పాపా రామదాస్ అనే కేరళ ఆధ్యాత్మికుడు చెప్పిన రెండు కథలలోని నీతిని గ్రహించండి.
బ్రహ్మ నుంచి అమోఘమైన వరాలు పొందిన హిరణ్యకశిపుడు, దేవలోకం నుంచి దేవతలనందరినీ తరిమికొట్టాడు. ఆ వెంటనే వైకుంఠానికి వెళ్లగా, అక్కడి వారూ వెళ్లిపోయారు. విష్ణువు కోసం హిరణ్య కశిపుడు ముల్లోకాలను వైకుంఠం నుంచే శోధిం చాడు. ఎక్కడా కనిపించలేదు. హిరణ్యకశిపుడు నిర్గ మించిన తర్వాతే విష్ణువు వైకుంఠానికి తిరిగివచ్చాడు.
హిరణ్యకశిపుని దాడి, విష్ణువు పలాయనం అందరికీ తెలిసిపోయాయి. నారదుడి చెవిన కూడా పడింది. నేరుగా వెళ్లి ‘అతడు వచ్చినప్పుడు మీరు వైకుంఠం వదిలి పారిపోవడం ఎలా జరిగింది?’ అని అడిగాడు. అసాధారణ తపస్సుతో వరాలు సాధించిన ఆ రాక్షస రాజును ఎదు ర్కొనలేనని విష్ణువు ఒప్పుకున్నాడు. ‘ముల్లోకాలన్నిటినీ హిరణ్యకశి పుడు వెతికించినా కని పించలేదట. ఎక్కడ దాక్కు న్నారు?’ అడిగాడు నారదుడు. విష్ణువు కొంటెగా చూస్తూ, ‘ హిరణ్యకశిపుని హృదయంలోనే’ అన్నాడు. ఆశ్చర్యపోయిన నారదుడు ‘అంత సమీపంగా ఉన్న మిమ్మల్ని అతడెలా కనుగొనలేకపోయాడు?’ అని అడిగాడు.
‘తల వంచితే కదా అతడు నన్ను తన హృద యంలో చూడడానికి? హిరణ్యకశిపుడు తల వంచేది లేదనీ, ముల్లోకాలలో తనకన్నా అధికులెవ్వరూ లేరనీ భావిస్తుండేవాడు. తల వంచి తన హృదయంలోకి చూసే అవకాశం లేదనీ, నేనక్కడ సురక్షితంగా దాక్కో వచ్చనీ ఊహించాను’ అన్నాడు విష్ణువు.
రామదాస్ చెప్పిన రెండో కథ. మలబార్‌లో ఆజానుబాహువు, దృఢకాయుడు అయిన సాధువు ఉండేవాడు. సాధువు కాక ముందు పోలీసు శాఖలో పని చేస్తుండేవాడు. నడుముకు చుట్టుకున్న ఒక టవల్ మాత్రమే అతడి మొత్తం వస్త్రధారణ.
ఒక రోజున అతడు ‘భిక్షకై’వెళ్తుండగా ఓ గృహస్తు అతడి శరీర దార్ఢ్యం చూచి, ‘ఇలా భిక్ష ఎత్తే బదులు కష్టించి పనిచేసి ఆహారం సంపాదించుకోవచ్చుకదా’ అన్నాడు. ‘ఇంటి పెరట్లో ఓ చెక్కమొద్దు పడేసి ఉన్నది. అక్కడే గొడ్డలి ఉంటుంది. ఆ మొద్దు నుంచి రెండు కట్టె పేళ్లు కొట్టరాదా?’ అన్నాడు. సాధువు ఒక్కమాట కూడా అనకుండా, ఆ చెక్క మొద్దును పేళ్లుగా చీల్చి, వెళ్లిపోసాగాడు. అన్నం తిన కుండా సాధువు వెళ్లిపోతూ ఉండటం ఇంటి యజ మాని చూశాడు. సాధువుని పిలిచి, ‘విస్తట్లో పెట్టిన అన్నం తినకుండా వెళ్తున్నావేమి?’ అని అడిగాడు. ‘ పనిచేసిన చోట ఆహారం తీసుకోను. ఆహారం స్వీకరించిన చోట పని చేయను’ అని సమాధానమిచ్చాడు సాధువు.
మొదటి కథలో రాక్షసరాజు అహంకారం తల దించనివ్వకుండా చేసి హాని కలిగించింది. రెండవ కథలో, సాధువు తలవంచకపోవడం, గృహస్తులైన సంఘజీవులకు, సాధుపాత్ర యెడల ఉండాల్సిన గౌర వాన్ని సూచిస్తుంది. తలబిరుసు చేష్ట వేరు, ఆత్మగౌరవ చర్య వేరు.
తలవంచరు
Published Wed, Oct 28 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM
Advertisement