కర్మ చేయడానికే నీకు అధికారం | You have only right to do work | Sakshi

కర్మ చేయడానికే నీకు అధికారం

May 28 2014 1:34 AM | Updated on Sep 2 2017 7:56 AM

కర్మ చేయడానికే నీకు అధికారం

కర్మ చేయడానికే నీకు అధికారం

ఇది ఒక ఆంగ్ల కథలోనిది. ఓ మనిషి తన గదిలో నిద్రిస్తుండగా, అకస్మాత్తుగా ఆ గది అంతటా వెలుతురు నిండింది, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.

ఇది ఒక ఆంగ్ల కథలోనిది. ఓ మనిషి తన గదిలో నిద్రిస్తుండగా, అకస్మాత్తుగా ఆ గది అంతటా వెలుతురు నిండింది, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషి చేయదగిన పని ఉన్నదని అంటూ ఆ గది వెలుపల ఆరు బయట నున్న ఒక పెద్ద బండను చూపించి, ‘నీ శాయశక్తులా దానిని తోయాలి’ అన్నాడు. ఆ మనిషి పరమ విధేయతతో రోజూ దానిని తోస్తుండే వాడు. ఆవిధంగా ఏళ్లతరబడి తోస్తూనే ఉండి పోయాడు. ఇతడు తన భుజశక్తి ఎంత ప్రయోగించినా, ఎంత పట్టుదలతో చేసినా ఏ కొంచెమూ కదలలేదు. ‘ప్రతిరోజూ ఇంత శ్రమ చేసి, ఏమీ సాధించలేక పోయానే’అనుకుంటూ ప్రొద్దుకుంకే వేళకు తన గదికి తిరిగి వచ్చేవాడు. ‘రోజల్లా ఎంత నెట్టినా ఒక్క అంగుళం కదలడం లేదు. నేనీ శ్రమ అంతా ఎందుకు చేస్తున్నట్లు?’ అనే నైరాశ్యానికి గురయ్యాడు.
 
 ఇతడి నైరాశ్యభావం, సంశయం గమనించిన సైతాన్ ఇదే మంచి అదనుగా భావించి, అతడితో ‘చూడు బ్రదర్, నువ్వు ఆ బండను దీక్షగా నెట్టుతూనే ఉన్నావు. కానీ అది కదలడంలేదు. ఎందుకు నీవీ శ్రమ పడుతున్నట్టు?’ అని భగవంతుడి ఆజ్ఞనుల్లంఘించే దిశగా ప్రేరేపించాడు. ‘అవును నేనెందుకు ఈ అలవిమాలిన పనికి ఇంతగా శ్రమించడం? ఏదో భగవంతుడు ఆజ్ఞాపిం చాడు కాబట్టి తూతూ మంత్రంగా చేసినట్లు చేసి వదిలేస్తే, ఆజ్ఞాపాలన చేసినట్లే కదా? వృథా ప్రయాసనేనెందుకు పడుతున్నట్లు?’అని తలపోశాడు. భగవంతుడిని ప్రార్ధించేటపుడు ఆయనకు నివేదించి ఈ పథకాన్ని అమలుచేద్దామనుకున్నాడు.  ‘దేవాదిదేవా, నేను నా యావచ్ఛక్తినీ వినియోగించి, నీ సేవలో చాలా పాటుబడ్డాను. ఒళ్లు దాచుకోకుండా శ్రమిస్తూ నీవు చెప్పిన పనిచేశాను కానీ ఇంత శ్రమకూ ఫలితమేమీ దక్కలేదు. ఆ బండరాయి ఒక్క రవ్వకూడా కదలలేదు. పొరపాటెక్కడ జరిగింది? నేనెందుకు విఫలుణ్ణవు తున్నాను?’ అని అడిగాడు.
 
 భగవంతుడు దయతో ఇలా అన్నాడు. ‘నువు నా సేవకు పూనుకున్నప్పుడు నేను ఆ బండరాయిని తోయమని మాత్రమే అన్నాను. నీకు చేతనైనంత చేశావు. దానిని నువు కదలించాలనీ, కదిలించగలవనీ నేననుకోలేదు. నీ పనల్లా దానిని తోయడం వరకే. నీవు నీ శక్తినంతా వెచ్చించి తోసి, శక్తి కోల్పోయానని నా వద్దకు వచ్చావు. కానీ, నీ ఓటమి నిజమా? నీ వంక నువ్వు చూసుకో. నీ చేతులు భుజాలు ఎంత గట్టిపడ్డాయో చూడు. కదలకుండా నుంచొని ఆ చలనరహితమైన రాయిని తోసినందువల్ల, నీ కాళ్లు ఎంత దృఢంగా రూపొందాయో చూడు. నీ నడుము ఎంత బలపడిందో గమనించు.
 
 ఒక కర్మ ఆచరించినందువల్ల ఏమి దక్కింది అనేది అటుంచి, ఆ ఆచరణద్వారా నువ్వేమైనావు అనేది గమనించు. రాయిని తోసినంత సేపు నన్ను తలచుకుంటూనే ఉన్నావు కదా? నీ మదినిండా నేనుండడం నిన్ను నాకెంత సమీపానికి తెచ్చిందో తెలుసా? రాయి కదలలేదనేమాట నిజమే అయివుండొచ్చు. కానీ నా ఆజ్ఞపాలించడమే నీ కర్తవ్యంగా పెట్టుకుని, నేను ఏదిచెప్పినా నీ మేలునుద్దేశించే చెప్పివుంటాననే నమ్మకంతో ఆజ్ఞాపాలన చేశావు. ఇక ఇప్పుడు ఆ బండను నేను కదిలిస్తాను’ అన్నాడు భగవంతుడు. భగవంతుడికి అసాధ్యమనేది లేదు. అతడు సర్వ శక్తిమంతుడు.
 - నీలంరాజు లక్ష్మీప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement