ఆళవందార్
రాజ గురువు అక్కి ఆల్వన్ పండితుడు. కానీ అమిత గర్విష్టి. దేశంలోని పండితులందరి వద్ద నుంచి కొంత పన్ను చెల్లించే ‘శాసనం’ రాజు చేత చేయిం చాడు. పండితులందరూ అతడంటే మండి పడుతుండేవారు. యమునత్ తురైవార్ అనే పిల్లవాడు చిన్నతనంలోనే గొప్ప పాండిత్యం ప్రదర్శిం చేవాడు. ఈ పిల్లవాడి గురువును కూడా ఆ పన్ను చెల్లించమని ఆదేశించాడు. దానితో ఆ పిల్లవాడు ఆగ్రహించి రాజ గురువుతో పండిత చర్చలో తనతో నెగ్గమని సవాలు చేశాడు. తాను ఓడిపోతే, తన గురువు పన్ను చెల్లిస్తాడన్నాడు.
‘‘పిల్లవాడివి, నువ్వెక్కడ! రాజగురువునైన నేనెక్కడ? ఈ హోదా కలిగిన నేను నీతో వాదించ డమా? అది జరిగే పనికాదు. నీవొక మూడు నకా రాత్మక ప్రకటనలు చేయి, ఆ మూడింటిని నేను కాదని నిరూపిస్తాను’’ అన్నాడు.
‘‘అయితే ఈ మూడింటిని మీరు కాదని నిరూపించండి. ఒకటి: ‘‘త్వం మాత వంధ్య’’. రెండు: ‘‘రాజ ధర్మవాన్’’. మూడు: ‘‘రాజపత్ని పతివ్రత’’. ఈ మూడింటిని రాజు గారి సమక్షంలో, సభాసదుల మధ్య కాదని నిరూపించండి!’’ అన్నాడు పిల్లవాడు.
రాజ గురువు ఆల్వన్ స్తబ్దుడయ్యాడు. ఓడి పోయినట్లు అంగీకరించాడు. రాణీ గారు ఈ బాలుణ్ణి చూసి చాలా సంతోషించారు. పిల్ల వాడిని తన వద్దకు తీసుకొని ‘‘ఆళవందారో (రక్షించడానికి వచ్చినవాడు) నన్ను పాలించడానికే వచ్చావయ్యా’’ అని ప్రశంసలు కురిపించింది. రాజ గురువు అక్కి ఆల్వన్‌కు జరిగిన గర్వభంగానికి ఆవిడ సంతసించింది.
అటు తర్వాత, ‘‘నువ్వు అయితే వీటిని ఎలా కాదనేవాడివో చెప్పవూ?’’ అని అడిగింది. అప్పుడా బాలుడు, ‘‘నేను ధర్మశాస్త్రాధారంగా వీటిని తిరస్క రించే వాణ్ణి. ఒకరే సంతానమున్న స్త్రీని సంతానవతిగా భావించరు. తన తల్లికి ఆల్వన్ ఒక్కడే కొడుకు. అందువల్ల ఆవిణ్ణి వంధ్యగానే భావించాలి.
ఇక రెండవ మాట. రాజ్యంలో జరిగే అధర్మ మంతా రాజు చెంతకే చేరుతుంది. అధర్మం ఎప్పు డైనా, అన్ని చోట్లా కనిపిస్తూనే ఉంటుంది. అందుచేత రాజు, స్వయంగా ధర్మపరుడై, ధర్మానుసారం పరిపాలిస్తున్నప్పటికీ, నేను ఉదహరించిన శాస్త్రాలను సవరించి రాజును అధర్మపరుడిగానే భావించాలి.
ఇక మూడవది. రాణి పతివ్రతే అనే మాటలో సందేహం లేదు. కానీ శాస్త్రాలననుసరించి ఆవిడ వివాహమాడేప్పుడు, ఓం ప్రథమంగా అగ్ని, ఇంద్రాది దేవతలు అయిదుగురిని పెళ్లాడుతుంది. వీరితో వివాహమైన తదుపరి, రాజుగారితో వివాహం అవుతుంది. ఆ లెక్కన గనక చూస్తే, ఆవిడ పతివ్రత కాదు’’ అని వివరించాడు.
తలుపు మూసిలేదు.
సాలిహ్ అనే గురువు తన శిష్యులతో, ‘‘తలుపు నెవరైతే ఆగకుండా తడుతూ ఉంటారో అలాంటి వారికి, చివరకు, ఆ తలుపు తెరుచుకుంటుంది’’ అని అంటుండేవాడు.
సాధు వనిత రాబియా, ఈ మాటల్ని విన్నప్పుడు ‘‘తలుపు తెరుచుకుంటుంది అని ఎంతకాలం ఇలా అంటూ ఉంటావయ్యా? తలుపును ఏ నాడూ మూసి వేయలేదు’’ అన్నది.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్