బడ్జెట్ వార్షిక తంతు కారాదు
రైతాంగం వ్యవహారంలో ప్రభుత్వం అడపాదడపా కలుగజేసుకుంటున్నా, వారి ప్రయోజనాలకు భంగం కలిగించే రీతిలోనే ఆ ప్రమేయం ఉంటోంది. ఉదాహరణకి- స్థానిక మార్కెట్‌లో ఉల్లిపాయల ధర ఆకాశాన్నంటితే ప్రభుత్వం వెంటనే ఉల్లి ఎగుమతుల మీద నిషేధం విధిస్తుంది. నిజానికి మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు సంబంధించి ఒక కచ్చితమైన విధానమంటూ లేదు. ఒక పక్కన ఓజీఎల్ (ఓపెన్ జనరల్ లెసెన్సైస్) పేరుతో దిగుమతులకు అనుమతిస్తూనే, ఎగుమతుల మీద మాత్రం ఆంక్షలు పెడుతున్నారు.
దేశంలో ఎక్కువ శాతం జనాభాను ఆదుకుంటున్న రంగం వ్యవసాయమే. ఈ రంగాన్ని ప్రభుత్వ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి విడిపించే విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేయడం అవసరం. ఇందులో భాగంగానే ఆహార నిల్వల సేకరణను వికేంద్రీకరించాలి కూడా. ఈ కార్యక్రమంలో ప్రధాన బాధ్యతను రాష్ట్రాల భుజ స్కంధాల మీద ఉంచాలి. జనవరి పదహారున కేంద్ర ప్రీ బడ్జెట్ - 2015 సమావేశంలో పాల్గొని నేను చేసిన సూచనలలో ఇదొకటి మాత్రమే. రాబోయే బడ్జెట్ చర్చలలో రైతుల ప్రయోజనాలను చర్చించడానికి వెళ్లిన బృందంలో సభ్యునిగా ఉండేందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నాకు కూడా అవకాశం కల్పించింది. అక్కడ నేను సమర్పించిన పత్రంలోని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.
2015 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు సలహా సంప్రదింపులు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు ప్రతినిధిగా నాకు కూడా అవకాశం కల్పించినందుకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ సమావేశంలో అనేక రంగాల నుంచి వచ్చిన ప్రతి నిధులతో ఆర్థికమంత్రి చర్చలు జరిపారు. వీరంతా అనేక సలహాలు ఇచ్చారు. అయితే వీటి అమలు గురించి ఆర్థిక మంత్రిత్వశాఖ ఆలోచించాలని సవిన యంగా అభ్యర్థిస్తున్నాను. ఎందుక ంటే, బడ్జెట్ ప్రతిపాదన అనేది ఏటా నిర్వహించే ఒక తంతుగా ఈ ప్రభుత్వం కూడా భావించరాదని నా కోరిక. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఆవిర్భావంతో కొత్త యుగం ఆరంభమవు తుందన్న ఆశాభావంతో భారతీయులంతా ఉన్నారు. ‘చిరు ప్రభుత్వం, విస్తృత పరిపాలన’ అన్నదే తన ఆశయమని ప్రధాని మోదీ ప్రకటించు కున్నారు. ఇలాంటి సందర్భం కోసమే దశాబ్దాలుగా దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.
సేద్యం మీద శీతకన్ను తగదు
1990 దశకం నుంచి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఆరంభమైనాయి. అప్పటి నుంచి ప్రధానమంత్రి పదవులను అలంకరించిన వారంతా ఆ సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తూ వచ్చారు. మోదీ ప్రభుత్వం కూడా ఈ సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నందుకు సంతోషిస్తున్నాను. ఇంతకు ముందు ప్రభుత్వాలన్నీ కొన్నేళ్లుగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు స్వేచ్ఛ కల్పించాయి. దీనితో ఆ వర్గాలు కొంత వీర విహారం చేయగలిగే స్థితికి చేరుకోగలిగాయి. అయితే ప్రస్ఫుటంగా కనిపించే ఒక వాస్తవం ఏమిటంటే, వ్యవసాయ రంగం మీద ప్రభుత్వం శీతకన్ను వేసింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ రంగమే దేశ జనాభాలో 70 శాతా నికి పైగా జీవనోపాధిని కల్పిస్తున్నది. భారతదేశానికి ఆలవాలమైన గ్రామాలు చాలా వరకు సేద్యంతోనే మనుగడ సాగిస్తున్నాయి.
ప్రయోజనం లేని ప్రమేయం
ఒక పారిశ్రామిక వేత్త ఉత్పత్తి చేసిన వస్తువులను దేశంలో ఎక్కడైనా విక్రయిం చుకోవచ్చు. ఆ వస్తువుల ధరల నిర్ధారణకు సంబంధించి వారి మీద ఎలాంటి నిబంధనలు ఉండవు. అదే ఒక రైతు విషయంలో చూస్తే - అతడు నివశిస్తున్న రాష్ట్రం బయట కూడా తన కష్టంతో పండించిన వ్యవసాయోత్పత్తులను అమ్ముకోలేడు. విదేశాలకు ఎగుమతి చేసే స్వేచ్ఛ సంగతి అటుంచితే, కొందరు రైతులకు సంబంధించి, సొంత జిల్లాకు బయట కూడా ఆ ఉత్పత్తు లను అమ్ముకునే అవకాశం వారికి ఉండదు. రైతుల వ్యవహారంలో ప్రభుత్వం అడపాదడపా కలుగజేసుకుంటున్నా, వారి ప్రయోజనాలకు భంగం కలిగించే రీతిలోనే ఆ ప్రమేయం ఉంటోంది.
ఉదాహరణకి- స్థానిక మార్కెట్‌లో ఉల్లిపా యల ధర ఆకాశాన్నంటితే ప్రభుత్వం వెంటనే ఉల్లి ఎగుమతుల మీద నిషేధం విధిస్తుంది. నిజానికి మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు సంబంధించి ఒక కచ్చితమైన విధానమంటూ లేదు. ఒక పక్కన ఓజీఎల్ (ఓపెన్ జనరల్ లెసెన్సైస్) పేరుతో దిగుమతులకు అనుమతిస్తూనే, ఎగుమ తుల మీద మాత్రం ఆంక్షలు పెడుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచమంతా సరళీకరణ విధానాలు అమలులో ఉన్నాయి. కానీ దేశీయంగా మాత్రం సరళీకరణ కనిపించడం లేదన్నది సుస్పష్టం. వ్యవసాయోత్పత్తుల రవాణా మీద, ప్రొసెసింగ్ మీద, నిల్వ చేయడం మీద నిబంధనలు కొనసాగు తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకర విధానాలను విడనాడాలి. రైతు ప్రయోజనాలను కాపాడే సుస్థిర, పటిష్ట ఎగుమతి- దిగుమతి విధానాలను రూపొందించాలి.
ధృతరాష్ట్ర కౌగిలి విడిపించాలి!
సేద్యాన్ని ప్రభుత్వాల ధృతరాష్ట్ర కౌగిలి నుంచి, ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పద్ధతుల నుంచి విముక్తం చేసే విధానాలను రూపొందించాలని నా సలహా. ఆహార ధాన్యాల నిల్వల సేకరణ పద్ధతులను కూడా ఆ కొత్త విధానంలో అంతర్భాగం చేయాలి. సేకరణ బాధ్యతలో ఎక్కువ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) చేసే సేకరణ మీద ఇప్పుడు రాష్ట్రాలు రకరకాల పన్నులు, సుంకాలు విధిస్తున్నాయి. దీనితో ఆహార ధాన్యాల ధరలు టన్ను ఒక్కంటికి రూ. 2,500లకు చేరుకున్నాయి. ఆహార ధాన్యాల సేకరణ ప్రధానంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాల కోసమే జరుగుతోంది. అలాగే బఫర్ నిల్వలు (మార్కెట్‌లో ధరలను స్థిరంగా ఉంచే ఉద్దేశంతో చేసే వస్తు నిల్వలు)గా సేకరిస్తున్నారు. ముఖ్యంగా పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని కూడా అమలులోకి తెచ్చింది. అయితే ఆహార ధాన్యాలను కూడా ఖజానాను నింపే వనరులుగా ప్రభుత్వం భావించాలా? మద్యం మీద, సిగరెట్ల మీద పన్ను విధించడాన్ని అర్థం చేసుకోవచ్చు.
కానీ వరి, గోధుమ వంటి నిత్యావసరాల మీద పన్ను విధింపు అవసరం కాదు. వ్యవసాయ దిగుబడుల వ్యయం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందులో చాలా వైరుధ్యాలు ఉంటాయి. అందుకే ఈ వ్యయాలను గురించి రాష్ట్రాలే నివేదికలను సమర్పిస్తాయి. రైతులతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి, బోనస్ చెల్లించేవి కూడా రాష్ట్రాలే. పంటల కనీస మద్దతు ధరలను నిర్ధారించ డానికిగాను, రాష్ట్రాలు ఇచ్చే వివిధ నివేదికలన్నింటినీ ఏకీకృతం చేసే బాధ్య తను కేంద్రం స్వీకరించాలని కూడా సూచన. కనీస మద్దతు ధరను ద్రవ్యో ల్బణ సూచీతో కలపవచ్చు కూడా.
ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ఎందుకు?
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పది మౌలిక వసతుల కల్పన సంస్థలు తీసుకున్న రూ.6,31,064 కోట్ల రుణం పునర్‌వ్యవస్థీకృతమవుతోంది. ఇక వ్యవసాయ రంగానికి నేరుగా ఇచ్చిన మొత్తం అసాధారణ ఆర్థికసాయం రూ.5,31,701 కోట్లు. ఇది 4,39,47000 కోట్ల ఖాతాలకు సంబంధించిన మొత్తం. వ్యవసాయ రంగానికి ఇచ్చే ఆర్థికసాయం రూ.8 లక్షల కోట్లకు పెంచుతూ అరుణ్ జైట్లీ గత జూలై 10న బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు ఈ అం శాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే సరైన పంపిణీ వ్యవస్థ లేనందువల్ల ఈ పెంపు ప్రయోజనం నెరవేరదన్న ఆందోళన కలుగుతోంది. అలాగే ప్రతి ఇంటికి ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ (ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సమాచారాన్ని పంపిణీ చేసే వ్యవస్థ) ఏర్పాటును గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా పదే పదే మాట్లాడడం విస్మయం గొలుపుతోంది. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు గురించి మాట్లాడుతున్నవారు, ఇండియా- భారత్-లో వాస్తవిక పరిస్థితులను పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు.
మన గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ అధ్వానంగానే ఉన్నాయి. అక్కడి నివాసాలకు రోడ్డు సౌకర్యం, రవాణా లేనేలేవు. విద్య, ఆరోగ్యం, విద్యుత్ వ్యవస్థలు కూడా అక్కడ కరువే. విద్యుత్ లేని కారణంగా చలితోగాని, గాడ్పులతో గాని మరణిస్తే ఆ జనహననానికి బాధ్యత ప్రభుత్వానిదే అవు తుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యం అందిం చడంలో ప్రభుత్వాలు విఫలమైతే వారంతా ప్రైవేటు సేవల వైపు చూడవలసి వస్తుంది. ఇది అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. గ్రామీణ భారతంలో సామాజిక, భౌతిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే తప్ప, అక్కడ నుంచి పట్టణాలకు, నగరాలకు జరుగుతున్న వలసలను అరికట్టడం సాధ్యం కాదు. ఈ వలసలు పట్టణవాసులను మరిన్ని కడగండ్లకు గురిచేస్తున్నాయి. ఈ దుస్థితి నుంచి పట్టణవాసులను రక్షించడానికి ప్రత్యేక పథకాలతో ప్రభు త్వం ముందుకు రావాలి.
రెండు మౌలిక ప్రశ్నలు
రెండు మౌలిక ప్రశ్నలతో నేను నా సలహా పత్రాన్ని ముగించాను. రాష్ట్రాల పరిధిలో ఉన్న నీటి పారుదల, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి వ్యవస్థ లలో కేంద్రం జోక్యం కలిగించుకోవాలా? ఈ ధోరణిని భారత ప్రభుత్వం పూర్తిగా మార్చుకోవాలి. రాష్ట్రాలకు సంక్రమించే నిధులు, పన్నుల వాటాలలో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తే అవి మరింత సమర్థంగా వాటి కర్తవ్యాలను నిర్వర్తించగలుగుతాయి. ఆర్థికలోటును తట్టుకోవడానికి కేంద్రం అష్టకష్టాలు పడుతోంది. అందుకే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టబడుల ఉపసంహర ణను చేపట్టింది.
దేశంలో పొగ తాగడం మీద ఆంక్షలు ఉన్నాయి. అయితే ఐటీసీ (ఇండియన్ టొబాకో కార్పొరేషన్)లో ప్రభుత్వానికీ, ఇతర ఆర్థిక సంస్థలకీ మూడింట ఒక వంతు వాటాలు ఉన్నాయి. సిగరెట్ల ఉత్పత్తిలో ఐటీసీదే అగ్రస్థానం. ఇందులో ప్రభుత్వం తన పెట్టుబడులను ఉపసంహరిం చుకుంటే, రూ. 1,000 బిలియన్ల మేర లోటు తగ్గుతుందన్న సంగతిని ప్రభు త్వం గుర్తించాలని నా విన్నపం. ఇలాంటి ఉపసంహరణల విధానం వల్ల ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన రంగంలో పెట్టుబడులను పెంచుకో వచ్చు. అలాగే ప్రైవే టు రంగం మీద ద్వేషం అవసరం లేదు.
(వ్యాసకర్త రైతు నేత, మాజీ ఎంపీ)