అందమున మొదటివారు...
అడివి బాపిరాజు అత్యుత్తమ వర్కుగా విమర్శకులు భావించే ‘నారాయణరావు’(1934) నవలలో భారతీయుల ఆహార్యం, ఆచారవ్యవహారాల గురించిన పరిశీలన ఒకటి ఇలా సాగుతుంది: ‘నారాయణరావు వివిధ దేశాల ప్రజల యాచార వ్యవహారములు, వివిధ దేశములలో బంటలు, ప్రజల కట్టుబొట్టులు, వర్తకసరళి మొదలైన విషయముల గూర్చి యుపన్యాసము నిచ్చినాడు. ఉత్తరదేశ ప్రజలు సిక్కులు, కాశ్మీర దేశస్థులు, పంజాబీయులు, పఠానులు, సరిహద్దు పరగణాలవారు చాలా బలమైనవారు. సంయుక్త పరగణాలవారు, మధ్య పరగణాలవారు, బిహారీయులు, రాజపుత్రులు, మహారాష్ట్రులు, ఆంధ్రులు రెండవరకమువారు. ఆఖరిరకము వంగము, అరవ, మళయాళిములవారు. కన్నడులు రెండవరకమునకు, ఆఖరి రకమునకు మధ్యనుందురు.
అందమున మొదటివారు కాశ్మీరదేశ స్త్రీలు. మంగుళూరువారు, మైసూరు వైష్ణవులు తరువాత. తర్వాత మళయాళివారు, రాజపుత్ర స్త్రీలు. కొంకణీయులు, గుజరాతీ, మహారాష్ట్ర, ఆంధ్ర, వంగ మొదలైన తక్కిన దేశములవారు తర్వాత, దాక్షిణాత్య స్త్రీ లాఖరున వచ్చెదరు.
కట్టులలో ఆంధ్రస్త్రీల నేటి కట్టు చాలా అందమైనది. తర్వాత మహారాష్ట్రపు కట్టు, అయ్యంగారి కట్టు తర్వాత. కథైవారీలు, రాజపుత్రస్థాన స్త్రీలు పరికిణిలు కట్టెదరు. సిక్కులు, కాశ్మీరదేశస్థ వనితామణులు లాగులు తొడుగుకొనెదరు. గుజరాతీ, ఉత్తరహిందూస్థానం, వంగదేశముల లలనలు చిన్న చీరలు కట్టెదరు. ఒక శాలువ పైన కప్పుకొనెదరు. అందరికట్టుకన్న అసహ్యమగు కట్టు ఒరియాదేశ స్త్రీలు కట్టెదరు’.