స్మరణ:: కళలను గెలిచినరాజు... | Adavi Bapiraju Jayanti on october 8 | Sakshi
Sakshi News home page

స్మరణ:: కళలను గెలిచినరాజు...

Published Mon, Sep 30 2013 12:39 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

స్మరణ:: కళలను గెలిచినరాజు... - Sakshi

స్మరణ:: కళలను గెలిచినరాజు...

‘అతడు గీసిన గీత బొమ్మై..
అతడు పలికిన పలుకు పాటై

అతడు చూపిన చూపు మెరుపై అతడు తలచిన తలపు వెలుగై’...

అన్నాడు విశ్వనాథ- అడవి బాపిరాజు గురించి. అడవి బాపిరాజును ఒక్క పదంలో కుదించలేము. ఒక్క కళకు పరిమితం చేయలేము. ఒక్క రంగంలో మాత్రమే నిలువరించ లేము. ఆయన తెలుగువారి రవీంద్రనాథ్‌ టాగోర్‌ అంటే కాదనడానికి ఎవరికీ ధైర్యం చాలకపోవచ్చు. కథ, కవిత, సంగీతం, నాటకం, చిత్రకళ, నవల... ఇలా సకల రంగాలలోనూ ఆయన తన అపారమైన ప్రజ్ఞను ప్రదర్శించారు. అభిమానులను సంపాదించుకున్నారు.

ఆయన పుట్టింది భీమవరం కావచ్చుగాని కళాజగత్తే ఆయనకు ఊయల పట్టింది. రంగులూ రసమయ వాక్యాలే ఆయన బుగ్గలను పుణికి ఊహలను రేపి చేయి పట్టి తెలుగు సారస్వతంలో దోగాడమని దోవ చూపాయి. ఒకవైపు జాతీయోద్యమంలో పాల్గొనమని ప్రేరేపించే ఉడుకు నెత్తురు. మరోవైపు ప్రమోదకుమార ఛటోపాధ్యాయ వంటి గురువు సమక్షంలో కుంచె పట్టమని ఉసిగొలిపే కళాకాంక్ష. బి.ఎల్‌ చదివినా చట్టాలూ సెక్షన్‌ల కంటే కథలూ వెతలే ఆయనను ఆకర్షించాయి.

 ‘నారాయణరావు’ నవలతో ఆయన దాదాపుగా విశ్వనాథ ‘వేయి పడగలు’ సరసన నిలుచున్నారు. ‘తుఫాను’, ‘కోణంగి’ వంటి సాంఘిక నవలలు సరే ‘హిమబిందు’ వంటి చారిత్రక నవలలవైపు కూడా దృష్టి సారించారు. ఆ దారిలో ఆయన చేసిన ఉత్కృష్ట రచన ‘గోన గన్నారెడ్డి’. కాకతీయ పరిపాలనను నేపథ్యంగా తీసుకుని విశేష పరిశోధనతో మరుగున పడ్డ గాథను ముందుకు తెచ్చి తెలుగువారికి ఆయన ఇచ్చిన అద్భుతమైన వీరుడు గోన గన్నారెడ్డి. ఆయనకు చిరకీర్తి సంపాదించి పెట్టిన రచన. ‘అంజలి’, ‘తరంగిణి’, ‘రాగమాలిక’ వంటి కథాసంపుటాలు, ‘తొలకరి’, ‘గోధూళి’, ‘శశికళ’ వంటి కవితా సంపుటాలు, ఇంకా జలవర్ణ చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు, ‘కిన్నెరసాని’కి వేసిన బొమ్మలు... క్షణం విశ్రాంతి ఎరగక ఆయన సృజనలోకంలో మునిగితేలారు. అందుకు ప్రతిఫలంగా రసజ్ఞుల అభిమానం మూటగట్టుకొని కనకాభిషేకం పొందారు. ‘అతని హృదయంలోని మెత్తన... జీవికలోని తియ్యన’ ఇతరులకు సాధ్యం కాలేదు.

అడవి బాపిరాజు ఎప్పటికీ అవనతం కాలేని ఒక సారస్వత పతాకం.

- అక్టోబర్‌ 8 ఆడవి బాపిరాజు జయంతి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement