ఛాందసవాదుల తిరోగమనం! | Another allegation on Sikkhus killing in 1984, Emergency | Sakshi
Sakshi News home page

ఛాందసవాదుల తిరోగమనం!

Published Tue, Nov 3 2015 1:28 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

ఛాందసవాదుల తిరోగమనం! - Sakshi

ఛాందసవాదుల తిరోగమనం!

ఎమర్జెన్సీని, 1984లో సిక్కులపై ఊచకోతలను ఖండించని మేధావులంతా బీజేపీపై పడుతున్నారని మరొక ఆరోపణ. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేధావులు గొంతు విప్పారు. జైళ్లకు వెళ్లారు. సిక్కుల ఊచకోతకు కూడా నిరసన తెలిపారు. సల్మాన్ రష్దీపై ఉగ్రవాదుల ‘ఫత్వా’కు వ్యతిరేకంగా ఉద్యమించారు. కాగా ఇప్పుడు రొమిలా థాపర్ చెప్పినట్టు సెక్యులరిజంపై నోరు విప్పడానికి మొదటిసారిగా పోలీసుల రక్షణ తీసుకోవాల్సి వస్తోంది.
 
 ‘దేశంలో మతపరమైన ఒంటెత్తు పోకడ విధానానికి సంస్కృతి గురించి ఏర్పరుచుకున్న కృత్రిమమైన వేర్పాటు ధోరణితో సంబంధముంది. ఈ సంకరమైన వంకర వైఖరికి సమాధానం యావత్తు భారతదేశం అందరి దీనన్న భావన దీప్తిమంతం కావడమే.’ భారతదేశంలో సాంస్కృతిక వేర్పాటువాదం, మతపరమైన ఒంటెత్తు పోకడల గురించి కలతపడిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ చెప్పిన మాట.బీజేపీ, ఆరెస్సెస్, ఎన్డీఏ హయాంలో ఇటీవలి కాలంలో దేశంలో పలు చోట్ల జరుగుతున్న పరిణామాల పట్ల సంస్కృతీ పరమైన వైవిధ్యం, భిన్న దృక్పథాలు కలిగిన శక్తులు ఆందోళన చెందుతున్నాయి.

భిన్న సంస్కృతు లతో, విశ్వాసాలతో, బడుగు బలహీన వర్గాలతో, జాతీయ మైనారిటీలతో, విభిన్న భాషలతో ఇంద్రధనుస్సులా విలసిల్లే ‘ఇండియా, దటీజ్ భారత్’లో ఇవాళ ఇంతగా ప్రజలు ఆందోళనకు గురికావలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో పాలకులు అర్థం చేసుకోవాలని రాష్ట్రపతి వరసగా ప్రకటనలు విజ్ఞా పనలు ఎందుకు చేయవలసి వచ్చింది?
 
 వెంటనే యోచించాలి
ఈ అంశాన్ని కాలహరణం లేకుండా అందరూ గుర్తించాలి. దేశవ్యాప్తంగా పాలకపక్షాలు, లేదా రహస్యంగా పనిచేసే వాటి అనుబంధ సంస్థలు సమా జంలో కృత్రిమంగా అనేక రూపాలలో సృష్టిస్తున్న అలజడులనూ, సాగిస్తున్న హత్యాకాండనూ గమనిస్తున్న రచయితలు, కవులు, చరిత్రకారులు, సామా జిక శాస్త్రవేత్తలు, కళాకారులు, నటులు, చిత్రకారులు, ప్రొఫెసర్లు, ఆర్థిక వేత్తలు ఎన్నడూ లేని స్థాయిలో ఎందుకు తమ బిరుదులను త్యాగం చేయ వలసి వచ్చిందో కూడా పాలకులు గమనించాలి. 250 మందికి పైగా మేధా వులు దశలవారీగానే అయినా, పెద్ద ఎత్తున దేశ అత్యున్నత పురస్కారాలను, అకాడమీ పురస్కారాలను తిప్పి పంపడం స్వతంత్ర భారత రాజకీయ, సాంస్కృతిక చరిత్రలోనే బాధాకరమైన పరిణామం. 1919లో జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్య్ర సమర యోధుల మీద జనరల్ డయ్యర్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినందుకు రవీంద్రనాథ్ టాగూర్ వంటి మహోన్నతులు తమకు ఉన్న బిరుదులను బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ముఖాన కొట్టవలసి వచ్చింది.

స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలను బీజేపీ-ఎన్డీఏ పాలకులు హరించి వేసే క్రమంలో ఈ బిరుదులను మేధావులు ప్రభుత్వానికి నిరసనగా వాపసు చేయడం ఇదే మొదటిసారి. ఇందుకు దోహదం చేసిన పూర్వరంగం ఎలాం టిది? ప్రగతివాదులు, ఆయా రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన హేతువాదులైన రచయితలు, ప్రసిద్ధ సామాజిక కార్యకర్తలు, సామాజిక దురన్యాయాల పట్ల ధ్వజమెత్తిన చైతన్య మూర్తులు దభోల్కర్, పన్సారే (మహారాష్ట్ర), కల్బుర్గీ (కర్ణాటక)లను 2014-15 మధ్యకాలంలో బీజేపీ పాలనలో ‘గుర్తు తెలియని’ వ్యక్తులు మట్టుపెట్టారు. ఈ దుర్ఘటనలకు ప్రధానమంత్రి సహా, పలువురు మంత్రులు చెప్పవలసిన రీతిలో ఆత్మీయంగా క్షమాపణలు తెలిపి, హంతకు లను శిక్షించకపోవడం ఒక వైపు జరుగుతూ ఉండగా, మరో వైపు రకరకాల వ్యంగ్యార్థాలతో భాష్యాలు చెప్పడమో, సీబీఐ విచారణ తతంగం పేరిట కేసులు ఒక కొలిక్కి రాకుండా కాలయాపన చేయడం జరుగుతోంది. లేదా కంటితుడుపుగా ఎవరో ఒకరిని ‘బుక్’ చేయడం జరుగుతోంది.
 
ఎక్కడైనా ఇలాంటి చర్యలు గర్హనీయమే
ఇలాంటి కిరాకత చర్యలకు పాకిస్తాన్‌లో మలాలా వంటి వారినీ, బంగ్లాదేశ్‌లో తస్లీమా నస్రీన్ వంటి భిన్నాభిప్రాయాలు ప్రకటించేవారిని, సెక్యులర్ భావా లతో పుస్తకాలు ప్రచురించిన అరిఫీన్ దీవన్, అహ్మదూర్ రషీద్ టూతుల్ వంటి వారిని హతమార్చే ప్రయత్నం జరిగినా కూడా ఖండించవలసిందే. భావ ప్రకటనా స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని హరించడానికి పాలకులు ఎక్కడ కుట్ర పన్నినా నిరసించవలసిందే. దేశాభివృద్ధి ధ్యేయమన్న నినాదంతో ఊదరగొట్టి ఓట్లు దండుకున్న మోదీ బృందం అధికారం సాధించిన తరువాత తమ ఎజెండా రూపురేఖలను మార్చుకోవడాన్ని దేశ ప్రజలు గమనిస్తు న్నారు.
 
 చివరికి వాణిజ్య, పరిశ్రమల వ్యవహారాల మీద ప్రధాని సలహా మండలి సభ్యుడు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సయితం ‘ఈ రోజున దేశంలోని మైనారిటీలలో భయాందోళనలు నెలకొన్నాయ’ని ప్రకటించవలసిరావడం గమనించాలి. ఈ విపరిణామం ఎంతవరకు పోయిందంటే, మూడీస్ , స్టాండర్డ్ అండ్ పూర్ వంటి అంతర్జాతీయ గుత్త మదింపు సంస్థలు ఆరెస్సెస్, బీజేపీ పాలకులను తీవ్ర పదజాలంతో హెచ్చ రించవలసి వచ్చింది. ఇప్పుడు దేశంలో జాతీయ మైనారిటీలలో అభద్రతా భావం పెరిగిపోతోంది.

భారతీయ జనతా పార్టీలోని వ్యక్తుల నుంచి, సభ్యుల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలను వింటున్నాం. ఈ పరిస్థితులలో తన పార్టీ సభ్యులను అదుపు చేయనైనా చేసుకోవాలి, లేదా అటు దేశంలోనూ ఇటు ప్రపంచ వ్యాపితంగానూ పరువు ప్రతిష్టలను కోల్పోవలసి వస్తుంద’ని ‘మూడీస్’ రేటింగ్ సంస్థ హెచ్చరించింది! ఈ హెచ్చరిక  (అక్టోబర్ 30) రెండు రోజులకే బీజేపీ మాతృసంస్థలలో ఒకటైన ఆర్‌ఎస్‌ఎస్ ‘అఖిల భారతీయ కార్యకారిణి మండల్’ రాంచీ సమావేశంలో ప్రసిద్ధ కర్ణాటక రచయిత కల్బుర్గి హత్య పట్ల ఇన్ని రోజుల తరవాత సంతాపం ప్రకటించటం ఒక వింత!

అంత కన్నా పెద్ద జోకు - తనకన్నా ‘ఛాందసవర్గం’ వేరే ఎవరో ఉన్నట్టుగా ఒకే తానులోని పీలికలుగా ‘స్టాండ్ బై’గా పెంచుతూ వచ్చిన చిల్లర మల్లర గ్రూపు లుగా ఉంటూ ‘హిందూత్వ’ పేరిట, ‘వైదిక సంస్కృతి’ పేరిట చెలామణి కావ డానికి ప్రయత్నిస్తున్న సంస్థల్ని ‘ఛాందస వర్గీయులు’గా పేర్కొనడం విశేషం.  కొందరు వేదాల్ని గురించి, సంస్కృతం గురించి, పురాణ కాలపు సంస్కృతి గురించి తరచుగా ప్రస్తావనలు చేస్తున్నారు. నిజానికి భారతీయ భావనా స్రవంతిలో, సంస్కృతిలో భౌతికవాదం, హేతువాదం కూడా అంతర్భాగంగా కొనసాగాయని మూఢమతులు గుర్తించాలి.
 
  ‘హిందూ మెటీరియలిజం’ గ్రంథంలో సుప్రసిద్ధ తాత్వికులు, సామాజిక ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ కెబీ కృష్ణ ఈ విషయాన్ని సహేతుకంగా నిరూపించారు: బుద్ధుడు వర్ణవ్యవస్థను ఖండిం చి, విగ్రహారాధనను నిరసించి, కులవ్యవస్థపై ఆధారపడే సమాజానికి విరు ద్ధంగా వృత్తులపై ఆధారపడే సమాజాన్ని పెంచిపోషించిన మహనీయుడని స్వామి వివేకానంద నివాళులర్పించాడు! బ్రాహ్మణ్యం నుంచి దూసుకు వచ్చిన మహాకవి అశ్వఘోషుడు కులవ్యవస్థపై ప్రత్యక్ష దాడికి దిగిన భౌతిక, హేతువాది. ఆ మాటకొస్తే రుగ్వేద కాలం నాటికే చైతన్యవంతమైన భారతీయ భౌతికవాదం వెలుగు చూసిందని అదే వేదంలోని ‘నాసదీయ సూక్తం’ (రుగ్వే దం: మండలం 10, సూక్తం 129) ఛాందస వర్గాలు సహా నేటి మనం కూడా మరవరాని జిజ్ఞాసను రేకెత్తించే ఒక మహాసత్యాన్ని రెండే రెండు ప్రశ్నలు సంధించడం ద్వారా ప్రకటించింది:
     1.    ‘భగవంతుడే ఈ సృష్టికి మూలమా?’
     2.    ‘ఇదే నిజమైతే ఈ సృష్టి జరిగిన తర్వాత వచ్చిన ‘భగవంతుడి’కి ఈ సృష్టి ఎలా జరిగిందో తెలుసా?’
 
 ఈ రెండు ప్రశ్నల ‘నాసదీయ సూక్తం’ చెప్పిన సమాధానం 2,500 సంవత్సరాల తర్వాత కూడా మందబుద్ధులకు సమాధానంగా మిగిలిపో యింది: ‘సృష్టి జరిగిన తరవాత వచ్చిన వాడు భగవంతుడు కాబట్టి అతను సృష్టికర్త కాడు, కాజాలడు’ అని తెగేసి చెప్పింది ఆసూక్తం! అంటే సృష్టి రహ స్యం జీవరసాయన క్రియ, ప్రతిక్రియల్లో ఉందన్నమాట!  భగవంతుడి గురిం చిన పేరుకుపోయిన ఊహలకు, అపోహలకు రామాయణంలోని జాబాలి వృత్తాంతం తెరదించేసింది! ఉపనిషత్తుల తర్వాతి కాలానికి చెందిన భౌతిక వాద, హేతువాద దార్శనికులు - అజితకేశ, కంబాలిక, పురాణ కాశ్యప, కాత్సాయన, మబాలి గోసాల, సంజయ బెలాతపుట్ట వంటి భౌతికవాదులు వేదకాలంలోనే ఉన్నారని మరచిపోరాదు! వీరంతా నాటి ఛాందసులు సాంఘిక పురోగతికి కల్పిస్తున్న అడ్డంకులను, ప్రతిఘటనా కుడ్యాలను అధిగ మించడానికి భౌతిక, హేతువాద వర్గాలు అనుసరించిన మధ్యే మార్గమే లౌకికవాదం.

అందుకే నాటి భౌతిక, హేతువాదుల్ని, ప్రగతివాదుల్ని ‘నాస్తి కులు’ అన్న అపవాదును రుద్దడానికి పునాది అంతా అప్పుడే అక్కడ పడిం దన్నమాట! ఇప్పుడూ అదే తంతు - ‘సర్వజనులూ సుఖంగా ఉండాల’న్న ఆర్యోక్తికి అర్థం మారిపోయింది? పైగా ‘హిందువులు, ముస్లింలు పోట్లా డుకొనే కంటే, దారిద్య్రంపై పోరాటం చేయండని’ పాలకులు బోధిస్తూనే, దారిద్య్ర నిర్మూలన బాధ్యతను ప్రభుత్వం చేపట్టకుండా ఆ బాధ్యత పౌర సమాజానిదేనని చెప్పి తప్పించుకో జూడటం!
 
ఎమర్జెన్సీని, 1984లో సిక్కు లపై ఊచకోతలను ఖండించని మేధావులంతా బీజేపీపై పడుతున్నారని మరొక ఆరోపణ. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేధావులు గొంతు విప్పారు. జైళ్లకు వెళ్లారు. సిక్కుల ఊచకోతకు కూడా నిరసన తెలిపారు. సల్మాన్ రష్దీపై ఉగ్రవాదుల ‘ఫత్వా’కు వ్యతిరేకంగా ఉద్యమించారు. కాగా ఇప్పుడు రొమిలా థాపర్ చెప్పినట్టు సెక్యులరిజంపై నోరు విప్పడానికి మొదటిసారిగా పోలీ సుల రక్షణ తీసుకోవాల్సి వస్తోంది! ఆశయాలు సంఘర్షిస్తున్న వేళ - అభ్యు దయ భారతం కోసం అభివృద్ధి భారతం కోసం ఈ వెంపర్లాట అనివార్యం!
 abkprasad2006@yahoo.com.in
 - ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement