Neelam raju Laxmi prasad
-
తలవంచరు
పాపా రామదాస్ అనే కేరళ ఆధ్యాత్మికుడు చెప్పిన రెండు కథలలోని నీతిని గ్రహించండి. బ్రహ్మ నుంచి అమోఘమైన వరాలు పొందిన హిరణ్యకశిపుడు, దేవలోకం నుంచి దేవతలనందరినీ తరిమికొట్టాడు. ఆ వెంటనే వైకుంఠానికి వెళ్లగా, అక్కడి వారూ వెళ్లిపోయారు. విష్ణువు కోసం హిరణ్య కశిపుడు ముల్లోకాలను వైకుంఠం నుంచే శోధిం చాడు. ఎక్కడా కనిపించలేదు. హిరణ్యకశిపుడు నిర్గ మించిన తర్వాతే విష్ణువు వైకుంఠానికి తిరిగివచ్చాడు. హిరణ్యకశిపుని దాడి, విష్ణువు పలాయనం అందరికీ తెలిసిపోయాయి. నారదుడి చెవిన కూడా పడింది. నేరుగా వెళ్లి ‘అతడు వచ్చినప్పుడు మీరు వైకుంఠం వదిలి పారిపోవడం ఎలా జరిగింది?’ అని అడిగాడు. అసాధారణ తపస్సుతో వరాలు సాధించిన ఆ రాక్షస రాజును ఎదు ర్కొనలేనని విష్ణువు ఒప్పుకున్నాడు. ‘ముల్లోకాలన్నిటినీ హిరణ్యకశి పుడు వెతికించినా కని పించలేదట. ఎక్కడ దాక్కు న్నారు?’ అడిగాడు నారదుడు. విష్ణువు కొంటెగా చూస్తూ, ‘ హిరణ్యకశిపుని హృదయంలోనే’ అన్నాడు. ఆశ్చర్యపోయిన నారదుడు ‘అంత సమీపంగా ఉన్న మిమ్మల్ని అతడెలా కనుగొనలేకపోయాడు?’ అని అడిగాడు. ‘తల వంచితే కదా అతడు నన్ను తన హృద యంలో చూడడానికి? హిరణ్యకశిపుడు తల వంచేది లేదనీ, ముల్లోకాలలో తనకన్నా అధికులెవ్వరూ లేరనీ భావిస్తుండేవాడు. తల వంచి తన హృదయంలోకి చూసే అవకాశం లేదనీ, నేనక్కడ సురక్షితంగా దాక్కో వచ్చనీ ఊహించాను’ అన్నాడు విష్ణువు. రామదాస్ చెప్పిన రెండో కథ. మలబార్లో ఆజానుబాహువు, దృఢకాయుడు అయిన సాధువు ఉండేవాడు. సాధువు కాక ముందు పోలీసు శాఖలో పని చేస్తుండేవాడు. నడుముకు చుట్టుకున్న ఒక టవల్ మాత్రమే అతడి మొత్తం వస్త్రధారణ. ఒక రోజున అతడు ‘భిక్షకై’వెళ్తుండగా ఓ గృహస్తు అతడి శరీర దార్ఢ్యం చూచి, ‘ఇలా భిక్ష ఎత్తే బదులు కష్టించి పనిచేసి ఆహారం సంపాదించుకోవచ్చుకదా’ అన్నాడు. ‘ఇంటి పెరట్లో ఓ చెక్కమొద్దు పడేసి ఉన్నది. అక్కడే గొడ్డలి ఉంటుంది. ఆ మొద్దు నుంచి రెండు కట్టె పేళ్లు కొట్టరాదా?’ అన్నాడు. సాధువు ఒక్కమాట కూడా అనకుండా, ఆ చెక్క మొద్దును పేళ్లుగా చీల్చి, వెళ్లిపోసాగాడు. అన్నం తిన కుండా సాధువు వెళ్లిపోతూ ఉండటం ఇంటి యజ మాని చూశాడు. సాధువుని పిలిచి, ‘విస్తట్లో పెట్టిన అన్నం తినకుండా వెళ్తున్నావేమి?’ అని అడిగాడు. ‘ పనిచేసిన చోట ఆహారం తీసుకోను. ఆహారం స్వీకరించిన చోట పని చేయను’ అని సమాధానమిచ్చాడు సాధువు. మొదటి కథలో రాక్షసరాజు అహంకారం తల దించనివ్వకుండా చేసి హాని కలిగించింది. రెండవ కథలో, సాధువు తలవంచకపోవడం, గృహస్తులైన సంఘజీవులకు, సాధుపాత్ర యెడల ఉండాల్సిన గౌర వాన్ని సూచిస్తుంది. తలబిరుసు చేష్ట వేరు, ఆత్మగౌరవ చర్య వేరు. -
కర్మ చేయడానికే నీకు అధికారం
ఇది ఒక ఆంగ్ల కథలోనిది. ఓ మనిషి తన గదిలో నిద్రిస్తుండగా, అకస్మాత్తుగా ఆ గది అంతటా వెలుతురు నిండింది, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషి చేయదగిన పని ఉన్నదని అంటూ ఆ గది వెలుపల ఆరు బయట నున్న ఒక పెద్ద బండను చూపించి, ‘నీ శాయశక్తులా దానిని తోయాలి’ అన్నాడు. ఆ మనిషి పరమ విధేయతతో రోజూ దానిని తోస్తుండే వాడు. ఆవిధంగా ఏళ్లతరబడి తోస్తూనే ఉండి పోయాడు. ఇతడు తన భుజశక్తి ఎంత ప్రయోగించినా, ఎంత పట్టుదలతో చేసినా ఏ కొంచెమూ కదలలేదు. ‘ప్రతిరోజూ ఇంత శ్రమ చేసి, ఏమీ సాధించలేక పోయానే’అనుకుంటూ ప్రొద్దుకుంకే వేళకు తన గదికి తిరిగి వచ్చేవాడు. ‘రోజల్లా ఎంత నెట్టినా ఒక్క అంగుళం కదలడం లేదు. నేనీ శ్రమ అంతా ఎందుకు చేస్తున్నట్లు?’ అనే నైరాశ్యానికి గురయ్యాడు. ఇతడి నైరాశ్యభావం, సంశయం గమనించిన సైతాన్ ఇదే మంచి అదనుగా భావించి, అతడితో ‘చూడు బ్రదర్, నువ్వు ఆ బండను దీక్షగా నెట్టుతూనే ఉన్నావు. కానీ అది కదలడంలేదు. ఎందుకు నీవీ శ్రమ పడుతున్నట్టు?’ అని భగవంతుడి ఆజ్ఞనుల్లంఘించే దిశగా ప్రేరేపించాడు. ‘అవును నేనెందుకు ఈ అలవిమాలిన పనికి ఇంతగా శ్రమించడం? ఏదో భగవంతుడు ఆజ్ఞాపిం చాడు కాబట్టి తూతూ మంత్రంగా చేసినట్లు చేసి వదిలేస్తే, ఆజ్ఞాపాలన చేసినట్లే కదా? వృథా ప్రయాసనేనెందుకు పడుతున్నట్లు?’అని తలపోశాడు. భగవంతుడిని ప్రార్ధించేటపుడు ఆయనకు నివేదించి ఈ పథకాన్ని అమలుచేద్దామనుకున్నాడు. ‘దేవాదిదేవా, నేను నా యావచ్ఛక్తినీ వినియోగించి, నీ సేవలో చాలా పాటుబడ్డాను. ఒళ్లు దాచుకోకుండా శ్రమిస్తూ నీవు చెప్పిన పనిచేశాను కానీ ఇంత శ్రమకూ ఫలితమేమీ దక్కలేదు. ఆ బండరాయి ఒక్క రవ్వకూడా కదలలేదు. పొరపాటెక్కడ జరిగింది? నేనెందుకు విఫలుణ్ణవు తున్నాను?’ అని అడిగాడు. భగవంతుడు దయతో ఇలా అన్నాడు. ‘నువు నా సేవకు పూనుకున్నప్పుడు నేను ఆ బండరాయిని తోయమని మాత్రమే అన్నాను. నీకు చేతనైనంత చేశావు. దానిని నువు కదలించాలనీ, కదిలించగలవనీ నేననుకోలేదు. నీ పనల్లా దానిని తోయడం వరకే. నీవు నీ శక్తినంతా వెచ్చించి తోసి, శక్తి కోల్పోయానని నా వద్దకు వచ్చావు. కానీ, నీ ఓటమి నిజమా? నీ వంక నువ్వు చూసుకో. నీ చేతులు భుజాలు ఎంత గట్టిపడ్డాయో చూడు. కదలకుండా నుంచొని ఆ చలనరహితమైన రాయిని తోసినందువల్ల, నీ కాళ్లు ఎంత దృఢంగా రూపొందాయో చూడు. నీ నడుము ఎంత బలపడిందో గమనించు. ఒక కర్మ ఆచరించినందువల్ల ఏమి దక్కింది అనేది అటుంచి, ఆ ఆచరణద్వారా నువ్వేమైనావు అనేది గమనించు. రాయిని తోసినంత సేపు నన్ను తలచుకుంటూనే ఉన్నావు కదా? నీ మదినిండా నేనుండడం నిన్ను నాకెంత సమీపానికి తెచ్చిందో తెలుసా? రాయి కదలలేదనేమాట నిజమే అయివుండొచ్చు. కానీ నా ఆజ్ఞపాలించడమే నీ కర్తవ్యంగా పెట్టుకుని, నేను ఏదిచెప్పినా నీ మేలునుద్దేశించే చెప్పివుంటాననే నమ్మకంతో ఆజ్ఞాపాలన చేశావు. ఇక ఇప్పుడు ఆ బండను నేను కదిలిస్తాను’ అన్నాడు భగవంతుడు. భగవంతుడికి అసాధ్యమనేది లేదు. అతడు సర్వ శక్తిమంతుడు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
ఆచరణే అసలు పాఠం!
కాలిఫోర్నియాలో స్వామీ రామా అనే ఉత్తర హిందుస్థానీయుడు, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సైన్స్ అనే సంస్థను నడిపాడు. హిమాలయాల్లో యోగిగా జీవిస్తూ, గురువువద్ద చాలా కఠినమైన శిక్షణ పొందాడు. ఆ శిక్షణలో తాను పొందిన అనుభవాలను, వాటినుంచి తాను నేర్చుకున్న అంశాలను ఆయన చెప్పారు. ఒకసారి స్వామీ రామాతో గురువు ‘ఆకాశం వంక చూస్తూ నడువు’ అన్నాడు. ‘అదేమిటి అలా అంటారు? ఆకాశం వంక చూస్తూ నడుస్తూంటే తడబడి కింద పడనా?’ అని అన్నాడు రామా. ‘అయితే, తల దించుకుని నడువు. అప్పుడు తడబడాల్సిన అవసరం లేకుండా నడవవచ్చు. ప్రమాదభరిత యాత్రలో ముందుకు సాగడానికి నీవు నమ్రత కలిగివుండాలి. నమ్రత లేకపోతే ఏమీ నేర్వలేవు. నీ ఎదుగుదల అక్కడికక్కడే ఆగిపోతుంది’ అని గురువు చెప్పారు. హిమాలయ కొండల్లో రోజుకొకసారే భోజనం అంటారు స్వామీ రామా. ఒక్క చపాతీ, కాసిని కూరముక్కలు, ఓ కప్పు పాలు. ‘నేను అన్నానికి కూచొని ప్రారంభించబోతుండగా మా గురువు వచ్చి నాతో ఇలా అన్నారు: ‘వృద్ధుడైన ఓ స్వామి వచ్చారు. ఆకలిగొని ఉన్నాడు. నీ ఆహారం అతడికివ్వాల్సి ఉంటుంది’. ‘నేనూ ఆకలిగానే ఉన్నాను. ఇది వదులుకున్నానంటే, రేపటిదాకా నాకింకేమీ ఉండదు. అందువల్ల ఇవ్వలేను’ అన్నాను. ‘ఆ కాస్తకూ చచ్చిపోవులే. అతడికిచ్చెయ్. ఇచ్చేటపుడు ఇప్పటి ఈ మనసుతోకాక, నీ ప్రేమ కానుకగా ఇవ్వు’ అన్నాడు. ‘నేను ఆకలితో ఉన్నప్పుడు ఈ ఆహారాన్ని ఇంకొకరికి ప్రేమ కానుకగా ఎలా ఇవ్వను?’ అన్నాను. ఎంత చెప్పినా నేను వినకపోయేసరికి, ‘నిన్నిలా చేయమని ఆజ్ఞాపిస్తున్నాను!’ అన్నారు మా గురువు. వచ్చిన వృద్ధుడి గడ్డం తెల్లగా ఉంది. కాళ్లకి పావుకోళ్లు, కంబళీ, చేతికర్రతో కనిపించాడు. కొండల్లో ఒంటరిగా తిరుగుతున్నాడట. ‘మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఈ కుర్రవాణ్ణి ఆశీర్వదించండి’ అన్నారు గురువు. ‘అతడికి మంచినీళ్లిచ్చి, నీళ్లతో కాళ్లుకడుగు’ అన్నాడు నా గురువు. నాకిష్టం లేకపోయినా ఆయన చెప్పినట్లు చేశాను. దాని అర్థమేమిటో అప్పటికి నాకు తెలియలేదు. ఆయన్ని కూర్చోబెట్టి నేను తినబోయిన ఆహారం అతనికి పెట్టాను. అతడు నాలుగురోజులుగా ఆహారం లేకుండా ఉండిపోయిన సంగతి తర్వాత తెలిసింది. అతడు ఆహారం పుచ్చుకున్న తర్వాత ఇలా అన్నాడు, ‘భగవంతుడు నిన్ను ఆశీర్వదించుగాక. ఆహారం నీ ముందుకువచ్చినప్పుడు తప్పితే జీవితంలో నువ్వెన్నడూ ఆకలిగొనకుందువుగాక, ఇదీ నా దీవెన’ అన్నాడు. ఆ దీవెన ఫలించింది. ‘అతడి కంఠస్వరం ఈ నాటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఆనాటినుంచీ కోరికలతో సతమతమయ్యే నా తత్వంనుంచి విముక్తి చెందాను’ అంటాడు స్వామీ రామా. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
ఆళవందార్
రాజ గురువు అక్కి ఆల్వన్ పండితుడు. కానీ అమిత గర్విష్టి. దేశంలోని పండితులందరి వద్ద నుంచి కొంత పన్ను చెల్లించే ‘శాసనం’ రాజు చేత చేయిం చాడు. పండితులందరూ అతడంటే మండి పడుతుండేవారు. యమునత్ తురైవార్ అనే పిల్లవాడు చిన్నతనంలోనే గొప్ప పాండిత్యం ప్రదర్శిం చేవాడు. ఈ పిల్లవాడి గురువును కూడా ఆ పన్ను చెల్లించమని ఆదేశించాడు. దానితో ఆ పిల్లవాడు ఆగ్రహించి రాజ గురువుతో పండిత చర్చలో తనతో నెగ్గమని సవాలు చేశాడు. తాను ఓడిపోతే, తన గురువు పన్ను చెల్లిస్తాడన్నాడు. ‘‘పిల్లవాడివి, నువ్వెక్కడ! రాజగురువునైన నేనెక్కడ? ఈ హోదా కలిగిన నేను నీతో వాదించ డమా? అది జరిగే పనికాదు. నీవొక మూడు నకా రాత్మక ప్రకటనలు చేయి, ఆ మూడింటిని నేను కాదని నిరూపిస్తాను’’ అన్నాడు. ‘‘అయితే ఈ మూడింటిని మీరు కాదని నిరూపించండి. ఒకటి: ‘‘త్వం మాత వంధ్య’’. రెండు: ‘‘రాజ ధర్మవాన్’’. మూడు: ‘‘రాజపత్ని పతివ్రత’’. ఈ మూడింటిని రాజు గారి సమక్షంలో, సభాసదుల మధ్య కాదని నిరూపించండి!’’ అన్నాడు పిల్లవాడు. రాజ గురువు ఆల్వన్ స్తబ్దుడయ్యాడు. ఓడి పోయినట్లు అంగీకరించాడు. రాణీ గారు ఈ బాలుణ్ణి చూసి చాలా సంతోషించారు. పిల్ల వాడిని తన వద్దకు తీసుకొని ‘‘ఆళవందారో (రక్షించడానికి వచ్చినవాడు) నన్ను పాలించడానికే వచ్చావయ్యా’’ అని ప్రశంసలు కురిపించింది. రాజ గురువు అక్కి ఆల్వన్కు జరిగిన గర్వభంగానికి ఆవిడ సంతసించింది. అటు తర్వాత, ‘‘నువ్వు అయితే వీటిని ఎలా కాదనేవాడివో చెప్పవూ?’’ అని అడిగింది. అప్పుడా బాలుడు, ‘‘నేను ధర్మశాస్త్రాధారంగా వీటిని తిరస్క రించే వాణ్ణి. ఒకరే సంతానమున్న స్త్రీని సంతానవతిగా భావించరు. తన తల్లికి ఆల్వన్ ఒక్కడే కొడుకు. అందువల్ల ఆవిణ్ణి వంధ్యగానే భావించాలి. ఇక రెండవ మాట. రాజ్యంలో జరిగే అధర్మ మంతా రాజు చెంతకే చేరుతుంది. అధర్మం ఎప్పు డైనా, అన్ని చోట్లా కనిపిస్తూనే ఉంటుంది. అందుచేత రాజు, స్వయంగా ధర్మపరుడై, ధర్మానుసారం పరిపాలిస్తున్నప్పటికీ, నేను ఉదహరించిన శాస్త్రాలను సవరించి రాజును అధర్మపరుడిగానే భావించాలి. ఇక మూడవది. రాణి పతివ్రతే అనే మాటలో సందేహం లేదు. కానీ శాస్త్రాలననుసరించి ఆవిడ వివాహమాడేప్పుడు, ఓం ప్రథమంగా అగ్ని, ఇంద్రాది దేవతలు అయిదుగురిని పెళ్లాడుతుంది. వీరితో వివాహమైన తదుపరి, రాజుగారితో వివాహం అవుతుంది. ఆ లెక్కన గనక చూస్తే, ఆవిడ పతివ్రత కాదు’’ అని వివరించాడు. తలుపు మూసిలేదు. సాలిహ్ అనే గురువు తన శిష్యులతో, ‘‘తలుపు నెవరైతే ఆగకుండా తడుతూ ఉంటారో అలాంటి వారికి, చివరకు, ఆ తలుపు తెరుచుకుంటుంది’’ అని అంటుండేవాడు. సాధు వనిత రాబియా, ఈ మాటల్ని విన్నప్పుడు ‘‘తలుపు తెరుచుకుంటుంది అని ఎంతకాలం ఇలా అంటూ ఉంటావయ్యా? తలుపును ఏ నాడూ మూసి వేయలేదు’’ అన్నది. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
అసంకల్పిత శరణాగతి
‘శరణాగతి అనే విధానం గురించి మీరేమంటారు?’ అని జిడ్డు కృష్ణమూర్తి గారిని 1954లో బొంబాయిలో అడిగినప్పుడు, ‘‘సంకల్ప బలంతో చేసే సమ ర్పణ, శరణాగతి, నిజమైన శరణాగతి కాదం డీ! అది కేవలం తనని తాను విస్మరించడం, ఓ పలాయన సూత్రావలంబన; తనకు తానై భ్రమ కల్పించుకోవడం అవుతుంది. ఏవో కొన్ని పదాలు పునశ్చరణ చేయడంగా రూపొందుతుంది. ఇలా సంకల్పంతో కూడుకున్న శరణు కాక, సంకల్పించని శరణాగతి ఒకటున్నది. ఇది కోరుకు న్నదీ కాదు, అడిగిందీ కాదు. మనసు కోరుకుంటే సిద్ధిం చేది నిజమైన సమర్పణ కాదు. మనసు, తన పూనికతో చేసే పనులన్నీ మనసు కొనసాగింపే; కొనసాగింపంటే ‘కాల’మన్నమాట. కాలం ఆగితే కానీ, కాలాతీతమైన వాస్తవం ప్రత్యక్షమవదు. మనసు, తనంతట తాను సమర్పణ సాధించలేదు. మనసు చేయగలిగిందల్లా నిశ్చలంగా ఉండిపోవడమే, కానీ మనసులో నైరాశ్యంగానీ, ఆశగానీ తారట్లాడితే, ఆ నిశ్చలత్వం సిద్ధించదు. నైరాశ్యాన్ని తిన్నగా చూడాలి. నువ్వే దైనా కోరుకున్నావంటే, అది దక్కకపోతే - ఓ కారు అవనీ, ఒక స్త్రీ అవనీ, దేవుడవనీ - కోరడం, దేనిని కోరినా ఒకటే - అసలలా కోరుకోవడమే నైరాశ్యానికి నాంది. నైరాశ్యమంటే వైఫల్య భావన. నీవు కోరుకున్నది నీకు లభిస్తే తృప్తి చెందుతావు. నువు అనుకున్నది లభిం చకపోతే ‘భగవంతుడికి నన్ను నేను సమర్పించుకోవాలి’ అని అంటావు. కోరిక, బాధను తెస్తుందని నువ్వు స్వయంగా కను గొంటే ఆ ‘చూపే’ కోరికను నెమ్మదింపజేస్తుంది. ఎఱుకే ప్రధానమైనది. నైరాశ్యాన్ని తొలగించడమెలా అనేది కాదు. పరిశుభ్రమైన తెలివి కలిగుండటమంటే, ఈ ఎఱుక కలిగుండటమే. ఈ ఎఱుకలో, ఎంపిక లేదు - ఎంపిక లేని ఎఱుక; మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్ద స్థితిలో ఉన్నదల్లా ఒక్క ‘సత్తా’ మాత్రమే (బీయింగ్). అప్పుడు ఆ వాస్తవం, మనిషిని చకితుణ్ణి చేసే ఆ ‘కాలరహితమైన సృజనాత్మకత ‘ప్రత్యక్షమవుతుంది’. గుస్తావ్ ఫ్లబేర్ అనే ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత పూర్వం ‘మేడమ్ బోవరీ’ అనే నవల రాశాడు. ఆ నవల ఆ కాలంలోనూ, ఆ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చదువరులను ఆకర్షించింది. ఆ నవలపై కురి పించిన వెర్రి అభిమానం రచయితకు చివరకు విసుగు జనింపజేసింది. ఒకింత స్వైరవిహారిణిగా రూపొందిం చిన తన కథానాయకి ‘ఎమ్మా బోవరీ’ పాత్ర, తనకు ఖ్యాతి గడించిందో అపఖ్యాతి గడించిందో తెలియని పరిస్థితి ఉదయించింది. ఫ్ల బేర్ (రచయిత) పెద్ద తనంలో ఒంటరి వాడైపోయాడు; అతడి ప్రవర్తన కూడా వెర్రి మొర్రిగా ఉండేది. ఏదో విధంగా తగినంత ధనం సమకూర్చుకొని ఈ ‘మేడం బోవరీ’ ప్రతులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్ని టినీ క్రయం చేసి అగ్గిపాలు చేయాలనిపించింది; ఇక ఆ పుస్తకం పేరు కూడా మళ్లీ వినకూడదనుకున్నాడు. గ్రంథకర్త ఇలా తలపోస్తూనే ఉన్నాడు. ఆ పుస్తక మేమో పునః ముద్రణలు పొందుతూనే ఉన్నది. ఒకసారి ఒక ప్రెస్ రిపోర్టర్, గ్రంథకర్త ఫ్లబేర్ను, ‘నిజ జీవితంలో కథానాయకి ఎమ్మా బోవరీ ఎవరండీ?’ అని అడిగాడు. చిరాకుపడుతూ, గ్రంథకర్త ఫ్లబేర్ ‘నేను ఆ ఎమ్మా బోవ రీని’ అని సమాధానమిచ్చాడు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్