ఆశ్చర్య చకితుణ్ణి చేసింది' అంటూ, 'అంత్యప్రాసలు మనకు విజాతీయం కావని నిరూపించడానికి యీ పదాలను యెప్పుడేనా ఉపయోగించు' కోవాలనుకున్నారు. వాటి చరిత్రను ఆరా తీశారు.
'తంజావూరును పరిపాలించిన విజయరాఘవ నాయకుని ఆస్థాన కవి కోనేటి దీక్షిత చంద్రుడు 'విజయ రాఘవ కళ్యాణం' అనే యక్షగానంలో కూనలమ్మ పదాలకు 'పారడీ'ల వంటివి వ్రాశాడు. కాబట్టి 17వ శతాబ్దం నాటికి ఈ పదాలు దేశంలో చాలా సుస్థిరంగా వేళ్ళు తన్నుకున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చును' అని రాశారు ఆరుద్ర. 'నన్నెచోడుడి(12వ శతాబ్దం) నాటికే ఈ పదాలు చాలా ప్రచారంలో వుండేవని తలచవచ్చును' అని కూడా అన్నారు. దానికి నన్నెచోడుని 'కుమారసంభవం' లోని 'అలులొడగూడు/ బిండుగొని యాడు/ మృదుధ్వని బాడు...' లాంటి అంత్యప్రాస పద్యాల్ని ఉదాహరించారు.
'సంప్రదాయసిద్ధమైన దేశీ ఛందస్సు' లో ఉన్న ఇలాంటి కూనలమ్మ పదాలను ఆరుద్ర మిక్కిలి మక్కువగా రాశారు. వాటికి అంతే ప్రాచుర్యాన్నీ కల్పించారు. ఇంత సరళమైన పదాల్లో ఎంతో గొప్ప భావాన్ని చెప్పేట్టుగా తర్వాత్తర్వాత ఎందరో యువకవులకు ప్రేరణగా నిలిచారు. ఆరుద్ర జయంతి సందర్భంగా ఆయన రాసిన కొన్ని కూనలమ్మ పదాలు:
చిన్ని పాదము లందు
చివరి ప్రాసల చిందు
చేయు వీనుల విందు
ఓ కూనలమ్మ
సన్యసించిన స్వామి
చాలినంత రికామి
చాన దొరికిన కామి
ఓ కూనలమ్మ
బహు దినమ్ములు వేచి
మంచి శకునము చూచి
బయళుదేరఘ హా-చ్చి
ఓ కూనలమ్మ
కోర్టు కెక్కిన వాడు
కొండ నెక్కిన వాడు
వడివడిగ దిగిరాడు
ఓ కూనలమ్మ
గడ్డిపోచల పేని
గట్టి ఏనుగు నేని
కట్టువాడే జ్ఞాని
ఓ కూనలమ్మ
ఇజము నెరిగిన వాడు
నిజము చెప్పని నాడు
ప్రజకు జరుగును కీడు
ఓ కూనలమ్మ